YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం... పోలీస్ వ్యాన్ లో దాక్కున్న నేత.. కారణం ఇదే..!

ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందకపోవడంతో పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారు.

  • Share this:
    P.భాను ప్రసాద్, విజయనగరం ప్రతినిథి, న్యూస్18

    ప్రజాసమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీయడం సర్వసాధారణం. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇళ్ల స్థలాలు, నిర్మాణ పథకంపై జనం తిరగబడ్డారు. ఏకంగా ఎమ్మెల్యేను తరిమికొట్టారు. దాడి నుంచి తప్పించుకునేందుకు సదరు ఎమ్మెల్యే పోలీస్ వ్యానులో దాక్కోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.., విజయనగరం జిల్లా, బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు ఘోర పరాభవం ఎదురైంది. అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదనే కారణంతో ప్రజలు చుట్టుముట్టి ఘోరంగా అవమానించారు. ఏపీలో కొన్ని పథకాలలో అర్హులకు న్యాయం జరగడం లేదన్న కారణంతో కొన్ని చోట్ల ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఏ చిన్న శంకుస్థాపన చేయాలన్నా వైసీపీ నాయకులు బెదిరిపోతున్నారు. భారీ భద్రత మధ్య ప్రజల్లోకి వెళ్లి తూతూ మంత్రంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యే ప్రజా ఆగ్రహానికి గురయ్యారు.

    తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విజయనగరం జిల్లా రామభధ్రాపురం సమీపంలోని కొండకెంగువ గ్రామానికి జగనన్న కాలనీ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో గ్రామంలో 50 మందికి పైగా అనర్హులకు ప్రాధాన్యం ఇచ్చారని, తమకు అన్యాయం చేశారంటూ గొడవకు దిగారు. పలు సమస్యలపై నిలదీశారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకే పట్టాలిస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఎమ్మెల్యేను ఘెరవ్ చేశారు.

    ఇది చదవండి: వాలంటీర్ల చేతికే మరికొన్ని పథకాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..



    విషయం తెలుసుకున్న సాలూరు పోలీసులు గ్రామానికి చేరుకొని భారీ భద్రత మధ్య శంకుస్థాపన చేసే ప్రాంతానికి ఎమ్మెల్యేను తీసుకెళ్లారు. న్యాయం చేయకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ మహిళలు, యువకులు అడ్డుపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్తులంతా టెంట్లు, కుర్చీలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్యే ఎటూ పోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎమ్మెల్యే 2 గంటల పాటు పోలీసు జీపులోనే దాక్కున్నారు. ప్రాణ భయంతో దాదాపు రెండు గంటల పాటు జీపులోనే ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు వచ్చారు. భారీ భద్రత మధ్య ఎమ్మెల్యే చినప్పలనాయుడు ను అక్కడనుంచి వెళ్లిపోయారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే గ్రామంలో అడుగుపెట్టాలని హెచ్చరించారు.

    తమకు ఇళ్ల స్థలాల విషయంలో అన్యాయం జరుగుతుందని గత కొన్ని నెలలుగా కొండ కెంగువ గ్రామస్తులు స్థానిక నాయకులను అడుగుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా ఎమ్మెల్యే అప్పలనాయుడు కూడా తెలిసింది. గ్రామంలోకి వెళ్లొద్దని.. గతంలో గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలపై ఎమ్మెల్యేలను ఇక్కడ గ్రామస్తులు అడ్డుకున్నారన్న కారణంతో.. ఎమ్మెల్యే శంబంగి ని కొండకెంగువ గ్రామానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. కాగా పోలీసుల మాట వినని ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగింది.
    Published by:Purna Chandra
    First published: