Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయంగా యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కులాల కుంపట్లపై రాజకీయం మంట పెడుతోంది. సోషల్ మీడియా వేదికగా సెగలు పుట్టేలా చేస్తోంది. మొదట వైసీపీ (YCP) ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) వర్సెస్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) మధ్య ట్వీట్ల యుద్ధం ఇప్పుడు చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)ని తాకింది. గత రెండు రోజులుగా విజయసాయి రెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ బండ్ల గణేష్ ట్వీట్లు చేస్తున్నారు. నువ్వెంత అంటె నువ్వెంత అంటూ ట్విట్టర్(Twitter) ద్వారానే తిట్లదండకం అందుకున్నారు. నీ స్థాయి ఇది అంటే.. నీ స్థాయి ఇది అని ఒకరిని ఒకరు హేళన చేసుకున్నారు. అయితే ఆ ట్వీట్ల యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదు.. ఇద్దరు తగ్గదేలే అంటూ కౌంటర్లు వేస్తున్నారు. బండ్ల గణేష్ - విజయసాయి రెడ్డి మధ్య మొదలైన ఈ యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబుపైకి వచ్చింది. తాజాగా బండ్ల గణేష్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తిట్టేంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గుంట నక్కలను ఉసిగొల్పుతున్నాడని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆ గుంట నక్కలను ఊళలకు సంబరపడే నార్సిసిస్టిక్ జబ్బు చంద్రబాబుకి జిగురులా పట్టుకుందని ట్వీట్ చేశారు. కేవలం అభద్రతా భావాన్ని ఎగదోసి బుసలు కొట్టించడం, ఓటమిని గెలుపు అనుకోవడం ఈ జబ్బు లక్షణంగా ఉంటుందని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. వృద్ధాప్యంలో ఇదో దీనావస్థ అని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తిట్టేంచేందుకు ‘గుంట నక్కలను’ ఉసిగొల్పుతున్నాడు బాబు. వాటి ఊళలకు సంబరపడే ‘నార్సిసిస్టిక్’ రుగ్మత(Narcissistic disorder) జిగురులా పట్టుకుంది. అభద్రతా భావాన్ని ఎగదోసి ‘బుసలు’ కొట్టించడం, ఓటమిని గెలుపు అనుకోవడం దీని లక్షణం. వృద్ధాప్యంలో ఇదో దీనావస్థ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 17, 2022
అంతకుముందు సైతం చంద్రబాబుపై వరుసు విమర్శలు చేస్తూనే ఉన్నారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు ఉన్మాద భ్రమ అంటూ విజయసాయి విమర్శలు చేశారు. సొంత వర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ప్రకటించాడని ఆరోపించారు. సీఎం జగన్ 1250 ఎకరాల్లో 54,400 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తలపెడితే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు. ఈదురుగాలులు వీచినప్పుడల్లా ధూళి 'రేణు'వులు ఎగిసిపడతాయి. వీటికి భయపడి ఎవరూ ఇళ్లలో కూర్చోరు. చంద్రబాబులాంటి ఉన్మాదులు దాన్నో వాయుగుండంగా ఊహించుకుని అంతా నాశనమైనట్టేనని భ్రమపడతారని సెటైర్లు వేశారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ ను ఫాలో అయిన మంత్రులు.. ఆ ఇద్దరికి హ్యాట్సాఫ్
ఎగిరిన ఏ 'రేణు'వులైనా నేలరాలి క్షణకాలపు మసకను, స్వల్ప చికాకును మిగిల్చిపోతాయి అని విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. బండ్ల గణేష్ కూడా విజయసాయిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 'నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి ఎవడో చెప్పిన మాటల్ని విని, ఎవరి దగ్గరో ఎంక్వైరీ చేసుకొని ట్వీట్లు పెట్టకు దొంగసాయి. ఎందుకంటే ఒకటి మనస్సాక్షి అనేది ఉంటుంది అంటూ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. మరి ఈ ట్వీట్ల యుద్ధం ఇంకెటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Vijayasai reddy, Ycp