Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
Summer Alert: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను వానలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. విశాఖను సైతం ఇవాళ మధ్యాహ్నం వరకు వానలు వెంటాడాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వెదర్ కాస్త కూల్ గానే ఉన్నా.. భవిష్యత్తులో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందుకే విశాఖలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండు వేసవిని అధిగమిద్దాం అని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. రానున్న రెండు నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎంపిడివోల ఆధ్వర్యంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జెడ్పి సీఈఓ వెంకట్ రామన్ ని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏ.ఎన్. ఎం.లతో సమన్వయం చేసుకుని.. వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించేలా, అలాగే తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
వేసవిలో విద్యుత్ అవసరం అధికంగా ఉంటుంది అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర తాగునీరు ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే పని వేళల్లో మార్పులు పరిశీలించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణీల సౌలభ్యం కోసం ముందస్తుగా ఓ.ఆర్.ఎస్, సంభందిత ద్రావకాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి ఎలాంటి కొరత లేకుండా ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రతి రెండు గంటలకు బెల్ కొట్టి ప్రతి ఒక్కరు నీళ్లు తాగేలా సంబంధిత పాఠశాలలను అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి కొరత లేకుండా మంచి నీటి వసతి పూర్తిస్థాయిలో కల్పించడంతో పాటు. విద్యార్థులకు వడగాల్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని డీఈవో ఎస్.ఎస్.ఏ. అధికారులను ఆదేశించారు.
వన్యప్రాణులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా.. అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పటు చేసి.. నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని.. ఆటవీశాఖాధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో తాగు నీటి వసతితో పాటు ప్రధమ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని.. రైల్వే, ఆర్టీసీ శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 104, 108 మొబైల్ మెడికల్ వాహనాల సేవలను.. వేసవిలో విస్తృతం చేయాలన్నారు. వడదెబ్బ, అతిసారం లాంటి సమస్యలపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు వెంటనే స్పందిస్తూ తక్షణ సేవాలందించాలన్నారు. వడదెబ్బ కేసుల రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఆ వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదించాలన్నారు.
వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు కారణంగా వచ్చే వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీహైడ్రేషన్ వంటి సమస్యలు.. సాధారణంగా వచ్చే వ్యాధులు అయినా సరైన సమయంలో వాటికి చికిత్స తీసుకోకపోతే సమస్య ప్రాణాంతకంగా మారవచ్చన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వేసవిలో అనవసరంగా బయటకు రాకూడదని అత్యవసర పనులు ఉంటే ఉదయం పూటనే పూర్తి చేసుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలను ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు వాడటం, వేడిగాలులు తగలకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు.
ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసు లేదా అంతకంటే ఎక్కువసార్లు మంచి నీరు తాగడం మంచిదన్నారు. ఎండలో తిరిగే సమయంలో నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు తాగడంతో వడడెబ్బ నుండి రక్షించుకోగలమన్నారు. అతి శీతల పానీయములు, మంచు ముక్కలతో కూడిన ద్రావకాల వాడకం తగ్గించాలన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు అత్యంత జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.