Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖ (Viskahpatnam) నగరం పండగ శోభను సంతరించుకుంది. జి-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టడంతో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి. రహదారులు, డివైడర్లు, ఫుట్ పాత్ లను సుందరంగా తీర్చిదిద్దారు. అతిథులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. విశాఖ నగరంలో జి-20 సదస్సు శోభ ఉట్టిపడుతోంది. బీచ్‌రోడ్డుతో పాటు ప్రధాన కూడళ్లు, మార్గాలన్నీ విద్యుత్ దీప కాంతులతో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 28, 29 , 30 తేదీల్లో జరిగే జి-20 సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ రూ.130 కోట్లు వెచ్చించి నగరంలో అభివృద్ధి, సుందరీకరణ, పెయింటింగ్‌లు పనులు చేపట్టింది.
కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ బీచ్‌రోడ్డుని ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుంచి, సదస్సు ముగిసి మళ్లీ తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకునే వరకు వారు తిరిగే మార్గాలు, బస చేసే హోటళ్లు, సందర్శించే ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్ పాత్ లను కొత్తగా నిర్మించి, రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.
ఆయా ప్రాంతాల్లోని కూడళ్లలో వాటర్ ఫౌంటైన్‌లు, కళాఖండాలను ఏర్పాటుచేసి విద్యుత్ దీపాలను అమర్చారు. రోడ్ల మధ్యన ఉండే డివైడర్లు, సెంటర్ మీడియన్ల లో మొక్కలకు రంగులు వేసి లైటింగ్ ఏర్పాటుచేశారు. రోడ్లను ఆనుకుని ఉన్న గోడలపై ఆలోచింపజేసేలా, మంచి సందేశంతో కూడిన చిత్రాలను వేశారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ తో పాటు బీచ్ రోడ్డు సెంటర్ మీడియన్ లో అందమైన మొక్కలను ఉంచారు.
బీచ్ రోడ్డులో గత వారం రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి సదస్సుపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సదస్సుకు అవసరమైన పనులన్నీ అధికారులు శరవేగంగా పూర్తిచేశారు. దీంతో నగరం సరికొత్త శోభను సంతరించుకుని, ఆకట్టుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam