హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Costly Roosters: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!

Costly Roosters: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!

X
అనకాపల్లిలో

అనకాపల్లిలో ఆకట్టుకుంటున్న కోళ్లు

Vizag News: వాళ్లిద్దరూ ఉన్నత చదువులే చదివారు కానీ.. ఉద్యోగం చేస్తూ మెషిన్‌లా బతకడం కన్నా సొంత ఊరిలో నాలుగు రాళ్లు సంపాదించుకోవడం నయమనుకున్నారు. అంతే ధైర్యంగా ముందడుగు వేసి జీవితంలో సక్సెస్‌ అయ్యారు. ఊరికి దూరంగా ఓ మైదాన ప్రాంతంలో నాటు కోళ్ళ పెంపకం చేసి లక్షలు గడిస్తున్నారు ఇద్దరు స్నేహితులు.

ఇంకా చదవండి ...

Setti Jagadeesh, News 18, Visakhaptnam

వాళ్లిద్దరూ ఉన్నత చదువులే చదివారు కానీ.. ఉద్యోగం చేస్తూ మెషిన్‌లా బతకడం కన్నా సొంత ఊరిలో నాలుగు రాళ్లు సంపాదించుకోవడం నయమనుకున్నారు. అంతే ధైర్యంగా ముందడుగు వేసి జీవితంలో సక్సెస్‌ అయ్యారు. ఊరికి దూరంగా ఓ మైదాన ప్రాంతంలో నాటు కోళ్ళ పెంపకం చేసి లక్షలు గడిస్తున్నారు ఇద్దరు స్నేహితులు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా బలిఘట్టం గ్రామానికి చెందిన వీరమాచనేని సందీప్ చౌదరి (35), చాపరాల రాజేష్ (33) ఇద్దరు కలిసి సొంతంగా బిజినెస్‌ చేయాలని అనుకున్నారు. కోళ్ళపై మక్కువ ఎక్కువగా ఉండటంతో నాన్న , స్నేహితుల ప్రోత్సాహంతో కోళ్ళ పెంపకం కొనసాగిస్తున్నారు. ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసినా ఇంతకన్నా ఎక్కువ రావు కదా అంటున్నారు సందీప్‌, రాజేష్‌.

ఎన్నో జాతుల కోళ్ల పెంపకం

రెండెకరాలు విస్తీర్ణంలో చుట్టూ ఇనుప కంచెలు పెట్టి లోపల కోళ్ళు పెంచుతున్నారు. గుడ్లు పెట్టే కోళ్ళు 50కి పైగా వున్నాయి. యవ్వన దశకు చేరుకున్న ఒరుగులు, కోడి పుంజులు దాదాపు 80కి పైగా ఉన్నాయి. ఇందులో మొదట తూర్పుగోదావరి నుంచి కొన్ని జాతి కోళ్ళను తీసుకొచ్చారు. వాటిలో పెరు, పెరు క్రాష్, మెట్టు, రిచ్ మెట్టు పుంజులు తీసుకొచ్చి వాటి ద్వారా ఉత్పత్తి పెంచుతున్నాడు. పెరు బ్రీడ్ కోడి పుంజుకు ఎక్కువగా ఎగిరే సామర్ధ్యం ఉంటుంది. అయితే దీనికి ఎముకల బలం తక్కువగా ఉంటుందని, నాటు కోడికి, పెరు జాతి కోడి ద్వారా ఒక క్రాస్ బ్రీడ్ తయారు చేశారు. అదే పెరు క్రాస్‌. ఈ పెరుక్రాస్‌ కోళ్ల పందెంలో గట్టిగా నిలబడుతుందని సందీప్ చెబుతున్నాడు.

అమ్మో అంత ధర..?

ప్రస్తుతం పెరు జాతి కోడి రూ.1,50,000, పెరు క్రాస్ జాతి కోడి రూ.1,00,000, రిచ్ మెట్టు రూ.80,000, మెట్టు రూ.70,000గా విక్రయిస్తున్నారు. ఒక సంవత్సర కాలంలోనే ఐదు లక్షలు లాభం వచ్చిందని ఈ సంవత్సరం దానికన్నా రెట్టింపు లాభం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జాతులు పెంచుతున్నారని , తరువాత అన్ని రకాల జాతులు పెంచే దిశగా అడుగులు వేస్తామంటున్నారు సందీప్‌, రాజేష్‌.

కోళ్ల వెనుక పెద్ద శాస్త్రమే ఉంది

కోడిపందెలు ప్రాచీన సంప్రదాయమనేందుకు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యం. కోడి పుంజులు, వాటి రకాలు, ఏ రకం పుంజు పోరాట లక్షణం ఏమిటి, ఏ రకం పుంజుపై ఏ రకాన్ని బరి లోదించితే విజయావకాశాలు ఉంటాయనే వివరాలు ఈ తాళ పత్ర గ్రంథాల్లో లభిస్తుండడం విశేషం. దీనిని కుక్కుట శాస్త్రం అని కూడా అంటారు. పందేలకు వెళ్లేటప్పుడు కుక్కుట శాస్త్రాన్ని చూసుకొని మరీ పుంజును బరిలో దించుతారు.

రాజ్యాల మధ్య కోడిపందేలు..

