Vizage Agency: విశాఖ మన్యం ప్రకృతి అందాలకు నెలవు. శీతాకాలంలో ఏజెన్సీ అందాలు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే.. అందమైన ప్రపంచంలో అడవి బిడ్డలకు అనుకోని కష్టం వచ్చిపడింది.
విశాఖ మన్యం (Visakhapatnam Agency) ప్రకృతి అందాలకు నెలవు. శీతాకాలం (Winter) లో ఏజెన్సీ అందాలు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే.. అందమైన ప్రపంచంలో అడవి బిడ్డలకు అనుకోని కష్టం వచ్చిపడింది. విద్య, వైద్యానికి కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి. ఇక నీటికోసమైతే గిరిజనులు పడే కష్టాలు వర్ణనాతీతం. విశాఖపట్నం ఏజెన్సీలో వేసవిరాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో పథకాలు ఉన్నా.. ఇప్పటికీ గిరిజనులకు బురదనీరే దిక్కవుతోంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ పదమూడు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలోనూ గిరిజన మహిళలు బిందెలతో నీళ్లు మోస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గిరి ప్రజలకు ప్రతీ ఏడాది ఈ నీటి కష్టాలు తప్పడం లేదు. ఎక్కడోచోట నిత్యం తాగునీటి సమస్య తలెత్తుతూనే ఉంది.
విశాఖ ఏజెన్సీ జీ.మాడుగుల మహిళలు చిన్నపాటి గెడ్డెల్లో పారుతున్న మురికినీటిని బిందెలతో నీరు తోడుతున్న దృశ్యాలు కనిపించాయి. వీరికి ఇది నిత్యకృత్యమే. కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. బోర్లలో నీరు రాక వట్టిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రక్షిత మంచినీటి పథకాలకు నీరందించే బోర్లు ఎండిపోవడం, చెడిపోవడంతో వాటిపైనే ఆధారపడిన ప్రజలు గుక్కెడు నీటి కోసం కన్నీటి కష్టాలు పడుతున్నారు.
ఏజెన్సీలోని జీ మాడుగుల మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో నీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇక్కడి గిరిగ్రామ ప్రజలు నెల రోజులుగా తాగునీటి ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వేసవి రాకముందే నీటి కటకట నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి కోసం తంటాలు పడుతున్నా రు. గ్రామాల్లోని మహిళలు, పురుషులు, పెద్ద, చిన్నతేడా లేకుండా సమీపంలోని పొలాల మధ్య పారుతున్న చిన్నపాటి కాలువల నుంచి నీటిని తోడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరడం లేదని అక్కడి గిరి ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర తంటాలు పడుతుంటారు. అయితే ఏజెన్సీలో పరిస్థితి ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఉంది. వ్యవసాయ పొలం సాగు కోసం పారే నీటిని ఇలా గిరి మహిళలు తోడుతున్న పరిస్థితి. ఇది కాక వాగులు గుంటల్లో పారే నీటిని కూడా దూరాల నుంచీ పట్టి తెచ్చుకుంటున్నారు. అధికారులు వేసిన బోర్లలో నీరు సైతం రావడం లేదని వాపోయారు. బోరు నుంచి తమ గ్రామాల్లో 40 కుటుంబాలకు నీరు అందుతుందని, కానీ ఆ బోరు ఇప్పుడు నీరివ్వడం లేదంటున్నారు.
తమకు నీరు దొరకడం లేదని ఓ గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నీరు లేకపోవడంతో వంట కూడా వండుకోవడం లేదంటున్నాడు. నీటి అవసరాలను తీర్చుకోవడానికి కాలినడకన వెళ్లి ఇలా గుంటల నుంచీ.. పిల్లకాలువల నుంచీ బురద నీటిని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఈ విషయమై తాము అధికారుల దృష్టికి స మస్యలను తీసుకువెళ్లినా ఏ అధికారి తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ వారి తీరుపై మండిపడుతున్నారు. ఇక జిల్లాలోని పలు గ్రామాలలో తాగునీటి సమస్యలు ఇప్పటికే ఉత్పన్నమవుతున్నాయి. నీటి కోసం ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.