Sirimanotsavam 2022: ఇసుక వేస్తే రాలనంత జనం.. ఈ వీది చూసినా.. ఏ సెంటర్ చూసినా జనం జనం ఇది.. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి (Pyditahlli Ammavaru) జాతరలో భాగమైన సిరిమాను ఉత్సవ (Sirimanotsavam) వేడుక. భక్తుల నీరాజనాలు.. జయజయ ద్వానాల మధ్య పైడితల్లి సిరిమానోత్సవం రంగ రంగ వైభవంగా సాగింది. జై పైడిమాంబ నామస్మరణతో విజయనగరం (Vizianagaram) వీధులన్నీ మార్మోగాయి. భక్తులు భారీగా రావడంతో సిరిమాను తిరుగాడిన ప్రాంతం ఇసుకేస్తే రాలనంతగా తయారైంది. ఊరేగింపు రెండు గంటలు ఆలస్యంగా మొదలు కావడంతో మూడో పర్యాయం తిరిగేటప్పటికి పూర్తిగా చీకటిపడింది. అయినా భక్తులు సిరిమాను సంబరం కళ్లారా చూసేందుకు కాలు కదపకుండా అక్కడే ఉండి తిలకించారు.
ఈ సందర్భంగా పూసపాటి వంశీయులు పట్టువస్త్రాలు సమర్పించగా సిరిమానోత్సవమైన మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు పట్టువస్త్రాలను అందజేశారు. ఉదయం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పైడిమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ప్రారంభమైన సిరిమానోత్సవం సంబరం నిజంగా అంబరాన్ని అంటింది.
Sirimanotsavam2022| అంబరాన్ని అంటిన సిరిమాను సంబరం| కళ్లారా చూస్తే ఎన్నో... https://t.co/USwrk420xJ via @YouTube #vizianagaram #Sirimanotsvam #Pydithalli #festival #festivals
— nagesh paina (@PainaNagesh) October 12, 2022
సిరిమానోత్సవాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభిస్తామని జిల్లా అధికార యంత్రాంగం, దేవదాయశాఖ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలుకాలేదు. దాదాపు రెండు గంటల ఆలస్యంగా 5 గంటల 5 నిమిషాలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. మూడు లాంతర్లు నుంచి కోట వరకూ మూడు పర్యాయాలు తిరిగే సరికి రెండు గంటల సమయం పట్టింది. మూడో విడత తిరిగే వరకూ భక్తులు నిల్చొన్న చోటు నుంచి కదలలేదు. సిరిమాను పరివారంగా భావించే పాలధార, అంజలి రథం, బెస్తావారి వల కూడా ఆలస్యంగానే నడిచాయి.
అయితే వీటి వెనుక ఎక్కువ మంది భక్తులు తరలిరావడంతో అదుపు చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. రెండేళ్లుగా కరోనా ఆంక్షల వల్ల ఎక్కువ మంది భక్తులు సిరిమానోత్సవానికి రాలేదు. ఆంక్షలు తొలగడంతో ఈ ఏడాది విశేష సంఖ్యలో వచ్చేశారు. వాతావరణం కూడా పూర్తిస్థాయిలో అనుకూలించింది.
ఇదీ చదవండి : ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే కానుక.. అధికారిక ఉత్తర్వులు జారీ
మూడులాంతర్ల వద్ద సిరిమానుకు సాయంత్రం 4 గంటలకు పూజలు నిర్వహించాక అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులయ్యారు. కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికాపాటిల్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు కూడా సిరిమానుకు పూజలు నిర్వహించారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించారు. సిరిమానోత్సవ సంబరానికి ముందు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీల పేరుతో చాలామంది అడ్డదారుల్లో ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇది గమనించిన కోలగట్ల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ క్యూలైను వద్ద ఉన్న పాలకమండలి సభ్యులను అక్కడి నుంచి పంపేశారు. క్యూలైన్‌కు తాళం వేసి తాళం చెవి ఆయన వద్దే ఉంచుకున్నారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నారు.
డీసీసీబీ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు.
ఆలయానికి చేరుకునే మార్గాలన్నింటినీ మధ్యాహ్నం ఒంటి గంటకే బారికేడ్లతో మూసేశారు. ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సాధారణంగా సిరిమానోత్సం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. గుమ్చి, సింహాచలం మేడ, గురజాడ నివాసం, అంబటిసత్రంతో పాటు ఈ మార్గంలోని చిన్నచిన్న రహదారులను మూసేశారు. సిరిమాను రాక ఆలస్యం కావడంతో బయటకు వెళ్లే పరిస్థితి లేక లక్షలాది మందితో పాటు చంటి పిల్లలతో వచ్చినవారు ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిరిమాను ఊరేగింపు ముగిసిన తర్వాత చాలాసేపటికి బారికేడ్లు తొలగించారు. అంతవరకు దూరప్రాంతాలకు వెళ్లే వారు వేచి ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu festivals, Vizianagaram