హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: అద్భుత ఘట్టానికి వేదికగా విశాఖ బీచ్.. చూడ్డానికి రెండుకళ్లు చాలవు..

Vizag: అద్భుత ఘట్టానికి వేదికగా విశాఖ బీచ్.. చూడ్డానికి రెండుకళ్లు చాలవు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా శనివారం నుంచి భారత నౌకాదళం (Indian Navy) నిర్వహిస్తున్న మిలాన్‌-2022లో తొలిసారిగా ‘యాంటీ-సబ్‌ మెరైన్‌ వార్‌ ఫేర్‌’ డ్రిల్‌ నిర్వహించబోతున్నారు.

P Anand Mohan, Visakhapatnam, News18

విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా భారత నౌకాదళం (Indian Navy) నిర్వహిస్తున్న మిలాన్‌-2022లో తొలిసారిగా ‘యాంటీ-సబ్‌ మెరైన్‌ వార్‌ ఫేర్‌’ డ్రిల్‌ నిర్వహించబోతున్నారు. భారత నౌకాదళంలో సబ్‌ మెరైన్ల కేంద్రంగా ఉన్న విశాఖలోని తూర్పు నౌకాదళమే దీనికి సరైన వేదిక అని, అందుకే ఇక్కడ ఆ డ్రిల్‌ నిర్వహిస్తున్నారని నేవీ వర్గాలు సగర్వంగా చెబుతున్నాయి. యాంటీ-సబ్‌ మెరైన్‌ వార్‌ ఫేర్‌ గురించి చాలామందికి తెలియదు. ‌బయటకు కనిపించకుండా సముద్ర అంతర్భాగాన ప్రయాణిస్తూ...దాడికి పాల్పడే శత్రు దేశాల సబ్‌మెరైన్లను గుర్తించి, వాటిని నాశనం చేయడమే ‘యాంటీ-సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌’. ఇందులో సముద్రం ఉపరితలంపై ప్రయాణించే నౌకలు, గగనతలంలో విహరించే విమానాలు, హెలికాప్టర్లు, నీటి లోపల ప్రయాణించే సబ్‌ మెరైన్లు, ఇంకా ఇతరాలు కూడా పాల్గొంటాయి.

మిత్ర, పొరుగు దేశాల నౌకలను, తీర ప్రాంత ఆస్తులను శత్రుదేశాల సబ్‌ మెరైన్ల దాడి నుంచి కాపాడి, రక్షణ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. శత్రుదేశాల దిగ్బంధనం నుంచి తప్పించడం మరో అంశం. సబ్‌ మెరైన్లను గుర్తించడంలో సెన్సార్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వార్‌ ఫేర్‌లో ముందుగా విదేశీ సబ్‌ మెరైన్‌ ఎక్కడ ఉన్నదీ గుర్తిస్తారు. దీనికి సోనార్లను వినియోగిస్తారు. ఆ తరువాత అది ఎటువైపు ప్రయాణిస్తున్నది ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకొని, టార్గెట్‌ నిర్ణయించుకున్నాక దాడి చేస్తారు. ఇందుకోసం టార్పెడోలు, మైన్లు ఉపయోగిస్తారు.

ప్రాజెక్టు 28 కింద నాలుగు కమోర్తా క్లాస్‌ నౌకలు ఉన్నాయి. భారత నౌకాదళం యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ (ఏఎస్‌డబ్ల్యు) కోసం ‘ప్రాజెక్ట్‌ 28’ పేరుతో నాలుగు (కమోర్తా, కద్మత్‌, కవరత్తి, కిల్తాన్‌) కమోర్తా క్లాస్‌ నౌకలను నిర్మించింది. ఇవన్నీ కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌లో 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకావడం గమనార్హం. ఇవన్నీ ఫ్రంట్‌ లైన్‌ వార్‌ షిప్‌లు కావడం మరో విశేషం. ఈ నాలుగు తూర్పు నౌకాదళం కేంద్రంగానే పనిచేస్తున్నాయి.


27న జరగనున్న మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి 2.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి 2.55 గంటలకు నేవల్‌ డాక్‌యార్డుకు వెళ్లి ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం 4.15 గంటలకు ఐఎఎన్‌ఎస్‌ వేల సబ్‌ మెరైన్‌ను సందర్శిస్తారు. అనంతరం 4.40 గంటలకు బయలుదేరి ఐదు గంటలకు సర్క్యూట్‌ హౌస్‌ కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. 5.25 గంటలకు బయలుదేరి 5.30 గంటలకు ఆర్కే బీచ్‌లో జరిగే సిటీ పరేడ్‌కు హాజరవుతారు. 6.45 గంటల వరకు పరేడ్‌తోపాటు నేవీ విన్యాసాలను తిలకించి 6.50 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరి వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.

First published:

Tags: Andhra Pradesh, Indian Navy, Visakhapatnam

ఉత్తమ కథలు