P Bhanu Prasad, News18, Vizianagaram
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల వారీగా జరుగుతున్న వైసీపీ (YSRCP) ప్లీనరీల్లో అధికార పార్టీ నేతలు ప్రతిపక్షంపైనే కాదు.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా క్లాస్ తీసుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేయకుండా పార్టీలో ఉంటామంటే కుదరదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా (Vizianagaram District) వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana).. టీడీపీ (TDP) ని తిడుతూనే.. వైసీపీ కార్యకర్తలకు కూడా చురకలంటించారు. పార్టీలో ఉన్నవారు పనిచేయాలని.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మైలేజ్ తీసుకురావాలని సూచించాగు. ఇక పేదవారికి సంక్షేమ పథకాలు ఇస్తే టీడీపీ ఓర్వలేకపోతుందని, పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలకు దోచిపెడుతుందని మాట్లాడుతున్నారంటూ బొత్స మండిపడ్డారు. పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని బైజూస్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే.. దాంట్లో కూడా స్కామ్ జరిగిందని చంద్రబాబు అంటున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేయడం మన ఖర్మ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం అమలవుతున్న పథకాలను వివరించిన బొత్స.., బైజూస్ లాంటి సంస్ధతో పేద విద్యార్ధులకోసం ఉపయోగపడేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే.. దానిపైనా చంద్రబాబు ఆరోపిస్తున్నాడంటూ మండిపడ్డారు. విజయనగరం జిల్లా ప్రజలకు గత మూడేళ్లతో 5వేల కోట్ల రూపాయలతో వివిధ పధకాల కింద అందించామని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి మాట, వైసీపీ బాట అని.. ప్రతీ కార్యకర్తది అదే మాట, అదే బాట అని బొత్స అన్నారు. స్వలాభం, స్వార్థం అనేది వైసీపీ లో చెల్లుబాటు కాదని.. ప్రతి ఒక్కరికీ పార్టీలో గౌరవం ఉందని, అందరం కలిస్తేనే రాజకీయమని, అది ఏ ఒక్కరి సొత్తు కాదని బొత్స కార్యకర్తలకు హితబోధ చేసారు.
విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి, చంద్రబాబు మూడేళ్లకు ఒకసారి జిల్లాకు వచ్చి మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. టీడీపీ నేతలు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని, మాటకు మాట సమాధానం కాదన్నారు. మా ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలో జరిగిన అభివృద్ధిని చెబుతామని, విజయనగరం గంట స్తంభం దగ్గరైనా బహిరంగంగా చెబుతామన్నారు. మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలో జరిగిన ప్రభుత్వ అభివృద్ధి పై శ్వేత పత్రం విడదల చేసి, సమావేశంలో ప్రకటించనున్నామన్నారు.
గ్లోబల్ స్టూడెంట్స్ ని తయారు చేయాలనే లక్ష్యంతో ఉచితంగా, రూపాయి ఖర్చు లేకుండా, బైజూస్ అనే సంస్ధతో ఒప్పందం చేసుకొని తీసుకు వస్తే, దానిలో అవినీతి జరిగిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడని.. పైసా ఖర్చే లేని చోట అవినీతి ఏమిటి బాబూ? అంటూ ప్రశ్నించారు. కార్యకర్తలు, నాయకులకి ప్రతి ఐదేళ్లకి ఒకసారి పరీక్షలు ఉంటాయని.. పదవి వచ్చాక ప్రజల్లోకి వెళ్లకుండా రాజులా ఉందాం అనుకుంటే చెల్లదన్నారు. ప్రజల్లోకి వెళ్లకే అశోక్ గజపతి రాజు, బొబ్బిలి రాజుల్లాంటి వారు కనుమరుగైపోయారని అన్నారు. ఒకప్పుడు రాజులకి దారిలో చీరలు పరిచే వారని ఇప్పుడు చీత్కారాలు ఎదుర్కొంటున్నారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Botsa satyanarayana, Ysrcp