Andhra Pradesh; కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా కాసుల కక్కుర్తి. విజిలెన్స్ అధికారులకే షాక్
విశాఖలో కార్పొరేట్ ఆస్పత్రుల దందా
విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆస్పత్రుల లీలలు అన్ని ఇన్నీ కావు. కరోనా భయంతో ప్రజలు గజగజా వణుకుతుంటే.. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం కాసులు దండుకుంటున్నాయి. ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నాయి. కరోనా రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేస్తూ. వాటిని బయట విక్రయిస్తున్నాయి.
ఓవైపు కరోనా కాటు.. మరోవైపు వైరల్ ఫీవర్స్ ఉత్తరాంధ్ర ప్రజలు విలవిల లాడుతున్నారు. ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు అయిన విశాఖకు పరుగులు తీస్తున్నారు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. అసలే కరోనాతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుదిరితే ఇలాంటి సమయంలో వీలైనంత సాయం చేయాలి.. కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కొన్ని ఆస్పత్రులు. కరోనా భయంతో రోగుల బంధువులు ఏం జరుగుతోంది లోపలకు వెళ్లి చూసే పరిస్థితి లేదు. దీంతో తమ చేతి వాటం చూపిస్తున్నాయి.
తాజాగా విశాఖపట్నంలో జరిగిన విజిలెన్స్ దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నగరంలో కీలకమైన ప్రధాన జంక్షన్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రస్తుతం కరోనా భారీగా విస్తరిస్తున్న వేళ రెమిడిసివర్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇమ్యూనిటీ బూస్టర్లుగా భావిస్తున్నఈ ఇంజెక్షన్లకు మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. కోవిడ్ విజృంభణ చూస్తుండగానే తారస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతూ కొన ఊపిరితో ఉన్నవారిని రక్షించేందుకు ఉపయోగించే రెమిడిసివర్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.
కరోనా బాధితులకు ప్రాణదాతగా అంతా రెమిడిసివర్ ను భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రెమిడిసివర్ దొరకటం గగనమైపోయింది. ఎందుకంటే కరోనా చికిత్సకు అత్యంత కీలకమైన రెమిడిసివర్ ఇంజెక్షన్లే. కానీ ఇవి పేద, మధ్య తరగతి ప్రజలకు దొరకకపోవడంతో ఆస్పత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖపట్నంలో సోదాలు నిర్వహించిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రిలో ఓ నర్సుతో పాటు, హౌసింగ్ సూపర్ వైజర్ తో కలిసి వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
సాధారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగికి ఆరు రెమిడిసివర్ ఇంజక్షన్లు ఇవ్వాలి. అయితే రోగుల బంధువులు వెళ్తే వాళ్లకు ఆరు ఇంజక్షన్లు తెమ్మని చెబుతున్నారు. కానీ అలా ఆరు ఇంజక్షన్లు వారు తీసుకువస్తే.. రెండు మూడే రోగులకు ఇస్తున్నారు. మిగిలినవి బయట అమ్ముతున్నారు. బయట మార్కెట్ లో రెమిడిసివర్ కు పూర్తి డిమాండ్ ఉంది. ఒక్కో ఇంజక్షన్ ను 5 వేల నుంచి 6 వేల వరకు అమ్ముతున్నారు. తాజాగా విజిలెన్స్ సోదాల్లో ఒకే ఆస్పత్రి నుంచి ఏడు మెడిసివర్ ఇంజక్షన్లు బయట అమ్ముతుండగా పట్టుకున్నారు.
గత కొన్ని రోజుల నుంచి వీటిపై ఫిర్యాదులు అందడంతో పూర్తి నిఘా పెట్టిన విజిలెన్స్ అధికారులు ఏడు ఇంజక్షన్లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే వారిని విచారిస్తుండగా నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ప్రతి రోగి బంధువుకి చెప్పి ఆరు రెమిడిసివర్ ఇంజక్షన్లు తెప్పిస్తున్నామని.. అయితే అవి రోగులకు వేసినట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నాం.. తప్ప వేయడం లేదని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని అలా అమ్మారు? ఎక్కడ విక్రయిస్తున్నారు అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం చాలా వేగంగా వైరస్ విస్తరిస్తోంది. కరోనా చికిత్సకు అత్యంత కీలకమైన రెమిడిసివర్ ఇంజెక్షన్లు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. దీనికి తోడు ఉన్న కాస్తో కూస్తో ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తుండడంతో పేద, మధ్య తరగతుల్లో ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో.. వారికి సరైన వైద్యం అందడం లేదు. రెమిడిసివర్ అందుబాటులో లేకపోవడంతో పాటు.. డిమాండ్ కూడా పెరగడంతో.. రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు కార్పోరేట్ ఆస్పత్రులు.. కొన్ని ఫార్మా కంపెనీలు.. అలాగే డీలర్లు రంగంలోకి దిగుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.