హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Smart City: స్మార్ట్ సిటీ అంతా గజిబిజీ... ఎటుచూసినా గందరగోళమే..!

Vizag Smart City: స్మార్ట్ సిటీ అంతా గజిబిజీ... ఎటుచూసినా గందరగోళమే..!

విశాఖపట్నం(ఫైల్)

విశాఖపట్నం(ఫైల్)

స్మార్ట్ సిటీ (Smart City) అంటే ప్లానింగ్ పక్కాగా ఉండాలి. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో.. ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీలక నగరమైన విశాఖపట్నం (Visakhapatnam) లో.

ఇంకా చదవండి ...

  P.Anand Mohan, Visakhapatnam, News18

  స్మార్ట్ సిటీ (Smart City) అంటే ప్లానింగ్ పక్కాగా ఉండాలి. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో.. ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీలక నగరమైన విశాఖపట్నం (Visakhapatnam) లో. స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా చేపట్టిన ‘స్మార్ట్‌ రోడ్స్‌’ పనులు గజిబిజిగా తయారయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వాహనాలతోపాటు పాదచారులు, సైక్లిస్టులకు కూడా సౌకర్యవంతంగా వుండేలా స్మార్ట్‌ రోడ్స్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు అధికారులు పేర్కొంటున్నప్పటికీ, జరుగుతున్న పనులపై మాత్రం నగర వాసులతో పాటు ప్రజా ప్రతినిధుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలోని నగరాలు, పట్టణాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలికవసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల కిందట స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా రోడ్లను అన్నివర్గాల ప్రజలు సౌకర్యవంతంగా వినియోగించుకునేలా ‘స్మార్ట్‌ రోడ్స్‌’ ప్రాజెక్టు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. జీవీఎంసీ రూ.150 కోట్లతో 19 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ముందుగా ఆరు రోడ్ల పనులను ప్రారంభించింది.

  ఆయా రహదారుల్లో కేవలం ఏడున్నర మీటర్లు మాత్రమే వాహనాల రాకపోకలకు మిగిల్చి, మిగిలిన ప్రాంతంలో ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్‌ ట్రాక్‌లు, మొక్కలు పెంపకం వంటి వాటికి కేటాయించారు. దీనివల్ల విశాలంగా వున్న రోడ్లు కాస్తా ఇరుకుగా మారిపోవడంతో విమర్శలు మొదలయ్యాయి. జీవీఎంసీ అధికారులతో కొన్నాళ్ల కిందట జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. స్మార్ట్‌ రోడ్స్‌ పేరుతో విశాలంగా వున్న రోడ్లను ఇరుకుగా కుదించేయడం వల్ల రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నందున ప్రాజెక్టుని రద్దు చేయాలని ఆదేశించారు.

  ఇది చదవండి: దసరాకు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి.


  దీంతో అధికారులు అప్పటికే పనులు ప్రారంభమైన కేవలం ఆరు రోడ్లను మాత్రమే మినహాయించి మిగిలిన రోడ్లను స్మార్ట్‌ రోడ్లుగా మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. రూ.55 కోట్లతో సిరిపురం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ బంగ్లా వరకూ, ఆల్‌ ఇండియా రేడియో జంక్షన్‌ నుంచి పాండురంగాపురం డౌన్‌ రోడ్డు వరకూ, హార్బర్‌ పార్కు, లాసన్స్‌బే కాలనీలోని నేవల్‌ క్వార్టర్స్‌ రోడ్డు, పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి రోడ్డు, వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌ రోడ్లను స్మార్ట్‌ రోడ్స్‌గా మార్చే పనులు చివరి దశకు చేరుకున్నాయి.

  ఇది చదవండి: గుడివాడ సెంటర్లో తేల్చుకుందాం..! కొడాలి నానికి వంగవీటి రాధ సవాల్..? ప్రచారంలో నిజమెంత..?


  స్మార్ట్‌ రోడ్స్‌లో వాకింగ్‌/సైక్లింగ్‌ ట్రాక్‌లను అనుకుని పార్కింగ్‌కు స్పేస్‌ కేటాయించారు. దీంతో వాహనదారులు వాకింగ్‌ ట్రాక్‌లపై కూడా పార్కింగ్‌ చేసేస్తున్నారు. దీనివల్ల పాదచారులు, సైకిల్‌పై వెళ్లేవారు కూడా రోడ్డుపైనే ప్రయాణిస్తున్నారు. రహదారులు విశాలంగా వున్నప్పుడు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను పాదచారులు చక్కగా వినియోగించుకునే వారని, ఇప్పుడు స్మార్ట్‌ రోడ్ల పేరుతో ఇరుకుగా మార్చేశారని ప్రజా ప్రతినిధులు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం జీవీఎంసీ అధికారులు వద్ద ప్రస్తావించగా తమకు కూడా దీనిపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రహదారుల పనులు పూర్తయితే అప్పుడు ప్రాజెక్టుపై స్పష్టత అర్థమవుతుందని, అంతవరకూ గజిబిజిగానే ఉంటుందని పేర్కొంటుండడం విశేషం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు