Andhra Pradesh: ఈ బోర్ పేరు కల్యాణి..! ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

తాను వేయించిన బోర్ దగ్గర కల్యాణి

వేసవి వస్తే చాలు అక్కడి ప్రజలు దాహంతో అల్లాడిపోతారు. గుక్కెడు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఓ వృద్ధురాలికి వచ్చిన ఆలోచన వారి కష్టాలకు చెక్ పెట్టింది.

 • Share this:
  నేనే బాగుండాలి అనుకోవడం స్వార్ధం.. అదే సమాజమంతా హాయిగా ఉండాలి అనుకోవడం బాధ్యత. అలాంటి బాధ్యతనెరిగిన ఓ పెద్దావిడ అపర భగీరథురాలి అవతారమెత్తింది. పక్కవాడికి పైసా విదిల్చని ఈ రోజుల్లో.. తాను కష్టపడి కూడబెట్టుకున్నదంతా చుట్టుపక్కలవారి కోసం ఖర్చు చేసింది. గుక్కెడు నీరులేక అల్లాడుతున్నవారి గొంతు తడిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటిలీలో హడ్కో కాలనీ ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. అక్కడి వారికి సరైన నీట సౌకర్యం లేదు. వేసవి వచ్చిందంటే చాలు స్థానికుల బాధలు వర్ణనాతీతం. కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది. అడుగంటిన బోర్లు, నీళ్లు అందించని కుళాయిలు. బిందెడు తాగు నీరు కావాలంటే భగీరథ యత్నమే చేయాలి. ఇవే ప్రతీరోజు అక్కడ కనిపించే నీటి కష్టాలు. ఇక ఈ కాలనీ వాసులంతా ఎన్నోసార్లు స్థానిక మున్సిపల్ అధికారులను, ప్రభుత్వాన్ని తమ నీటి సమస్యను తీర్చాలని కోరారు. అయితే వారెవరు పట్టించుకోకపోవడంతో వారి సమస్య సమస్యగానే మిగిలిపోయింది.

  ఇలా ఈ కష్టాలను చూసి అదే కాలనీలో నివాసం ఉంటున్న బోయిన కళ్యాణి (65) అనే వృద్ధురాలు చలించిపోయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటూ కూలిపనులు చేసుకుంటున్న ఆమె.. ఓ చిన్నగదిలో అధ్దెకుంటోంది. కూలిపనులు చేయగా వచ్చిన డబ్బులు, పెన్షన్ మొత్తాన్ని కూడబెట్టింది. స్థానికుల నీటి కష్టాలు తీర్చాలని భావించి తాను దాచుకున్న డబ్బుతోనే కాలనీలో బోర్ వేయించాలని నిర్ణయించుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిథులతో చెప్పింది. కానీ వాళ్లంతా వ్యతిరేకించారు. నీ డబ్బుతో నువ్వే బోర్ వేయించుకో.. కాలనీలో అవసరం లేదని తేల్చిచెప్పారు. కానీ కల్యాణి పట్టుబట్టి మరీ స్థానిక నేతలను ఒప్పించింది.

  ఇది చదవండి: పెళ్లైన 30ఏళ్ల తర్వాత భార్యపై అనుమానం... కోపంతో ఆ భర్త ఏం చేశాడంటే..!

  జియాలజిస్టుల ద్వారా అక్కడ బోరు ఎక్కడ పడుతుందో సర్వేయించి పనులు ప్రారంభింపజేసింది. తాను కూడబెట్టుకున్న లక్షా పదివేల రూపాయలను అందజేసింది. నాలుగు రోజుల క్రితం మొదలైన బోర్ వెల్ పనులు కూడా పూర్తై గంగమ్మ ఉబికి వచ్చింది. దీంతో కల్యాణితో పాటు స్థానికులు కూడా ఆనందంతో పండగ చేసుకున్నారు. ఏళ్లుగా పడుతున్న నీటి కష్టాలు తీరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కల్యాణ్ చేసిన పనికి రెండు వీధులకు నీటి కష్టాలు తీరిపోయాయి. తన రెక్కల కష్టంతో కాలనీ వాసుల కోసం బోరు వేయించిన కల్యాణిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆ బోర్ వెల్ కు కల్యాణి అని నామకరణం చేశారు.

  ఇది చదవండి: ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు..? కేంద్రం హెచ్చరిక

  Published by:Purna Chandra
  First published: