Pulasa Fish Price: బంగారంతో పోటీపడుతున్న పులస... అందుకేనా ఇంత డిమాండ్..?

బంగారంతో పోటీ పడుతున్న పులస

Pulasa Fish: పులస. గోదావరి నదిలో (Godavari River) దొరికే అత్యంత అరుదైన చేప. ఏటికి ఎదురీతూ ఏ చేపకూ దక్కని రుచిని, ప్రత్యేకతనూ సంతరించుకుంటుందీ చేప. పులస లభ్యత తగ్గడంతో ధర బంగారంతో (Gold Price) పోటీ పడుతోంది.

 • Share this:
  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  పులస (Pulasa Fish). గోదావరి నదిలో (Godavari River) దొరికే అత్యంత అరుదైన చేప. ఏటికి ఎదురీదుతూ ఏ చేపకూ దక్కని రుచిని, ప్రత్యేకతనూ సంతరించుకుంటుందీ చేప. అందుకే పులస దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్లే. అలాగే జనం కూడా పులస కోసం పోటీ పడుతుంటారు. పుస్తెలమ్మి అయినా పులస తినమని ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు. కానీ.. ఇప్పుడు అదే ధర విషయంలో పులస బంగారంతో పోటీలో పడుతోంది. తులం బంగారం ధర నలభై వేల పైమాటే. అలాగే ఇప్పుడు కేజీ పులస చేప రూ.30 వేల పైనే పలుకుతోంది. పులస లభ్యత తగ్గడం.., గోదావరిలో వరద పోటు కారమంగా జాలర్ల వలకు పులసలు ఆశించిన స్థాయిలో చిక్కడం లేదు. దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే కాలుష్యం, ఇసుక మేటలు కూడా పులస సంఖ్యను తగ్గించేస్తున్నాయి.

  నిజానికి గోదావరి పులస పులుసు పట్టుకుని మంత్రులు దగ్గరకో, ఓ పెద్ద ఉన్నతాధికారి దగ్గరకో వెళితే, వెళ్లిన పని పూర్తయిపోయేదట. డబ్బుతో కొనలేని పనులు కూడా ఒక్క పులస చక్కబెట్టేసేదని పెద్దలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే కోనసీమలో కుండలో పెట్టిన పులస పులుసు ఉందంటే ఆగమేఘాల మీద హైదరాబాద్‌ (Hyderabad)నుంచి పెద్ద పెద్ద వాళ్లంతా వాలిపోయేవారంటే అతిశయోక్తి కాదు. నిజానికి పులస కొనాలంటే ఐదొందలో, వెయ్యో ఉంటే సరిపోయేది. కానీ ఇది పదేళ్ల కిందటి మాట. ఐదారేళ్ల నుంచి పులస కావాలంటే రెండు నుంచి ఐదు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.

  ఇది చదవండి: హాట్ టాపిక్ గా మారిన ఏపీ మంత్రి ఫారిన్ టూర్.. ఇంతకీ ఆయన రష్యా ఎందుకెళ్లారు..?


  గత రెండేళ్ల నుంచి చూస్తే కిలో పులస పదిహేను వేలకు తక్కువకు దొరకడం లేదు. దీంతో సామాన్యులు, మధ్యతరగతి దాని పేరే తలచుకోవడం మానేశారు. ఈ ఏడాది సీజన్‌ మొదలయ్యాక కేవలం వేలం ద్వారానే పులస కొనుగోలు చేసే పరిస్థితి. గోదావరిలో కొన్నేళ్ల నుంచి పులసలు దొరకడం గగనమైపోయింది. ఒకటీ అరా దొరికితే దాన్ని సొంతం చేసుకునేందుకు చాంతాడంత క్యూ. దీంతో వేలం ద్వారానే కొనుగోళ్లు మొదలయ్యాయి.

  ఇది చదవండి: బ్యాంకులో బంగారం తాకట్టు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..


  ఆరోహ వలస జాతికి చెందిన పులసలు సాధారణంగా సముద్రంలో జీవిస్తాయి. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా(Australia), న్యూజిలాండ్‌ (New Zealand), టాంజానియా (Tanzania) వంటి దేశాల నుంచి వచ్చి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి, అక్కడ నుంచి బంగాళాఖాతం మీదుగా వరదల సమయంలో గోదావరిలోకి వచ్చి చేరతాయి. గోదావరి వరద నీరొచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టేందుకు ఈ చేపలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత అక్టోబరు నాటికి మళ్లీ సాగరానికి చేరుకుంటాయి.

  ఇది చదవండి: సాహసమే వారి ఊపిరి.. లక్ష్యం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది.. విశాఖ కుర్రాళ్లా మజాకా..!


  అలా వచ్చి, వెళుతున్న క్రమంలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు వచ్చినప్పుడు కొన్ని చేపలు జాలర్లకు చిక్కుతాయి. గతంలో ఈ చేపలు ఎక్కువగా ధవళేశ్వరం సమీపంలోను, కోనసీమతోపాటు యానాం తీరంలోనూ దొరికేవి. ఇప్పుడు దాదాపుగా ధవళేశ్వరంలో దొరకడం లేదు. కాస్త ఎక్కువగా యానాం తీరంలోనే పులసల జాడ కనిపిస్తోంది. ఇక్కడ దొరికిన చేపను ఈ సీజన్‌లో తొలుత రూ.20 వేలకు కొనుగోలు చేశారు. ఈమధ్య రెండు పెద్ద పులసలు దొరకకగా, వేలంలో ఒకటి రూ.23 వేలు, మరొకటి రూ.25 వేలకు పాట వెళ్లింది. వీటిని మత్స్యకార మహిళలు పాడుకోగా, మరో రెండు మూడు వేలు వేసుకుని పులసప్రియులకు అమ్మారు. దాంతో బంగారం ధరతో పోల్చి మరీ జనం చర్చించుకోవడం విశేషం.
  Published by:Purna Chandra
  First published: