P Anand Mohan, Visakhapatnam, News18
సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కోడి పందేలు, ఎడ్ల పందేల సందడి చోటు చేసుకుంటుంది. వీటికి ఏ మాత్రం తీసిపోని విధంగా పొట్టేలు పందేలు కూడా జరుగుతాయి. బాగా బలిష్టమైన పొట్టేళ్లు రంగంలోకి దిగి కలబడుతుంటే ఆ మజానే వేరు. వాటి దూకుడు, బలమైన శరీరాన్ని చూస్తే పందెం రాయుళ్లకు ముచ్చటేస్తోంది. ఆ కోవలోకే వస్తుంది విశాఖపట్నం (Visakhapatnam) కు చెందిన ఓ పొట్టేలు. ఇది పుట్టి పన్నెండేళ్లయింది. బరువు దాదాపు నలభై కిలోలు. కొమ్ములు వాడి. అది ఇప్పటి వరకూ ఏ పందెంలోనూ ఓడిపోలేదు. ఇది బరిలోకి దిగితే గెలవడం తప్ప మరొకటి తెలియదు. ప్రతి సంక్రాంతికి యజమానికి లక్షల్లో బహుమతులు గెలిపిస్తోంది.
విశాఖతో పాటు.. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరిగే పందేల్లో ఈ పొట్టేలు సత్తా చాటుతోంది. ఈ పొట్టేలు పేరు పొట్టీ. ఇది ఇప్పటికి అయిదేళ్ల నుంచీ పందేలకు వెళ్తోంది. మొదటి ఏడాది పందేల్లో కాస్తంత తత్తరపడిందట. కానీ తర్వాత మాత్రం ఇక ఏ పందెంలోనూ ఓడిపోలేదని పొట్టేలు యజమాని చెబుతున్నారు. ఇప్పటికీ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజున దీన్ని చూడటానికి.. దీని ఫైట్ చూడటానికి చాలా మంది వస్తారని అంటున్నారు దాని యజమాని శ్రీను.
పొట్టీకి చాలా గట్టి మేత అవసరం అవుతుంది. రోజూ ఉదయం బాదం తురుముతో పాటు.. జీడిపప్పు, పిస్తా కూడా తినిపిస్తారు. దీంతో పాటు సాధారణ గొర్రెలు, మేకల మేత కూడా ఇస్తున్నాడు. ఇది కాక.. నాటు కోడి ముక్కలంటే పొట్టీకి భలే ఇష్టమట. ముఖ్యంగా పందేలకి నాలుగు ముందూ.. పందెం రోజుల్లో కూడా నాటుకోడి ముక్కలే మేత వేస్తారట. గొర్రె ఇవి తింటుందా.. అంటే ఏ మాత్రం డౌట్ లేదంటారు శ్రీను. ట్రిప్ కి పావు కిలో లాగిస్తుందని.. ఇంకాస్త మేత కావాలంటే అరకేజీ కూడా చాలదని అంటున్నారు. వీటితో పాటు.. అప్పుడప్పుడూ గట్టి పొట్టు కూడా వేస్తారు. బియ్యం పొట్టు.. తవుడు లాంటివి దీని మెనూలో ఉంటాయి.
ఇక ప్రస్తుతం ఈ పొట్టీ.. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో రౌండ్స్ వేస్తోంది. మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తోంది. తన యజమాని శ్రీను ఇలా కర్రకి పొట్టీని కట్టేసి తీసుకొస్తారు. తర్వాత పొట్టీని గ్రౌండ్ అంతా తిప్పుతారు. మట్టిలో నడిపించడంతో పాటు.. రోడ్డుపై కూడా నడిపిస్తారు. పొట్టీకి ఇష్టమైన ఆహారం కూడా వెంట తెస్తారు. ఇటు శ్రీనుకి కూడా ఉదయం పూట దీనితో వాకింగ్ అయిపోతుంది. ఒక్కోసారి దీనితో రన్నింగ్ కూడా అవుతుంది. ఈ పొట్టీ వాకర్స్ ను విశేషంగా ఆకర్షిస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Sankranti, Visakhapatnam