Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆయన ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి, స్వతహాగా వైద్యుడు, అవకాశం ఉన్న ప్రతిసారి రోగులు, వారి సమస్యల పరిష్కారానికే తపన పడుతుంటారు. ఇప్పటికే పెద్దాసుపత్రిని ప్రక్షాళన చేస్తున్న విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రపంచ హెచ్ఐవీ, ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మరోసారి తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో ఉన్న బాధిత కుటుంబ సభ్యుల పిల్లలతో కలసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం వారిలో మనో ధైర్యాన్ని సైతం నింపారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్తులకు సకాలంలో ప్రతి నెల పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారి సంక్షేమానికి ఆయన తన నెల జీతం(రూ.1.10లక్షలు) విరాళంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.., సమాజంలో హెచ్ఐవీ రోగుల పట్ల, వారి కుటంబ సభ్యుల పట్ల అసమానతలను అంతం చేయడానికి అందరూ ఏకమవ్వాలని, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున అన్నారు.
ఎయిడ్స్ సోకిన వారిని అందరితో సమానంగా చూడాలని, కొత్తగా ఏ ఒక్కరూ కూడా హెచ్ఐవి బారిన పడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికే ఎయిడ్స్ సోకిన వారిని ఎటువంటి వివక్షత చూపకుండా సామూహికంగా కలుపుకొని పోవాలని ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్చంద సేవా సంస్థలు కృషి చేయాలన్నారు. అదే విధంగా రక్తపరీక్షలు చేసేటప్పుడు, రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకొని ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా చూడాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కన్వీనర్ గా ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేసారు.
అనంతరం చిన్నారులతో కలిసి అల్పాహారం చేసారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ వైద్య సంచాలకులు డాక్టర్.ఎం.ఉమాసుందరి, డి.ఎల్.ఓ డాక్టర్ పూర్నే౦ద్రబాబు, జిల్లా ప్రోగామ్ అధికారులు, డా.ఎన్. జీవనరాణి, డాక్టర్. ఎం. రమారెడ్డి, వైద్యులు, కార్యా లయ ఏవో సుమతి, హెచ్ఐవీ జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసర్ శైలజ, ప లువురు ఆరోగ్య శాఖ సిబ్బంది, షేర్ ఇండియా, వైఆర్టీ కేర్,బి వాచ్ఎస్, సాతి, ఇమ్యాన్యుయేల్ కేర్ అండ్ సపోర్టు స్వచ్చంద సేవా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాధిపై అవగాహన కల్పించే విధంగా ప్రదర్శించిన కళాజాతాలు అందరనీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సకల్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని హిజ్రాలకు డ్రేరేషన్ కిట్లు పంపిణీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam