Setti Jagadeesh, News 18, Visakhaptnam
విశాఖపట్నం (Visakhapatnam) లో విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు.. రక్షా బంధన్ (Rakshabandhan-2022) వేడుకల్లో భాగంగా ఏళ్ల నాటి మర్రి చెట్టుకి రాఖీ కట్టి కృతజ్ఞతాభావాన్ని చూపారు. అన్నాతమ్ముళ్లులా చెట్లు కూడా తమకు రక్షణ ఇస్తున్నాయని అందుకే చెట్టుకి రాఖీ కట్టామంటున్నారు విద్యార్థులు. అన్నా చెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా రాఖీ పండగను జరుపుకుంటారు. అన్నకు గాని, తమ్మునికి గాని తనకుఎల్లప్పుడు రక్షగా ఉండాలని కోరుకుంటూ సోదరి కట్టే బంధనమే రాఖీ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. నిరంతరం ఆక్సీజన్‌ను సరఫరా చేస్తూ… ఇటువంటి రక్షణ బంధం పర్యావరణంలోని చెట్లు కూడా మనకు అందిస్తున్నాయి. దానికి కృతజ్ఞతగా చెట్లను పరిరక్షించాలని వైజాగ్‌లోని విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టాయి.
వృక్షా బంధన్ పేరుతో ఏళ్లనాటి నుంచి తమకు రక్షగా నిలుస్తున్న మర్రిచెట్టుకి రాఖీ కట్టారు విద్యార్థులు. చెట్టుకు రాఖీ కట్టడమేమిటా అని ఆశ్యర్యపోతున్నారా? ఇది నిజం. విశాఖలోని రైల్వే ప్రాంగణంలో పురాతనమైన అతిపెద్ద మర్రిచెట్టు ఉంది. రోడ్డువిస్తరణలో ఈ చెట్టును కూల్చేయడానికి అప్పట్లో అధికారులు సన్నద్ధం అయ్యారు. అయితే పర్యావరణ ప్రేమికులు రాత్రి పగలు కాపలా కాసి చెట్టును నరకకుండా అడ్డుకున్నారు. అప్పటి నుండీ పర్యావరణ ప్రేమికులు ప్రతి ఏటా ఈ చెట్టుకు 'రాఖీ' కట్టి పర్యావరణం పట్ల తమ ప్రేమ బంధాన్ని మరింత దృఢపరుచుకుంటారు.
ఈ ఏడాది రాఖీపౌర్ణమి సందర్భంగా విశాఖ నగరంలో గ్రీన్ క్లైమెట్ టీమ్ జె.వి రత్నం ఆధ్వర్యంలో విద్యార్థులతో వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ భారీ వృక్షానికి రాఖీలు కట్టారు. ప్రతి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం అవసరం అన్నారు జేవీ రత్నం.
విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు, కుటుంబాలకు వృక్షసంపద పరిరక్షణ గురించి అవగాహన వస్తుందని.. ఆ కుటుంబాల నుంచి పల్లెలు, సిటీలు… సిటీల నుంచి రాష్ట్రాలు.. రాష్ట్రాల నుంచి దేశాల వరకు పర్యావరణ పరిరక్షణ గురించి చర్చ జరుగుతుందని గ్రీన్ క్లైమెట్ టీమ్ అభిప్రాయపడుతుంది.
భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, చెట్ల పాత్ర చాలా గొప్పది అన్నారు. అందుకే మనం అంతా వందల ఏళ్ల నాటి చెట్లును కాపాడుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో కాంక్రీట్ జంగీల్ కోసం వాటిని తొలగించకూడదని తెలిపారు. చెట్టను నరికేసుకుంటూ పోతే..మనకంటూ భవిష్యత్ ఉండదని అన్నారు. ఇటువంటి తరుణంలో వృక్షసంపద ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అన్నారు.
ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల నుండి వచ్చే పొగతో నానాటికి వాయు కాలుష్యం పెరిగిపోతోంది. మన చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరడంతో ప్రాణవాయువు తగ్గిపోతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణికోటి, వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి ఇలా అనేక రకాల ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Raksha Bandhan, Visakhapatnam