P.Anand Mohan, Visakhapatnam, News18
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూరగాయల ధరలు (Vegetable Price) మండిపోతున్నాయి. కూరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో జనం జేబుకు చిల్లుపడుతోంది. ఇక విశాఖపట్నంలో (Visakhapatnam) విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ధర ఎంతైనా సరే కొందామంటే రైతుబజార్లలో కూరగాయలు దొరకడం లేదు. ఉదయం పది గంటల తరువాత వెళితే అన్ని స్టాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.దీంతో విశాఖ వాసులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాలు కూర గాయల ధరలపై దృష్టిసారించాలంటున్నారు. సెప్టెంబరు నెలాఖరులో వచ్చిన గులాబ్ తుఫాను వల్ల రైతులు వేసిన పంటలన్నీ పోయాయి. ఒక్క విశాఖ జిల్లాయే కాకుండా ఉత్తరాంధ్రాతో పాటు ఒడిశాలోని చాలా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం చూపింది. దాంతో ఆయా ప్రాంతాల నుంచి విశాఖపట్నం రావలసిన కూరగాయలు తగ్గిపోయాయి.
విశాఖజిల్లాలో వంకాయ, బెండకాయ, బీరకాయ, ఆనపకాయ వేస్తున్నారు. ఏజెన్సీలో కాలీఫ్లవర్, క్యాబేజీ పండుతున్నాయి. తుఫాన్ వర్షాలకు పంటలు పోయిన తరువాత మళ్లీ రైతులు కొత్త పంటలు వేశారు. అవి కోతకు రావాలంటే కనీసం 40 రోజుల సమయం పడుతుంది. మరో వారం, పది రోజులు తర్వాతే అవసరాలకు సరిపడా పంటలు వస్తాయని ఎస్టేట్ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాలలోను వుండడంతో అటు నుంచి వచ్చే కూరగాయలు కూడా తగ్గిపోయాయి.
విశాఖ జిల్లాలో సుమారు 600 ఎకరాలకు పైగా కూరగాయలు పండిస్తారు. రైతుబజార్లకు అన్ని రకాల కూరగాయలు రోజుకు 4.5 టన్నుల మేర వచ్చేవి. ప్రస్తుతం కేవలం 2 టన్నుల మాత్రమే వస్తూ ఉన్నాయి. దీంతో ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం టమాటా కిలో 60రూపాయలు పలుకుతోంది. చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా అక్కడ దిగుబడి తగ్గిపోయింది. దీంతో బెంగళూరు టమాటాకు గిరాకీ పెరిగింది. ఇక గుత్తివంకాయలు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి, విజయనగరం జిల్లా రామభద్రపురం నుంచి వస్తాయి. అక్కడ పంటలు పోవడంతో అవి తగ్గిపోయాయి.
ఇప్పుడు ఎక్కువగా కోల్‌కతానుంచి బీన్స్, క్యారెట్, బీట్‌రూట్, పొటల్స్, క్యాప్సికమ్ మాత్రమే వస్తున్నాయి. స్థానిక రైతులు పండిస్తున్న బీర, బెండ, వంకాయ, దొండ రకాలు చాలా స్వల్పంగా రావడంతో అమ్మకానికి పెట్టిన గంటలోనే అయిపోతున్నాయి. ఉల్లి అధిక శాతం మహారాష్ట్ర నుంచి వస్తుంది. అక్కడి మార్వాడీలు దీపావళి కారణంగా కొన్ని రోజులు దుకాణాలు మూసివేయడంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. కూరగాయల ధరలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని విశాఖ వాసులు కోరుతున్నారు.
పక్కజిల్లాలో ఇలా..
ఇక తూర్పు గోదావరి జిల్లాలోనూ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి జనానికి కూరగాయల ధరలు తలచుకుంటేనే వణుకు వచ్చేస్తోంది. బహిరంగ మార్కెట్లలో ఉదయం పూట ఉన్న ధర సాయంత్రానికి మారిపోతోంది. రైతుబజార్లలో రోజంతా ఒకే ధర కొనసాగిస్తు న్నా అక్కడ కూడా ధరల మోత మోగుతోంది. టమోటాల ధర వామ్మో అనిపిస్తుంటే వంకాయల ధర వింటే బాబోయ్ అనే రీతిలో ఉన్నాయి.
నిన్న మొన్నటి వరకూ పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరలు ప్రతి రోజూ పెరుగుతూ బెంబేలెత్తిస్తే, ఇప్పుడు కూరగాయల వంతు అన్నట్టు అడ్డూ అదుపూలేకుండా పెరుగుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో అన్ని కూరగాయల ధరలు పెరిగినట్టు రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు కార్తీకమాసం ప్రారంభం కావడంతో వినియోగం పెరిగి ధరల విజృంభణకు మరో కారణంగా కనిపిస్తోంది. అసలే చిన్నచిన్న ఉద్యోగాలు, చాలీచాలని వేతనాలతో జీవనం సాగించే కుటుంబాలు తాము ఏం తిని బతకాలంటూ ఆందోళన చెందుతున్నా యి. మరికొన్నాళ్లు కూరగాయల ధరల పెరుగుదల ఇదే విధంగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vegetables, Visakhapatnam