Home /News /andhra-pradesh /

Visakhapatnam: విశాఖలో ఆరుగురి హత్య కేసులో కొత్త ట్విస్ట్. వెటకారపు నవ్వే కారణమా?

Visakhapatnam: విశాఖలో ఆరుగురి హత్య కేసులో కొత్త ట్విస్ట్. వెటకారపు నవ్వే కారణమా?

విశాఖలో ఆరుగురి హత్య కేసులో సంచలన ట్విస్టులు

విశాఖలో ఆరుగురి హత్య కేసులో సంచలన ట్విస్టులు

విశాఖ నరమేథంలో గంటకో ట్విస్ట్ బయట పడుతోంది. పోలీసుల విచారణలో నిందితుడు అప్పలరాజు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు. విజయ్ భార్య వెటకారపు నవ్వే తనలోకసి పెంచింది అంటున్నాడు. కేవలం 15 నిమిషాల్లో అందర్నీ అంతమొందించానని చెప్పాడు. అయితే ఈ హత్య కేసులో అప్పలరాజుతో పాటు మరికొందరు ఉన్నారంటున్నాడు బాదిత కుటుంబ సభ్యుడు విజయ్.

ఇంకా చదవండి ...
  ఆరు నెలల చిన్నారి.. రెండేళ్ల బాలుడు.. ఇలాంటి చిన్నారులను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలని అనిపిస్తుంది. కాసేపు ఎత్తుకొని లాలించాలి అనిపిస్తుంది. మరి అప్పలరాజు ఎంత దుర్మార్గుడైనా.. నరరూప రాక్షసుడిలా  ఎలా మారాడు. చిన్న పిల్లలను అంత కసిగా నరకాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు. ఎంత పాత కక్షలు ఉంటే మాత్రం చిన్నారులను కూడా ఇంత పాశవికంగా హత్య చేయాలా? కేవలం క్షణికావేశం అతడిని రాక్షసుడిగా మార్చేసింది. ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయేలా చేసిందా? అమ్మ ఒడిలో ఆడుకోవడం తప్పా ఏం తెలీదు వారికి. ఆకలి వేసినా చెప్పలేనంత చిన్నపిల్లలు.. హ్యాపీగా తల్లిచెంతనే నిద్రపోతున్న వారిని సైతం ఎందుకంత కిరాతకంగా హతమార్చాడు. అలా అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి రిషిత పైనా ఎందుకు కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. విశాఖలో పెను విషాదం నింపిన ఈ ఘటన ప్రతి ఒక్కరితో కన్నీరు రాల్చేలా చేస్తోంది.

  దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో గంట గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తానే నిందుతుడిని అని చెప్పి అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పటి వరకు ఈ కేసులో అప్పలరాజు ఒక్కడే నిందితుడు అని అంతా భావిస్తున్నారు. పోలీసులు కూడా అప్పలరాజు ఒక్కడే హత్య చేసినట్టు చెబుతున్నారు. కానీ ఈ హత్య కేసులో అప్పలరాజుతో పాటు మరో ఆరుగురు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు భాదిత కుటుంబానికి చెందిన విజయ్.

  ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకుంటేనే పోస్టుమార్టంకు ఒప్పుకుంటాను అంటూ కేజీహెచ్ మార్చురీ దగ్గర విజయ్ బైఠాయించాడు. బత్తిన అప్పలరాజుతో పాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శిక్షించాలని విజయ్ డిమాండ్ చేస్తున్నాడు. విజయ్ తో పాటు, ఆయన కుటుంబీకులు, బంధువులు అక్కడే బైఠాయించి ఆందోళన చేయడంతో కేజీహెచ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరి విజయ్ డిమాండ్ పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  మరోవైపు ఈ హత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది.  నిందితుడిగా ఉన్న అప్పలరాజు పోలీసుల విచారణలో కీలక విషయం చెప్పినట్టు తెలుస్తోంది. తాను వేకువజామున పాలు తీసుకోవడానికి వెళుతున్నతనను విజయ్ భార్య చూసి చాలా వెటకారంగా నవ్విందని.. ఆమెతో పాటు విజయ్ తండ్రి బమ్మిడి రమణ కూడా అప్పలరాజును చూసి వెటకారంగా నవ్వడంతోనే అవమానంగా భావించానని.. అందుకే ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకు వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న విజయ్ భార్యను ముందు నరికి చంపినట్టు చెప్పాడు అప్పలరాజు. ఆ తరువాత విజయ్ భార్య కేకలు వేయడంతో బయటకు వచ్చిన విజయ్ తండ్రి రమణ, ఆ కత్తి చూసి ఇంట్లోకి పరుగులు పెట్టాడని.. దీంతో అతడి వెంట పడి హత్యకు యత్నించాని.. అడ్డం వచ్చిన విజయ్ అత్త, చిన్న అత్తలను కూడా నరికి చంపాను అని పోలీసులకు నిందితులు అప్పలాజు చెప్పినట్టు తెలుస్తోంది.

