Setti Jagadeesh, News 18, Visakhapatnam
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రాణం లేని విగ్రహానికి అందమైన రూపాన్ని అందించి జీవం పోస్తున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) కి చెందిన ఇద్దరు స్నేహితులు. విశాఖకు చెందిన మారుపిల్లి నర్సింగ్, రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన నక్క రాజు ఇద్దరూ స్నేహితులు. ఈ ఇద్దరూ కలిసి నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ అతి తక్కువ ఖర్చుతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే మరలా తీసుకురాలేం. అయితే, విగ్రహాల రూపంలో చనిపోయిన వారి మరుపురాని జ్ఞాపకాలను తిరిగి అందిస్తామంటున్నారు ఈ ఇద్దరు స్నేహితులు. మూడు అడుగుల నుంచి భారీ విగ్రహాలను సైతం తయారు చేయడంలో వీరు అనుభవజ్ఞులు. ఎవరైనా కుటుంబంలో వ్యక్తి చనిపోతే.. ఆ వ్యక్తి ఫోటో ఇస్తే చాలు వారి రూపం అందమైన విగ్రహంగా మలచి పంపిస్తారు.
ఇలా తయారీకి ఒక్కో విగ్రహానికి 2 నెలలు నుంచి 3 నెలలు వరకు సమయం పడుతుందని అంటున్నారు. విగ్రహం ఎత్తు, డిజైన్ బట్టి సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ విగ్రహం తయారీలో మరో విశేషం ఏమిటంటే కుటుంబ సభ్యులు ఎలా కావాలంటే అలా వస్త్ర ధారణతో అందిస్తారట. ఇక్కడ తయారు చేసే విగ్రహాలకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మంచి డిమాండ్ ఉంది.
విగ్రహాల తయారీ ఖర్చు విషయానికి వస్తే.. ఒక్కో విగ్రహానికి సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని.. పేదలు ఎవరైనా వారి కుటుంబ సభ్యుల విగ్రహం తయారు చేయాలనుకుంటే ఇంకా తక్కువ ఖర్చుతో కూడా తయారు చేసే అందిస్తామని చెప్తున్నారు. వారు ఇచ్చేవిగ్రహం ఎత్తు బట్టి ధర కూడా వుంటుందని చెప్పారు.ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం దొడపూడి గ్రామంలో స్థలం లీజుకు తీసుకుని ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు.
ఈ విగ్రహాల తయారీతో వారు ఉపాధి పొందడమే కాకుండా స్థానికంగా ఉన్న వారికి కూడా ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆర్డర్స్ రావడంతో విగ్రహాల తయారీలో నిమగ్నమైన ఈ ఇద్దరు స్నేహితులు.. ఎవరికైనా విగ్రహాల తయారీ కావాలంటే ఎవరి విగ్రహాలైనా తయారు చేస్తామని చెప్పారు. విగ్రహాల తయారీ కావాలనుకునేవారు 9963216265 , 9966280633 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam