Neelima Eaty, News18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్‌ప్లాంట్ (Vizag Steel Plant) కు ప్రత్యేక స్థానం ఉంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఎంతోమంది తమ ప్రాణాలొడ్డి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఇలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు స్టీల్ ప్లాంట్ లోపల ఏమేం ఉంటాయి.. వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ అందరికి లోపలకి వెళ్లేందుకు అనుమతి ఉండదు...అలాంటి వాళ్ల కోసమే స్టీల్ ప్లాంట్‌లో మిని మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ చరిత్ర విషయానికి వస్తే.. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు సైతం పాల్గొన్న ఈ ఉద్యమంలో 32 మంది ప్రాణాలర్పించారు.
1971లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారాన్ని 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.10వేలకోట్లను, 20 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది. తర్వాతకాలంలో ప్రభుత్వాలు మారుతుండటం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది.
ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి పూర్తి వివరాలు తెలిపేలా ఈ మినిమ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. వైజాగ్ స్టీల్ మ్యూజియం లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉక్కు మ్యూజియం సందర్శకులకు ఎంతో సమాచారాన్ని అందిస్తోంది. ఉక్కు కర్మాగారం మరియు దాని ప్రక్రియ గురించి మరింత అవగాహన కల్పించడం కోసమే దీన్ని ప్రారంభించారు.
ఈ స్టీల్ ప్లాంట్ మ్యూజియాన్ని 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి అరుణ సుందర రాజన్ ప్రారంభించారు.ఈ ప్రతిష్టాత్మకమైన కర్మాగారం గురించి విద్యార్థులకు, నగరవాసులకు, పర్యాటకులకు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు, అవగాహన కల్పించడం కోసం ఈ స్టీల్ మ్యూజియం అభివృద్ధి చేశారు.
ముడిసరుకు నుంచి తుది ఉత్పత్తి వరకు..!
ఈ మ్యూజియంలో స్టీల్ ప్లాంట్ ఎన్నో రకాల నమూనాలను ప్రదర్శించారు. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క అన్ని విభాగాలను ప్రదర్శించారు. టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని వివిధ నమూనాల ప్లాంట్‌లు కూడా ప్రదర్శించారు. యూనిట్లు అంటే.. బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్, కోక్ ఓవెన్లు, రోలింగ్ మిల్లులు, ముడి పదార్థాలు, ప్లాంట్ లేఅవుట్ మరియు ఇతర అవార్డు గెలుచుకున్న క్వాలిటీ సర్కిల్ వర్కింగ్ మోడల్‌లు కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటుచేశారు.
ముడి పదార్థాల దశ నుండి తుది ఉత్పత్తి వరకు ఉక్కు తయారీ ప్రక్రియ ఎలా జరుగుతుందో చాలా చక్కగా వివరించారు. వాస్తవానికి ఇవన్నీ భారీ యంత్రాలు అయినప్పటికీ…ప్లాంట్ ఉద్యోగులు తమ ఉత్సాహంతో, సృజనాత్మకతతో ఈ నమూనాలను తయారు చేశారు. ప్రధాన విభాగాలకు చెందిన అన్ని వర్కింగ్ మోడల్స్, స్టీల్ ప్లాంట్ లేఅవుట్‌తో పాటు కొన్ని వినూత్న నాణ్యత గల సర్కిల్ మోడల్‌లు కూడా ప్రదర్శించబడ్డాయి.
వైజాగ్ స్టీల్‌లో గ్రీన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. శారదాదేవి ట్రస్ట్ చొరవ తీసుకున్న 'జలధార' నమూనాను కూడా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఈ మ్యూజియం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మీతోటి ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తారు. అంతే కాదు మీకు గుర్తుగా అక్కడ అమ్మే కొన్ని ఆర్టికల్స్‌ను, బొమ్మలను కొనుగోలు చేసుకోవచ్చు.
అనుమతి తప్పనిసరి..!
ప్రతి ఏడాది దాదాపు పదివేలకు పైగా వివిధ వర్గాలకు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, పరిశ్రమలు, ఇతర రంగాలకు చెందిన విద్యార్థులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. మ్యూజియాన్ని సందర్శించే ముందు... లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ మేనేజ్‌మెంట్ నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. తద్వారా వాళ్లు మీకు అన్ని నమూనాలను చూపిస్తూ వివరిస్తారు. అయితే ఎలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు.
టైమింగ్స్ : ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఆదివారం సెలవు.
అడ్రస్: లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ (L&DC), విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, వైజాగ్, ఆంధ్రప్రదేశ్- 530031.
ఫోన్ నెంబర్: 9849231512, మెయిల్ ఐడీ: museum@vizagsteel.com
ఎలా వెళ్లాలి?
ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు 38Y, 400Y వంటి RTC బస్సుల్లో కూర్మన్నపల్లెకు మరియు స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్లవచ్చు. మీరు తెలుగు తల్లి విగ్రహాన్ని దాటాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam, Vizag Steel Plant