VISAKHAPATNAM MINI TITANIC SHIP FOUNDED IN ANDHRA PRADESH COAST AS IT HAS 100 YEARS HISTORY FULL DETAILS HERE PRN VSP
Titanic in AP: ఏపీ తీరంలో టైటానిక్.. వందేళ్లుగా సముద్రంలోనే..ఆసక్తిని రేకెత్తిస్తున్న షిప్ హిస్టరీ..!
సిల్కా షిప్ (ఫైల్)
ఒకప్పుడు రాజసం ఒలికిస్తూ అటు ఇటు కదలాడిన నౌక అది.1600 మంది ప్రయాణికులు, నావికులతో కలిసి బర్మా వెళుతోంది. సడన్ గా అగ్నిప్రమాదం జరిగింది. గంటల వ్యవధిలోనే మునిగిపోయింది. చివరికి.. సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో కాస్తంత లోతులో ఇప్పుడు మౌన సాక్ష్యంగా ఉండిపోయింది.
ఒకప్పుడు రాజసం ఒలికిస్తూ అటు ఇటు కదలాడిన నౌక అది.1600 మంది ప్రయాణికులు, నావికులతో కలిసి బర్మా వెళుతోంది. సడన్ గా అగ్నిప్రమాదం జరిగింది. గంటల వ్యవధిలోనే మునిగిపోయింది. చివరికి.. సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో కాస్తంత లోతులో ఇప్పుడు మౌన సాక్ష్యంగా ఉండిపోయింది. మినీ టైటానిక్ గా ఇప్పుడు చెబుతున్నారు. ఒకప్పటి తరం ఆ నౌక మునక గురించి ఆశ్చర్యంగా చెబుతుంటే.. సైంటిస్టులు ఆ నౌకలో మెరైన్ లైఫ్ గురించి చెబుతున్నారు. ఒకరిద్దరు చరిత్రకారులు మాత్రం అప్పటి దాని వినియోగం, రహస్యాల్ని వివరిస్తున్నారు. ఏపీలో సువిశాల సముద్ర తీరం ఉంది. ఈ తీరంలో అనేకానేక రహస్యాలు ఉన్నాయంటున్నారు ఓషనలజిస్టులు. సైంటిస్టులు.. స్కూబా డైవర్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని వెలికితీస్తూనే ఉన్నారు.
విశాఖపట్నం (Visakhapatnam) కు చెందిన స్కూబా డైవర్.. రిటైర్డ్ నావికులు పి. బలరామ్ నాయుడు తన మొత్తం జీవితాన్ని దాదాపు సముద్రంలోనే గడిపారు. ఆయనే ఈ మినీ టైటానిక్ ను బయటపెట్టారు. ఉత్తరాంధ్రలో అటు మూలన ఉన్న శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) బారువలో ఈ మినీ టైటానికి సముద్రంలో ఉంది. దీని పేరు ఎస్.ఎస్ చిల్కా షిప్ అని చెప్పారు బలరామ్ నాయుడు. బారువ తీరానికి ఆరువందల మీటర్ల దూరంలో ఉంది. అంటే కిలోమీటర్ కి నాలుగువందల మీటర్లు తక్కువ. ఇక నలభై మీటర్ల లోతున ఈ షిప్ ఉందని విజువల్స్ ద్వారా చూపించారు. సముద్రంలో కొత్త విషయాల్ని, మెరైన్ లైఫ్ ను అన్వేషిస్తూ ఉంటారు బలరామ్ నాయుడు.
ఆ సందర్భంలోనే విశాఖ నుంచీ బారువ తీరానికి వచ్చారు. ఇక్కడే సముద్రపు లోతున గతేడాది ఈ షిప్ ఉందని గ్రహించారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే మొదట్లో కాస్తంత ఇబ్బందులు వచ్చాయి. షిప్ బాగా పాతబడటంతో.. డెక్ లు మరీ పదునుగా ఉండటంతో లోపలికి వెళ్తే గాయాలు అయ్యాయట. దీంతో ఆలోచన విరమించుకున్నారు. అయితే ఈ షిప్ లోపలికి వెళ్లి ఎలాగైనా అన్ని విషయాలు కనిపెట్టాలని భావించారు. దీంతో మళ్లీ షిప్ లోపలికి తన బృందంతో వెళ్లారు. షిప్ లో సగ భాగం మొత్తాన్ని చుట్టేశారు.
