Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
G20 Summit: సువీశాల సాగరతీరం.. కాబోయే రాజధాని.. ప్రముఖ పర్యాటక ప్రాంతం.. కాబోయే రాజధాని ఇలా చెప్పుకోవాలంటే విశాఖపట్నం (Visakhapatnam) అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఇప్పుడు అంతర్జాతీయ నగరం దిశగా అడుగులు వేస్తోంది. కీలక అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికగా నిలుస్తోంది. అయితే విశాఖ కు అందాల నగరంగా పేరుంది. ఈ అందాన్ని మరింత రెట్టింపు చేసి.. బ్రాండ్ వాల్యూ పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. నగరం ఎంత అందంగా ఉంటుందో.. అక్కడక్కడ ఉన్న కొన్ని బస్తీలను చూస్తే.. మనం స్మార్ట్ సిటీ లోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. జీ20 సమ్మిట్ (G20 Summit) లో భాగంగా భారీగా దేశ, విదేశాల నుంచి ప్రతినధులు వచ్చారు. వీరందరికి అందాల విశాఖను చూపించాలని తాపత్రయపడిన అధికారులు.. తాత్కాలిక చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపధికన పర్యాటక ప్రాంతాలకు మరింత శోభ చేకూరేలా అందంగా ముస్తాబబు చేశారు. అయితే మురికివాడలను ఇప్పటికప్పుడు అక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు.. అందుకే ఏం చేశారంటే..?
బస్తీలు ఉన్న చోట్లను పరదాలతో కప్పి ఉంచారు. నగరానికి రాకపోకలు సాగించే అతిధులకి అంతా కలర్ ఫుల్ గా కనిపించాలని.. హైవేను ఆనుకుని ఉన్న మురికివాడలు.. స్లమ్ ఏరియాల్ని గ్రీన్ మ్యాట్ తో కవర్ చేశారు. ఇంతక కష్టపడి చేసిన అధికారుల ప్రయత్నం చివరికి విఫలమైంది. గాలులు వీయడంతో రాత్రి వేసిన పరదాలు ఉదయానికి పక్కకి తొలిగిపోయి. యధావిధిగా స్లమ్ ఏరియాలు అక్కడక్కడా కనిపించాయి.
విశాఖ వేదికగా ఇప్పటికే జీ-20 సదస్సు ప్రారంభమైంది. సదస్సులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు నగరానికి వచ్చారు. దాదాపు 120 కోట్ల రూపాయలతో నగరంలో అభివృద్ధి, సుందరీకరణ, విద్యుత్ అలంకరణ పనులు చేపట్టారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలను మాత్రం సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కంటపడకుండా పరదాలు కట్టడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి : జీ-20 ప్రతినిధులకి సీఎం జగన్ అదిరిపోయే విందు.. నేటి అజెండా ఇదే
విదేశీ ప్రతినిధులు ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వచ్చే సమయంలో, తిరిగి వెళ్లేప్పుడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోని మురికివాడలు.. వారి కంటపడకుండా ఇళ్లకు ముందు పరదాలను అడ్డంగా కట్టారు. సాగర్‌నగర్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఈ సమ్మిట్ సాగుతోంది. వివిధ దేశాలకు చెందిన 63 మంది ప్రతినిధులను ఆహ్వానించగా.. వారిలో 57 మంది హాజరయ్యారు. రేపటి నగరాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి అనే అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు.
ఇదీ చదవండి: మేం ముగ్గురం గెలుస్తాం..? మీకు దమ్ముందా అంటూ మాజీ మంత్రికి రెబల్ ఎమ్మెల్యే మేకపాటి సవాల్
పట్టణీకరణలో సాధించిన విజయాలను వివిధ దేశాల ప్రతినిధులు వివరిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినధులకు సీఎం జగన్ హోటల్‌లోనే ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇవాళ మరో నాలుగు అంశాలపై చర్చలుంటాయి. 30న ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐఎంఎఫ్ తదితర సంస్థలను సదస్సుకు ఆహ్వానించారు. సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణీకరణలో సాధించిన విజయాలను వివరిస్తారు. ఈ చర్చల సారాన్ని 31న దేశంలోని మేయర్లు, కమిషనర్లకు వివరిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, G20 Summit, Visakhapatnam