దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజురోజుకీ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేరథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లోని మార్చురీల్లో కొవిడ్ మృతదేహాలు పేరుకుపోతున్నాయి. ఐతే కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంతవారు కూడా ముందుకు రావడం లేదు. కరోనా భయంతో చాలా చోట్ల బంధువులు అంత్యక్రియలంటేనే భయపడిపోతున్నారు. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాత్రం ఓ యువకుడు సొంతంగా కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. మృతి చెందిన వారి బంధువుల నుంచి పైసా కూడా ఆశించకుండా ఏడాదిగా ఏ క్రతువును చేస్తున్నాడు. ఒక్క పోన్ కాల్ తో మృతదేహం ఎక్కడుంటే అక్కడికి చేరుకొని కొవిడ్ మృతులను స్వర్గపురికి సాగనంపుతున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్ తో పాటు సెకండ్ వేవ్ లోనూ తమ సేవను కొనసాగిస్తున్నాడు. అందరిచేత రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మల్లిశెట్టి భరత్ రాఘవ.. ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో భరత్ అంటే తెలియని వారుండరు. అందుకంటే కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది నుంచి ఈ సేవను కొనసాగితస్తున్న భరత్.. ఇప్పటివరకు 110కి పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. సొంతవాహనంలోనే మృతదేహాలను తరలిస్తూ.. తన స్నేహితుడి సాయంతో ఈ పనిచేస్తున్నాడు. ప్రమాదమని తెలిసినా., కొన్ని సాంప్రదాయాలు అడ్డొచ్చినా తనకు నచ్చిన పనిని మాత్రం భరత్ కొనసాగిస్తున్నాడు. ఇలా చేసినందుకు మృతుల బంధువుల నుంచి ఒక్క పైసా కూడా ఆశించడు. ఐతే డీజిల్ ఖర్చులు, పీపీఈ కిట్లు, అంత్యక్రియ సామాగ్రి ఖర్చులను మృతుల బంధువులు ఇస్తేనే తీసుకుంటాడు. ఏమీ ఇచ్చుకోలేని స్థితిలో ఉంటే వారు ఇచ్చినా తీసుకోడు.
కదిలించిన తండ్రి మరణం..
కొంతకాలం క్రితం భరత్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పట్లో ఆయన మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడు. కరోనా సమయంలో ఆ ఇబ్బందులు గుర్తొచ్చి.. తానే స్వయంగా మృతదేహాలకు అంత్యక్రియలు. నిర్వహిస్తున్నాడు. భరత్ చేస్తున్న సేవకు తొలుత బంధువులు, స్నేహితులు అడ్డు చెప్పేవారు. కానీ వారు కూడా అతడి మనసును అర్ధం చేసుకొని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులు కూడా అతడు చేస్తున్న సేవకు అండగా నిలబడుతున్నారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి మరీ గొప్పసేవ చేస్తున్న భరత్ కు సెల్యూట్ చేయాల్సిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona, East Godavari Dist, Rajahmundry S01p08