మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం? ఆక్సిజన్ సరఫరా ఉందా? మరి ఎలా మృతి చెందారు

మహారాజ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణం

ఏపీలో ఏం జరుగుతోంది. ఆక్సిజన్ సప్లై లేక కరోనా రోగులు మరణిస్తున్నారా? కానీ ప్రభుత్వం, అటు వైద్య వర్గాలు మాత్రం ఆక్సిజన్ సరఫరా ఉందని కొరత లేదని చెబుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం భయపడేలా చేస్తున్నాయి? ఇంతకీ ఏది నిజం.

 • Share this:
  కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. రోజు రోజుకూ ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రెట్టింపు అవ్వడం ఆందోళన పెంచుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69 మంది కరోనా సోకి మరణించారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా చనిపోతున్న వారిలో అధికంగా అనారోగ్య సమస్యలు ఉండడమే కారణమైని వైద్యులు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ బాధితులు మాత్రం ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి కారణంగానే తమ వారు చనిపోయారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఆక్సిజన్ ద్వారా చికిత్స అందించాల్సిన వారి సంఖ్య డబుల్ అవుతోంది. అయితే వారందరికీ సరిపడ ఆక్సిజన్ సరఫరా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితులు అలా లేవు. దాదాపు అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్లకు పూర్తి డిమాండ్ ఉంది. చాలా వరకు కరోనా రోగులు ఆస్పత్రులకు వెళ్తే ఆక్సిజన్ బెడ్లు లేవనే సమాధానమే వినిపిస్తోంది.

  తాజాగా విజయనగరం జిల్లా మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఐదుగురు చనిపోయారే వార్త కలకలం రేపింది. ఆస్పత్రి దగ్గర రోగుల బంధువల రోధనతో పరిస్థితి భయంకరంగా మారింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంతోనే తమ వారు ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. అందుకే కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని. రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ హరిజవర్‌లాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

  క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మృతి చెందారని.. అయితే వారు కూడా ఆక్సిజన్ సరఫరా అందక చనిపోలేదని వెల్లడించారు. రోజువారీ కరోనా మృతులు నేపథ్యంలో ఈ రెండు మరణాలు చోటుచేసుకున్నాయని చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమే అని.. అయితే ఘటన జరిగిన వెంటనే బల్క్ సిలిండర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం 290 మంది రోగులు ఉన్నారని.. వారిలో 25 మంది ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

  అప్పటికప్పుడే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నం నుంచి మరో ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పిస్తున్నామన్నారు. ఇతర పరిశ్రమల నుండి కూడా ఆక్సిజన్ తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌లో ప్రెజర్ తక్కువగా రావడం వల్ల ఇబ్బంది నెలకొందన్నారు. పునరుద్ధరణ చర్యలు చురుకుగా సాగాయన్నారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కొందరు రోగులను తరలించామని.. మరికొందరిని వైజాగ్ తరలిస్తున్నట్లు కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు.

  ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు చోటు చేసుకోలేదని జిల్లా కలెక్టర్ చెబుతున్నా.. ఆయన మాటల్లోనే ఎన్నో అనుమానాలు ఉన్నాయంటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉందని చెబుతున్నా ప్రభుత్వం అందుకు సరిపడ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నిజంగా సరిపడ ఆక్సిజన్ సరఫరా ఉంటే.. ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా విజయనగరం ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి పారాసిట్మాల్, బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు ఆయన సూచించారు.

  విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను అన్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే ఆని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలస్ బయటకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తక్షణమే బెడ్లు, ఆక్సిజన్, మందులు కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
  Published by:Nagesh Paina
  First published: