Setti Jagadeesh, News 18, Visakhaptnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అధ్యాపకులు అందుబాటులోకి రానున్నారు. ప్రస్తుతం తక్కువమంది లెక్చరర్స్ ఉన్న కాలేజీలలో డిప్యూటేషన్‌పై అధ్యాపకులను పంపించి విద్యాబోధన చేయిస్తుంది ప్రభుత్వం. అయితే ఇకపై విద్యార్థులకు కష్టాలు తీరినట్లే.. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లెక్చలర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు ప్రకటనతో లెక్చరర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు.
ప్రస్తుతం చాలా డిగ్రీ కళాశాలలో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామని అన్నారు. మంచి ఉన్నత విద్యతో పాటు ఉపాధికి సంబంధించి భవిష్యత్‌కు బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని భాస్కరరావు వెల్లడించారు.
విశాఖపట్నం (Visakhapatnam) మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని సెప్టెంబర్ 3న భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని.., వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కాలేజీకి రూ.14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయని ఆయన స్పష్టం చేశారు.
నాడు-నేడు కింద భవనాల ఆధునికీకరణకు 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించామన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండాలనే విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు డిగ్రీ కోర్సులతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను యాడ్ చేసినట్లు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Government Jobs, Local News, Visakhapatnam