(Setti Jagadesh, News18, Visakapatnam)
చింతపండు. ప్రస్తుతం బాగా ధరలు పెరిగిన నిత్యావసరాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో రకాన్ని బట్టి కిలో రూ.150 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. కానీ ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం రూ.50కంటే తక్కువగానే అమ్ముడవుతోంది. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో చింతపండు రైతులు, చింతపండును సేకరించే గిరిజనులకు మాత్రం ధర రావడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంత ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, చింతపండు ధర కిలో రూ.80కు పెంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని గ్రామీణ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతుండగా ప్రభుత్వం మాత్రం గ్రామీణ ప్రాంత రైతులు పండించిన చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. బయట మార్కెట్లో చింతపండు కిలో రూ.100 వరకు పలుకుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో దళారులు వచ్చి రూ.30 నుంచిరూ.40 కికొనుగోలు చేసి నగరాల్లో రూ.100 వరకు అమ్ముకుంటున్నారని రైతు పైలు బైరాగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారు నెల రోజుల క్రితం వున్న ధరలతో పోలిస్తే సగానికిపైగా పతనమైంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి చింతపండుని కావిళ్లతో మోసుకుంటూ సంతకు తీసుకువచ్చిన రైతులు తీవ్ర నిరాశ చెందారు.ఉమ్మడి విశాఖపట్నం లో ఎక్కువగా మాడుగుల మండలానికి ఆనుకున్న వున్న పాడేరు మండలం దేవాపురం, సలుగు, పులుసుమామిడి, వంట్లమామిడి, తదితర గ్రామాల గిరిజనులు సోమవారం మాడుగుల సంతకు భారీగా చింతపండు తీసుకువచ్చారు. వ్యాపారులు కొద్దిమందే రావడంతో డిమాండ్ లేకపోయింది.
దీంతో ఆరంభంలో కావిడి (28-30 కిలోలు) చింతపండు నాణ్యతనుబట్టి రూ.1,000-1,200 మధ్య ధర పలికింది. 9 గంటల సమయానికి మొదటి రకం చింతపండు అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయి. తరువాత రెండో రకం చింతపండు ధరను రూ.700-800కు వ్యాపారులు తగ్గించేశారు. దీంతో కొంతమంది గిరిజనులు విక్రయించగా, మరికొందరు మరలా సంతలో విక్రయించుకుంటామంటూ స్థానికుల ఇళ్లల్లో భద్రపరుచుకుని వెళ్లిపోయారు. కాగా గత నెలలో కావిడి చింతపండు రూ.2 వేల పైచిలుకు ధర పలికింది. ప్రస్తుతం సగానికి పడిపోవడంతో కూలిపాటు కూడా గిట్టుబాటు కాదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam