మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన తౌక్టే తుపాను ను మరవక ముందే మరో తుపాను సిద్ధమవుతోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేసేందుకు దూసుకువస్తోంది. శనివారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయిగుండంగా మారనున్న అల్పపీడనం.. ఆ తర్వాత తీవ్ర తుపానుగా బలపడుతుందని హెచ్చరించింది. అలాగే ఈనెల 26కి అది పెను తుఫాన్ గా మారుతుందని అదే రోజు సాయంత్రం ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుతుందని వెల్లడించింది. అల్పపీడనం మరో మూడు రోజుల్లో తీవ్రవుగుండం మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖహెచ్చరించింది.
తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను అందుబాటులో ఉంచుకోవాలని.. అలాగే మందులు, హెల్త్ సర్వీసులు సిద్ధం చేయాలని పేర్కొంది. తుపాన్ ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకే అవకాశముండటంతో ఒడిశాలోని 14 జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. బెంగాల్, ఒడిశా నుంచి ఏపీకి నడిపే 22 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది.
.
‘యాస్’ అంటే ఎమిటి..?
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు ఒమన్ దేశం సూచించిన ‘యాస్’ అని నామకరణం చేయనున్నారు. తుపాను ఏర్పడ్డాక ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. యాస్ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. దీని అర్ధం మల్లెపూవ్వు అని అర్ధం.
ఐతే తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కంటే ఎండలు ఉధృతం కావడానికి దోహదపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఏర్పడటానికి ముందు నుంచి రాష్ట్రంపైకి ఉత్తరాది గాలులు వీయనున్నాయి. ఫలితంగా అటునుంచి వచ్చే గాలులు వేడిగా ఉండడం వల్ల రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చేనాలుగు రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయ్యే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
నైరుతి వస్తోంది..
ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్ర భాగంలోకి ప్రవేశించాయి. శుక్రవారం రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. జూన్ 5 నాటికి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.