  పదిహేను నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరు నిండుప్రాణాలు బలి తీసుకుని మారణహోమం సృష్టించాడు అప్పలరాజు. కేవలం పావు గంటలోనే నాలుగేళ్ల పగని తీర్చుకున్నాడు నర హంతకుడు అప్పలరాజు. ఉదయం 5 గంటల నుంచి ఆయుధంతో వేచి ఉన్న హంతకుడు అప్పలరాజు... 5.30 గంటలకు రమాదేవి తలుపు తీసిన వెంటనే.. హత్యాకాండ మొదలు పెట్టాడు. పిల్లా.. పెద్దా అనే తేడా లేకుండా విచక్షణ కోల్పోయి సైకోలా మారిపోయాడు. గేటు దగ్గర మొదలుపెట్టి.. వంటగది వరకూ సాగిన మారణహోమం పావుగంటలో ముగిసిపోయి. ఆరుగుర్ని విగతజీవులుగా మార్చేసింది. 5.45 గంటలకు బయటికి వచ్చిన కిరాతకుడు.. అరగంట పాటు రమాదేవి మృతదేహం పక్కనే కూర్చొని 6.15 కి 100 నంబర్‌కు డయల్‌ చేశాడు. 100 నుంచి 108కి ఫోన్‌ వెళ్లగా.. హుటాహుటిన అక్కడికి వెళ్లిన 108 సిబ్బంది వెళ్లే సరికి.. అటు ఇటూ తిరుగుతూ ఎవరొస్తారో రండి అంటూ హంతకుడు కత్తితో అటు ఇటు పచార్లు చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.

  ఈ హత్యకు అక్రమ సంబంధమే అసలు కారణమని స్థానికులు చెబుతున్నారు. అప్పలరాజు కూతురుని గతంలో విజయ్ అత్యాచారం చేసినట్టు కేసు కూడా నమోదైందని.. అప్పటినుంచే ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని.. ఆ కేసులో విజయ్ అరెస్టు కూడా అయ్యాడు. తరువాత బయటకు వచ్చినా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయంటున్నారు. వివాహేతర సంబంధంతో ఐదేళ్ల కిందట ప్రారంభమైన గొడవలే ఈ హత్యలకు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరో రెండు రోజుల్లో పెళ్లి సందడి మొదలవ్వాల్సిన ఇంట మరణ మృదంగం మోగడంతో పెందుర్తి మండలం జుత్తాడలో పెను విషాదం నెలకొంది. విషాద వార్త తెలుసుకొని విజయవాడలో నివసిస్తున్న చిన్నారుల తండ్రి విజయ్‌ రాకతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హంతకుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.

  అయితే రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు తలెత్తడానికి కారణమైన విజయ్ మాత్రం హత్య జరిగిన సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అతడి పెద్ద కుమారుడు కూడా బంధువులు ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో మిగిలాడు. అయితే విజయ్ మాత్రం ఈ హత్యకు భూతగాదాలే కారణమంటున్నాడు. తన ఇంటిపక్క ఉన్నప్లేస్ ను కబ్జా చేయడానికి అడ్డుపడుతున్న కారణంతోనే తనపై కక్ష పెంచుకున్నాడు.. అతడికి మరో ఆరుగురు సహకరించారని విజయ్ ఆరోపిస్తున్నాడు.

  ఎవరి వాదన ఎలా ఉన్నా పోలీసులు మాత్రం దీన్ని వివాహేతర సంబంధమైనా కారణం కావొచ్చు.. లేదా ఆస్తి తగాదాలూ మరో కారణమైనా ఉండాలి అనే కోణంలోనే విచారణ చేస్తున్నారు. విజయ్‌ ఇంటి పక్కన ఉన్న స్థలం హంతకుడు అప్పలరాజుకు చెందినది కాగా.. ఎదురుగా ఉన్న ఇల్లు అప్పలరాజు సోదరుడికి చెందినది. మధ్యలో విజయ్‌ ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మేయాలని పలుమార్లు అడిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా దాన్ని అమ్మేందుకు విజయ్‌ తండ్రి రమణ నిరాకరించడం, దానికి తోడు వివాహేతర సంబంధం బయటపడటం.. అప్పలరాజులో పగని పెంచింది. దాని వల్లే ఈ మారణహోమానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  సివిల్ కాంట్రాక్టర్‌ అయిన విజయ్‌ కిరణ్‌కు తల్లి ఆదిలక్ష్మి అంటే చాలా ఇష్టం. అమ్మ చనిపోయిన తర్వాత కుంగిపోయిన విజయ్‌.. తన బిడ్డగా అమ్మ పుడుతుందని భావించాడు. మొదటి, రెండో సంతానంగా కుమారులు పుట్టారు. కుటుంబ సభ్యులు భార్యకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించాలని చెప్పినా.. అమ్మ కచ్చితంగా పుడుతుందని విజయ్‌ నిరాకరించాడు. పూజలు, మాలధారణ చేసి మొక్కుకున్నాడు. చివరికి పూజలు ఫలించి ఆరు నెలల క్రితం చిన్నారి పుట్టింది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. అమ్మ పుట్టిందన్న ఆనందం ఆరు నెలలకే ఆవిరి చేసేశాడంటూ విజయ్‌ విలపించిన తీరు గ్రామస్తుల్నికంటతడి పెట్టించింది.

  ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ద్వారా సమాచారం అందుకున్న రాజ్యసభ సభ్యుడు వి.విజయ్‌సాయిరెడ్డి బాధితుడు విజయ్‌కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. జరిగిన ఘటనను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలకు ఘనంగా నివాళి అర్పించి జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. విజయ్‌ను ఓదార్చారు. ప్రభుత్వం తరపున సహకరిస్తామని చెప్పారు.

  మీ నగరం నుండి (విశాఖపట్నం)

  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Crime story, Visakha, Visakhapatnam,

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు