Navy Day 2022 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) నేడు ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. ఏపీలో ఆమె రెండు రోజులు పర్యటిస్తారు. నేటి టూర్ షెడ్యూల్లో భాగంగా ఆమె.. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరతారు. తర్వాత ఉదయం 10.15కి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. తర్వాత తాడిగడప పురపాలక సంఘం పరిధిలో.. పోరంకి మురళి రిసార్టులో.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్... ప్రభుత్వం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. తర్వాత విజయవాడలోని రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో ముర్ము పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30కి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు. అక్కడ రామకృష్ణ బీచ్ (RK Beach)లో తూర్పు నౌకాదళం జరిపే నౌకాదళ (Navy Day Celebration) దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
నేవీ డేకి ఢిల్లీలో కాకుండే మరోచోట రాష్ట్రపతి పాల్గొననుండటం భారత నౌకాదళ చరిత్రలో ఇదే మొదటిసారి. మన దేశంలో డిసెంబరు 4న అన్ని నౌకాదళాలా నేవీ డే జరుపుతాయి. ప్రధాన కార్యక్రమం మాత్రం ఢిల్లీలో ఉంటుంది. సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వైజాగ్ వస్తుండటం విశేషం. శాఖపట్నంలో తూర్పు నౌకాదళం నిర్వహించే నేవీ డేకి వస్తున్నారు. షెడ్యూల్లో భాగంగా రాత్రికి తిరుమల వెళ్లనున్న ద్రౌపది ముర్ము.. రాత్రి అక్కడే ఉండి.. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సర్వం సిద్ధం :
ఆర్కే బీచ్‌లో నౌకా దళ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. సముద్ర తీరాన జరిగే ఈ ఉత్సవాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా విశాఖ తీరంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. సముద్రంపై మూడు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ మిగ్ 29కే ద్వారా యుద్ధ ప్రదర్శనలు ఉండబోతున్నాయి. ఆ దృశ్యం కట్టిపడేస్తుంది. అలాగే నాలుగు డార్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆరు ఆడ్వాన్స్ జెట్ ట్రైనర్ హాక్స్ సహా మొత్తం 25 ఎయిర్‌క్రాఫ్ట్‌లు నింగిలో చక్కర్లు కొడతాయి. వీటికి తోడు 15 యుద్ధ నౌకలు చీకట్లో పసుపు రంగు లైట్లను వెలిగిస్తాయి. ఆ లైటింగ్స్ ఆకాశంవైపు సాగుతాయి. అలాగే మెరైన్ కమాండోల డ్రిల్, పారా జంపర్లు, స్కై డైవర్ల విన్యాసాలు చూసి తీరాల్సిందే.
ఘనమైన చరిత్ర
1944 అక్టోబర్ 21న రాయల్ ఇండియన్ నేవీ .. తొలిసారిగా నేవీ డేని జరిపింది. దీని ద్వారా నౌకా దళం గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తీర ప్రాంత నగరాల్లో ఈ వేడుకలు జరుపుతున్నారు. ఇండో-పాకిస్థాన్ వార్ సందర్భంగా.. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో డిసెంబర్ 4న వేడుకలు జరిపారు. అలాగే.. డిసెంబర్ 1 నుంచి 7 వరకూ నేవీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.