P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు పునఃప్రారంభించి (Schools Reopening) దాదాపు రెండు వారాలు కావొస్తోంది. విద్యాసంవత్సరం మొదలైనకొన్ని రోజులకే స్కూళ్లలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో విద్యార్థుల (Students) తల్లిదండ్రులు, టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటంతో కొన్ని స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 40శాతం కూడా హాజరు నమోదు కావడం లేదు. తాజాగా విశాఖ జిల్లాలోనూ విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. విశాఖ జిల్లా గోపాలపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. ఈనెల 23వ తేదీనవిద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించగా ఆరుగురుకి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో ఎల్లపువారి పాలెంకు చెందిన ముగ్గురు, సంతోష్ నగర్ కు చెందిన ఇద్దరు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి ఉన్నట్లు తెలుసత్ది. విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు స్కూలుతో పాటు హాస్టల్ ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులను స్కూలుకు పంపేందుకు సంకోచిస్తున్నారు.
ఇటీవల కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు పాఠశాలను మూసివేశారు. విద్యార్థులు, టీచర్లకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరికొందరికి లక్షణాలుండటంతో వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. అటు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం శ్రీకాళహస్తి రూరల్ మండలం, కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాధమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థినులకు కొవిడ్ సోకింది.
ఇదిలా ఉంటే స్కూళ్లలో కరోనా సోకడంపై వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఏదైనా స్కూల్లో ఒకేరోజు ఐదుగురికి మించి విద్యార్ధులకు పాజిటివ్ గా తేలితే సదరు పాఠశాలను మూసేయాలని స్పష్టం చేసింది. మిగిలిన విద్యార్థులకు 14 రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత మాత్రమే క్లాసులు నిర్వహించాలని సూచించింది. అలాగే ఈనెలాఖరులోగా స్కూళ్లు, హాస్టళ్లను శానిటైజ్ చేయడమే కాకుండా అన్నిచోట్ల థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాటు చేయాలని తెలిపింది.
వ్యాక్సిన్ వేయించుకున్న టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిని మాత్రమే క్యాంపస్ లోకి అనుమతించాలని.. తల్లిదండ్రుల విషయంలోనూ ఇదే రూల్ ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. విద్యాసంస్థల్లో కొవిడ్ టెస్టులు చేసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Schools, Visakhapatnam