విజయనగరం రాజు, బొబ్బిలి రాజుల మధ్య యుద్ధానికి అగ్గిరాజేసింది కూడా కోడిపందాలే అన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. అనాదిగా గ్రామీణ సంస్కృతిలో భాగమైపోయిన కోడిపందాలు, పుంజుల పెంపకం ఓ యజ్ఞంలా సాగుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు.

జాతుల పేర్లు గమ్మత్తుగా..!

సాధారణ కోడిపుంజులకు భిన్నంగా పందెం పుంజులు దృఢంగా ఉంటాయి. రంగు, సామర్థ్యాన్ని అనుసరించి దాన్ని పలానా తెగ అని గుర్తిస్తారు. ఎరుపు రంగులో ఉండే పుంజును డేగ అని, నీలం రంగులో ఉంటే కాకి అని పిలుస్తారు. పందెం కోళ్లను రంగు, ఎత్తు, ఈకలు, శరీర నిర్మాణాన్ని అనుసరించి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ప్రధానంగా డేగ, నల్లసవల, పూల, పింగళ, సేతువ, డేగపర్ల, నల్లపాశ, మైల, కాకి, పచ్చకాకి, పెట్టమర్రి తదితర రకాలు ముఖ్యమైనవి. కోడిపుంజు ఈకల్లో కాస్త తెల్లరంగు ఎక్కువ ఉంటే దాన్ని తెల్లసవలగా, నల్లరంగులో ఉంటే నల్లసవలగా గుర్తిస్తారు. డేగ ఈకల్లా ఉండే కోడిని డేగగా పిలుస్తారు. కొన్ని రకాల కోడి తోకలు నెమలి తోకల్ని పోలి ఉంటాయి. ఈ రకాలను కాకి, మైలపచ్చకాకి రకాలుగా పిలుస్తారు. పందెంకోడి జాతి, సామర్థ్యాన్ని అనుసరించే బెట్టింగ్‌ బాబులు పందెం కాస్తారు.

వీఐపీ మెనూ..!

పందెం కోళ్లకు కూడా డైలీ మెనూ ఉంటుంది. ఇంట్లో పిల్లలకు ఎలా బలవర్థక ఆహారం అందించి వారి పెరుగుదల, సామర్థ్యాలను పరిరక్షించాలని ప్రయత్నిస్తామో పందెం కోడిపుంజులు కూడా వాటిని అదే స్థాయిలో పెడుతున్నారు. ఓ వీఐపీ ఆహార మెనూ ఎలా ఉంటుందో కోడిపుంజు ఆహారం మెనూ అలా ఉంటుంది. తక్కువలో తక్కువగా వారానికి రూ.2 వేలు వీటి ఆహారానికి ఖర్చవుతుంది. వీటి ఆహారంలో ప్రధానంగా జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్‌మిస్‌, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలుతోపాటు బలవర్థకమైన ఇతర ఆహార పదార్థాలు కూడా సమకూర్చుతారు. దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి కోడి శరీరాన్ని దృఢంగా తయారు చేస్తామంటున్నారు స్నేహితులు.

పందెం కోళ్లకు మిలటరీ ట్రైనింగ్

పందెలకు అనుగుణంగా వీటి ఆహారం మెనూలో కూడా మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు సందీప్‌, రాజేష్‌. పోటీకి సిద్ధమయ్యే సమయానికి కోడిపుంజులకు ఇచ్చే ఆహారం పూర్తిగా మారుస్తారు. కఠోర శిక్షణ.. పందెం కోళ్ల పెంపకం అంటే ఏదో ఆహారం పెట్టేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటు. వాటికి మిలిట్రీ శిక్షణ అందజేస్తారు. బల వర్థకమైన ఆహారం తినిపించడంతోపాటు రన్నింగ్‌, స్మిమ్మింగ్‌, ఇతరత్రా శిక్షణలు అందజేస్తారు. కఠోర శిక్షణ అనంతరం ఒంట్లో నొప్పులు పోయేందుకు మసాజ్‌ చేస్తారు. రోజూ ఉదయాన్నే కోడిపుంజును పరిగెత్తిస్తారు. కోడి బాగా అలసిపోయాక దాని నోట్లో నీరుకొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు. దీనివల్ల పోటీ సమయంలో కోడిపుంజు అలసిపోకుండా ఉంటుంది. అనంతరం పచ్చికోడిగుడ్డు తెల్లసొన తినిపించి కాసేపటి తర్వాత మరో అరగంట పరిగెత్తిస్తాం అంటున్నాడు రాజేష్‌. తర్వాత కాసేపు విశ్రాంతి ఇస్తారు. అనంతరం డ్రై ఫ్రూట్స్‌ మిశ్రమాన్ని ముద్దగా తయారుచేసి కోడిపుంజులకు తినిపిస్తారు.

సంక్రాంతి సమయంలో గిరాకీ

గోదావరి, కృష్ణా జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందెల సందడి కొనసాగుతుంది. కోర్టులు ఎన్ని సార్లు చెప్పినా..ఇది తమ సంప్రదాయమని అక్కడ జనాలు కోళ్లపందెలు నిర్వహిస్తూనే ఉంటారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు ఆ పందెలను చూసేందుకు. అందుకే సంక్రాంతి మాసంలో పందెం కోళ్లకు మంచి గిరాకీ. స్థాయిని బట్టి ఒక్కో పందెంకోడి ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతుంది.

First published:

Tags: Andhra Pradesh, Cock fight, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు