Setti Jagadeesh, News 18, Visakhapatnam
తన ఊహల్లోని దృశ్యాలకు చిత్ర రూపం ఇస్తూ ఓ కళాకారుడు గీస్తున్న చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. కళాకారుడి సృజనకు నిలువటద్దాలుగా నిలుస్తున్నాయి ఆ చిత్రాలు. మదిలో మెదిలే ఊహలకు అద్భుత రూపాన్ని ఇవ్వడంలో అతని శైలి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. పెన్ను, పెన్సిల్, కుంచె ఇలా చేతికి దొరికిన వస్తువుతో కాన్వాస్ పై ఆకట్టుకునే చిత్రాలు గీస్తున్నారు కొయిలాడ రామకృష్ణ అనే చిత్రకారుడు. జీవకళ ఉట్టిపడేలా రామకృష్ణ గీస్తున్న ఈ అద్భుత చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఇంగ్లిష్ అక్షరాలు, సంఖ్యలతో బొమ్మలు గీయడం నేర్పిస్తూ చిన్నారులకు సైతం చిత్రకళపై ఆసక్తి కలిగేలా తనదైన శైలి ప్రదర్శిస్తున్నాడు రామకృష్ణ.
అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నంలోని కొత్త వీధికి చెందిన కోయిలాడ రామకృష్ణకు చిత్ర లేఖనం అంటే ఎంతో ఇష్టం. వ్యవసాయ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ చిత్రకళపై ఇష్టంపై పట్టుబట్టి మరీ నేర్చుకున్నాడు రామకృష్ణ. తన బంధువైన బుద్ధ చౌదరి స్ఫూర్తితో చిత్ర లేఖనం పై పట్టు సాధించిన రామకృష్ణ తన సృజనాత్మకతతో అద్భుత చిత్రాలు గీస్తూ పేరు తెచ్చుకున్నారు. ఈయన కుంచె నుంచి జాలువారిన అద్భుత చిత్రాలెన్నో ప్రశంసలు అందుకున్నాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా పొందిన రామకృష్ణ చిత్రకళకు ప్రాచుర్యం కల్పించేలా తనదైన శైలిలో కృషి చేస్తున్నాడు.
పెన్సిల్, చార్‌కోల్‌తో కూడా చిత్రాలు రూపొందిస్తున్నాడు. చిత్రకళా ప్రదర్శన పోటీల్లో ఈయన గీసిన చిత్రాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. గిరిజనుల జీవన విధానాన్ని తెలియజేసేలా రామకృష్ణ గీసిన కొన్ని చిత్రాలను స్థానిక జవహర్ బైబిల్ పాఠశాల నిర్వాహకులు జర్మనీలో జరిగిన ఓ ప్రదర్శనకు పంపించారు. ఆసక్తి ఉన్న వారికి చిత్రలేఖనం నేర్పడంతోపాటు మంచి చిత్రాలు గీయించే విధంగా శిక్షణ ఇస్తున్నట్టు రామకృష్ణ వివరించారు.
ప్రస్తుతం రామకృష్ణ ఓ ప్రైవేట్ పాటశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నాడు. చిన్నారులు తేలికగా చిత్రలేఖనం నేర్చుకునే విధంగా ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలతో సులభంగా చిత్రాలు గీస్తున్నారు. పిల్లలకు ఇలా నేర్పించడం వలన వారిలో ఆసక్తి పెరిగి చిత్రాలు గీయడం త్వరగా నేర్చుకుంటారని రామకృష్ణ అంటున్నారు. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి చిత్రలేఖనంపై పట్టు సంపాదించేలా తీర్చిదిద్దుతానని తెలిపారు. నర్సీపట్నంలో డాన్ బాస్కో స్కూల్ వెనుక వైపు రామకృష్ణ ఇల్లు వుంటుంది. ఫోన్ నంబర్..రామకృష్ణ .. చిత్రకారుడు 81068 13587.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam