Notes on Road: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హంగామా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల సందడి చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే భారీగా నోట్ల కట్టలు (Cash Bundles) చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా జరిగిన ఓ ఘటన పలు అనుమానాలు రేకిస్తోంది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో నుంచి 500 నోట్ల రూపాయలు ఎగిరి పడ్డాయి. కొంత దూరం పాటు అలా నోట్ల వర్షం కురిసింది. రోడ్డు మీద 500 రూపాయల నోట్లు జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్ (Auto Driver) ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మడపాం టోల్‌గేట్ వద్ద చోటు చేసుకుంది. స్పీడ్ గా వెళ్తున్న ఒక ఆటోలో నుంచి 500 రూపాయల నోట్లు కిందకు పడ్డాయి. ఆ విషయాన్ని గమనించిన టోల్‌గేట్ సిబ్బంది ఆటోను ఆపమని కేకలు వేశారు. అయినా ఆటో వినిపించుకోకుండా వెళ్లిపోయాడు.. వినిపించినా ఆగలేదా.. లేక వినిపించకపోవడంతో వెళ్లిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే అక్కడ పడ్డ నోట్లను సిబ్బంది తీసుకున్నారు.
నోట్ల వర్షం విషయం పోలీసులకు తెలియడంతో నరసన్నపేట ఎస్‌ఐ సింహాచలం టోల్‌గేట్ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఇది పొరపాటున నోట్లు జారి పడలేదని.. కరజాడ దగ్గర నుంచే వీరు కావాలనే నోట్లు విసురుకుంటూ వస్తున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అయితే టోల్‌గేట్ దగ్గరకు వచ్చే సరికి నోట్ల వర్షం మరింత పెరిగింది అంటున్నారు.
ఇదీ చదవండి : వైసీపీ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వివేకా హత్య కేసు ఉచ్చు.. అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 88 వేల రూపాయలను కోర్టుకు పంపనున్నారు. ఈ లోపు ఎవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
మరోవైపు విశాఖపట్నంలో ఎంవీపీ పీఎస్ పరిధిలో 26 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంపిణీకి సిద్ధం చేస్తున్న 26లక్షల 89వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. MVP పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలో లవకుశ అపార్టుమెంట్ లో పట్టుకున్నారు. చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు. మరోవైపు పలు చోట్ల భారీగా నగదు కట్టలు కూడా బయటపడుతున్నాయి. ఓ వైపు ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు. రంగంలో స్పెషల్ పోలీస్ టీంలు దిగాయి. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, AP Politics