Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
Extramarital Affair: కోరికలను అదుపు చేసుకోలేకపోతే ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది.. ఇప్పటి చాలా మంది వివాహేతర సంబంధాల (Extra Marital Affairs)కారణంగా అందమైన జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. కొందరైతే కాపురాలను కూల్చుకుంటున్నారు. పచ్చని సంసారాల్లో చిచ్చుపెట్టుకుంటున్నారు. మరికొందరు పరాయి మోజులో పడి.. హత్యలకు కూడా వెనుకాడడం లేదు.. ఇలా పెద్దలు చేసిన తప్పులకు.. చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా ఇద్దరి పెద్దల వివాహేతర సంబంధం.. ఆ రెండు ప్రాణాలను తీసేసింది. దీంతో ఆ రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతో పాటు.. అభంశుభం తెలియని చిన్నారులు ఇప్పుడు అనాథలు అయ్యారు. అసలు ఏం జరిగింది అంటే.. పోలీసులు.. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) రణస్థలం మండలం జేఆర్‌పురం పంచాయతీ దన్నానపేటకు చెందిన 32 ఏళ్ల పొగిరి సీతమ్మ, అల్లివలస గ్రామానికి చెందిన 30 ఏళ్ల దుమ్ము అమ్మోరు ఆదివారం రాత్రి ఒకే ఇంట్లో విగతజీవులుగా (Suicide) పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇద్దరి ఆత్మహత్య.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం. సీతమ్మ భర్త అనారోగ్యంతో 2013లో మృతి చెందాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఆమె జేఆర్‌పురం కూడలిలో కూరగాయల దుకాణం నిర్వహిస్తోంది. ఇదే సమయంలో అల్లివలస గ్రామానికి చెందిన దుమ్ము అమ్మోరు తన బంధువుతో కలిసి జేఆర్‌పురంలోనే ఓ హోటల్, లాడ్జి లీజుకు తీసుకుని నడిపేవాడు. స్థానికంగా వెంకటేశ్వర కాలనీలోనే కుటుంబంతో సహా నివాసముండేవాడు.
ఇద్దరి మధ్య మొదట పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కరోనా సమయంలో ఇద్దరి వ్యాపారాలు సాగక ఇంటివద్దే ఉండిపోయారు. కరోనా తగ్గాక సీతమ్మ గ్రామంలోని ఇంటి సమీపంలో కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మోరు వ్యాపారం నడపలేక, మరొకరికి ఇచ్చేసి విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాల్లో కళ్లద్దాలు విక్రయించేందుకు వెళ్లిపోయాడు. దూరమైనా వారిద్దరి మధ్య బంధం చెరిగిపోలేదు.
ఇదీ చదవండి : తిరుమల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు.. వీటి వెనుక 400 ఏళ్ల చరిత్ర.. ప్రత్యేకత ఏంటంటే?
ఈ క్రమంలో అమ్మోరు ఆదివారం రాత్రి సీతమ్మ ఇంటికొచ్చాడు. ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో తెల్లారేసరికి ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. సీతమ్మ కుమారుడు ఇంట్లోనే ఉన్నా ఈ విషయం ఆ చిన్నారి తెలియలేదు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో సీతమ్మ మామవచ్చి తలుపు తట్టాడు. ఎవరూ తీయకపోవడంతో గట్టిగా కొట్టడంతో మనవడు లేచి తలుపు తీశాడు. లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. విషయం చుట్టుపక్కల వారికి, పోలీసులకు తెలియజేశాడు. మృతుడికి భార్య, ఏడాది కుమార్తె, నాలుగు నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా ఆరో తరగతి చదువుతున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. జేఆర్‌పురం ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించారు.
ఇదీ చదవండి: కుప్పంలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. అన్న క్యాంటిన్ ధ్వంసం.. లోకేష్ పర్యటనతో ఉద్రిక్తత
అయితే కుటుంబ సభ్యులకు ఇష్టంలేకనే చనిపోతున్నాం అంటూ రాసిన ఆత్మహత్య లేఖ అక్కడ లభ్యమైంది. అందులో తాను సీతమ్మతో కలిసి ఉండటం వారి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని.. అయితే విడిగా తాము ఉండలేమని.. అందుకే ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా ఇద్దరి పిల్లలను కుటుంబ సభ్యులు బాగా చూసుకోవాలని వేడుకుంటూ.. ఆ లేఖలో రాసి ఉంది. సీతమ్మ మెడ దగ్గర చిన్న గాయమై నోటివెంట నురగ వస్తుండగా, అమ్మోరు మాత్రం తాడుతో పంకాకు ఉరేసుకుని వేలాడి ఉన్నాడు. సీతమ్మ మృతి అనుమానాస్పదంగా ఉండటంతో ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam, Vizag