ఇక షిప్ ఎలా మునిగిపోయిందో తెలుసుకోవాలని.. దాని పేరేంటో తెలుసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాను షిప్ విజువల్స్, ఫొటోలు తీసి తన సైట్ లో పొందుపరిచారు. అయితే ఈ సైట్ లో షిప్ వివరాలు చూసి ఓ విదేశీయుడు బలరామ్ నాయుడ్ని సంప్రదించారు. మెయిల్ ద్వారా ఆషిప్ వివరాలు వెల్లడించారు. అందులో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ సి అనే చరిత్ర కారుడు ఈ షిప్ గురించి వివరాలు తెలిపారు. 1917లో ఎస్ఎస్ చిల్కా మునిగిపోయిందని.. అప్పటి వరకూ ఈ బ్రిటిష్ నౌక ఎన్నో సేవలు అందించిందని అన్నారు. "బ్రిటీష్ ఇండియన్ స్టీమ్ నావిగేష కంపెనికి చెందినది. ఇది విశాఖ కేంద్రంగా రాకపోకలు సాగించేది. భారత్, బర్మాకు వలస కూలీలను చేరవేసేది. దీనితో పాటు మరో షిప్ కూడా ఉండేది పేరు ఎస్.ఎస్. కోకోనాడా. దీన్ని 1933లో జలదుర్గాగా పేరు మార్చారు. ఇది మొట్టమొదటి కమర్షియల్ వెసెల్.
ఇక ఎస్.ఎస్ చిల్కా గురించి మరిన్ని వివరాలు కూడా తన మెయిల్ లో రాశారు జాన్ సి. ఇది 17 జులై 1917న మునిగిపోయింది. 15 మంది ఐరోపా వాసులు, 1600మంది భారతీయులు నావికులు కలిపి మొత్తం 1600 మంది ఇందులోఉన్నారట. ప్రమాద సమయంలో 81 మంది మాత్రమే చనిపోయారట. మిగతావారిని అప్పటి వైజాగపట్నం (ఇప్పటి శ్రీకాకుళం) రంగూన్ల తీరాల నుంచీ వారి ప్రాంతాలకు పంపారు. బారువా తీరంతో పాటు.. అప్పటి తీరంలో ఉన్న చాలా మంది మత్స్యకారులు తమ నాటు పడవల ద్వారా వీరిని కాపాడారు. అత్యంత ధైర్య సాహసాలతో వారు సముద్రంలో దూకేసిన వారిని కూడా రక్షించారు.
షిప్ మునిగిపోయే నాటికి ఇందులో ప్రమాదకర పేలుడు పదార్ధాలు ఉన్నాయన్నారు. అయితే ఇక ప్రస్తుతం ఆ నౌక తీరానికి ఆరువందల మీటర్ల దూరంలోనే ఉంది. వందేళ్లు దాటుతున్న నేపధ్యంలో పేలుడు పదార్ధాలు ఉన్నా.. అవి ప్రమాదకరం కాబోవని బలరామ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం షిప్ అంతటా.. అద్భుతమైన, అరుదైన మెరైన్ లైఫ్ (సముద్ర జీవరాశి) ఉందని వివరించారు. దానికి భంగం కలిగించకుండా డైవర్లందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని బలరామ్ చెప్పారు. ఇప్పటికీ తమ స్కూబా బృందం దాదాపు ఆరుసార్లు ఈ ప్రదేశాన్ని చూసి వచ్చామని చెప్పారు.
మరోపక్క ఈ షిప్ ను చూసేందుకు కూడా సాధారణ పర్యాటకులకు వీలవుతుందని బలరామ్ అంటున్నారు. స్కూబా డైవింగ్ ద్వారా కొన్ని నియమినిబంధల మేరకు ఈ షిప్ ను చూసేందుకు పట్టుకెళ్తామని అంటున్నారు. ఆసక్తిగల పర్యాటకులు తమను సంప్రదించాలన్నారు. స్కూబా ద్వారా నౌక వెలుపలి భాగాలు.. డెక్, లోపలి కొన్ని భాగాల వరకూ వెళ్లవచ్చన్నారు. సముద్ర పర్యాటకంలో ఇది కీలకమైన పర్యాటక ప్రాంతంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.