Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
చిన్నపాటి పాములా ఉంటుంది. కానీ పాము కాదు. విషం అసలే ఉండదు. బాగా సున్నితమైన జీవి. ఒకేరకమైన ఆకారం ఉంటుంది. కానీ అవయవాలు ఉండవు. పాములా ఉన్నా ఇది పాము జాతి కానేకాదు. సరీసృపాల్లో ఇది బల్లి జాతికి చెందిన జీవి. చెట్లు పెరగడానికి.. వాతావరణ సమతుల్యతకు దోహడపడుతూ ప్రకృతిలో ఉండే ఓ అరుదైన జీవి ఇది. విశాఖ కంబాల కొండ అభయాణ్యం అటవీశాఖ అధికారులు ఈ సరీసృపాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు పదాల్లో బిందెపాము జాతికి చెందిన బల్లి అనవచ్చు. విశాఖ అటవీశాఖ అధికారుల సహకారంతో అడారి యజ్ఞపతి అనే సైంటిస్ట్ అరుదైన ప్రాణిని కనుగొన్నారు. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంలో మొట్టమొదటిసారిగా అంతుచిక్కని బార్కుడియా లింబ్లెస్ స్కింక్ (బార్కుడియా మెలనోస్టిక్టా) కనిపించింది. హెర్పెటాలజీ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా దీన్ని అధికారులు చెబుతున్నారు. జీవవైవిధ్య హాట్ స్పాట్ గా అభయారణ్యం ప్రాముఖ్యతను తెలిపింది.
విశాఖపట్నం లింబ్లెస్ స్కింక్ బార్కుడియా మెలనోస్టిక్టా అనే చిన్న సరీసృపాలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. ప్రత్యేకమైన అవయవాలు ఏవీ లేని శరీరం, అసాధారణ జీవనం ఈ చిన్ని జీవి సొంతం. ఈ జీవి చాలా కాలంగా శాస్త్రీయ పరిశీలనకు దూరంగా ఉంది.
కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, దాని గొప్ప వృక్షజాలం, జంతుజాలంతో ఎల్లప్పుడూ పరిశోధకులకు, ప్రకృతి ఔత్సాహికులకు ఆకర్షణీయంగా ఉంటోంది. మొత్తం 71 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం అనేక అంతరించిపోతున్న, స్థానిక జాతులకు స్వర్గధామంగా ఉంది. విభిన్న పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఇక తాజాగా కనుగొన్న ఈ జీవి కూడా ఇలాంటి ప్రాంతాల్లోనే జీవిస్తుందని శాస్త్రవేత్తలంటున్నారు. బార్కుడియా లింబ్లెస్ స్కింక్ ఉనికి ఇలాంటి ప్రాంతంలో.. మహేంద్రగిరి వంటి ఎత్తైన కొండలు ఉన్న తూర్పుకనుమల్లోనే ఉంటుంది. అవయవాలు లేని చర్మం, ఫోసోరియల్ (భూమిలోపల బ్రతికే ప్రాణుల జాతికి), పొడుగు శరీరం, బురద గోధుమ రంగు దీని స్వరూపం.
బార్కుడియా లింబ్లెస్ స్కింక్ల జీవాన్ని, వాటి సంతతిని రక్షించడానికి అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటోంది. పరిరక్షణ ప్రయత్నాలలో ఈ అరుదైన, అసాధారణమైన సరీసృపాన్ని సంరక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. అటవీ శాఖ కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పర్యాటక, ప్రకృతి సున్నిత కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారుతుందని విశాఖ జిల్లా అటవీ అధికారి నంత్ శంకర్ తెలిపారు.
రక్షిత ప్రాంతంలోని బార్కుడియా లింబ్లెస్ స్కింక్ల పెరగడానికి వాటి రక్షణను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బార్కుడియా (బార్కుడియా ఇన్సులారిస్ మరొకటి) జాతికి చెందిన రెండు స్కింక్ జాతులలో ఇది ఒకటి. స్కింక్ దానికి అనువైన ప్రాంతంలో ఉంటుందని.. అదీ విశాఖలోని రిజర్వు ఫారెస్ట్.. అటు ఒడిశా మహేంద్రగిరి మధ్యలోనే ఇవి ఉంటాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Animals, Local News, Visakhapatnam