Setti Jagadeesh, News 18, Visakhapatnam
కూరగాయలు పండించే రైతుకు ఉపయేగపడవలసిన రైతు బజార్లు రైతు బినామీలకు మేలు చేస్తున్నాయి. రైతు బజారు (Raithu Bazars) లలో వ్యాపారం చేసుకొనేందుకు రైతుల నుంచి ధరఖాస్తులు ఆహ్వానించే సమయంలో రైతుతో పాటు అతనికి ఒక సహయకుడిగా మరొక వ్యక్తికి అవకాశం కల్పించారు. చాలామంది రైతులు తాము పొలంలో కూరగాయలు పండించి వ్యవసాయం చేస్తున్నందున రైతు బజార్లకు వచ్చి విక్రయించ లేమని తమకి బదులుగా తమ రక్తసంబదీకులకు అవకాశం కల్పించాలని కోరటంతో ఈ నామిని వ్యవస్తకు దారితీసింది. ఆ తర్వాత మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు కొందరు డబ్బులు తీసుకొని వ్యాపారస్తులకు నామినీ కార్డులు జారీ చేయడంతో ఇప్పుడు రైతు బజార్లలో బినామీలే రాజ్యమేలుతున్నారు. కాగా, విశాఖలో రైతు బజార్లలో బినామిలను తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్దమౌతుంది.
రైతుల ముసుగులో దర్జాగా కూరగాయలు, సరుకుల అమ్మకాలు చేస్తున్నవారిపై విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) జాయింట్ కలెక్టర్ కన్నెర్ర చేశారు. రైతులు కాకపోయినా, రైతు కుటుంబానికి చెందిన వారు కాకపోయినా అధికారులను మంచి చేసుకొని వారికి చేతులు తడిపి రైతుబజార్లల్లో అమ్మకాలు చేసే వారిని లేకుండా చేసేందుకు చర్యలు మొదలుపెడుతున్నారు. రైతుబజార్లో కూరగాయలు అమ్ముతూ మృతి చెందిన రైతు బంధువులకు నామినీ కార్డులు జారీ చేసిన ఘనత మార్కెటింగ్ శాఖకే దక్కింది. మెయిన్ రైతు మృతి చెందితే అతని భార్యకు లేదా పిల్లలకు పాసుబుక్కు అధారంగా కుటుంబసభ్యులకు కొత్తకార్డ్ జారీ చేయాల్సి ఉంది. కాగా, చనిపోయిన రైతులకు ఎటువంటి రక్తసంబంధం లేనివ్యక్తులకు నామినీ ముసుగులో కార్డులు జారీ చేసిన సంఘటనలు అనేక వున్నాయి.
మృతిచెందిన రైతుబజార్లో రిజిస్టర్డ్ రైతుల వివరాలను సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. 13 రైతుబజార్లల్లో ఎంతమంది రైతులు మృతిచెందారనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. దీంతో పంట ఉన్న రైతు ఒక్కరైతే.. అనేక మందికి నామిని కార్డులు జారీ చేసిన విషయాలు బయటపడుతున్నాయి. దీంతో బినామీ వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. బినామీలను తొలగించి పండ పండించే రైతులకు కొత్తకార్డు జారీచేసేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలు చేపట్టారు.
ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా అధికారుల అండదండలతో రైతుబజార్లల్లో చలామణి అవుతున్న బినామిలను తొలగించాలని రైతులు, కొనుగోలు దారులు కోరుతున్నారు. రైతులను జంబ్లింగ్ విధానం ద్వారా మార్పిడి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదేశించారు. ఎన్నికల కోడ్ కారణంగా కొంత సమయం తీసుకొని ఆ తర్వాత జంబ్లింగ్ ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా కొంతమేరకు బినామిల బెడద తగ్గే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇక ఓకే కుటుంబంలో నాలుగు నామినీలతో వివిధ రైతు బజార్లల్లో అమ్మకాలు జరుపుతున్న వారు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలు చేపట్టి త్వరిత గతిన నామీలను గుర్తించి తొలగించాలని నిజమైన రైతులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam