హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Metro: వైజాగ్, విజయవాడ మెట్రో ఇప్పట్లో లేదు.. ఏపీ ప్రభుత్వ తీరే కారణం

AP Metro: వైజాగ్, విజయవాడ మెట్రో ఇప్పట్లో లేదు.. ఏపీ ప్రభుత్వ తీరే కారణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుతో వైజాగ్, విజయవాడలకు మెట్రో ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. రుణాల కోసం సమర్పించాల్సిన ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం సరైన సమయంలో అందించడంలో విఫలమవడంతో పలు బ్యాంకులు నిధులు ఇవ్వడం లేదు. దీంతో మెట్రో పనులు మొదలు కావడం లేదు.

ఇంకా చదవండి ...

విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో రైలు ఇప్పట్లో రాకపోవచ్చు. కనీసం భవిష్యత్తులో కూడా తిరిగే సూచనలు కనిపించట్లేదు. మెట్రో రైల్ పాలసీ -2017 కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన సవరించిన ప్రతిపాదనలను సమర్పించడంలో విఫలమవడమే దీనికి కారణం. బుధవారం రాజ్యసభలో టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హౌసింగ్​, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. వైజాగ్ మెట్రో రూ. 15,933 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టారు. ఇది నాలుగు కారిడార్లలో మొత్తం 75.3 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 2028 కి గడువుగా అప్పట్లో నిర్ణయించారు. 46.40 కిలోమీటర్లకు పైగా విస్తరించే మొదటి దశ 2025 నాటికి పూర్తి కావాలి. 79.91 కిలోమీటర్ల లైట్ మెట్రో కారిడార్, 60 కిలోమీటర్ల ఆధునిక ట్రామ్ కారిడార్ అభివృద్ధి కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌లు మెట్రో, ట్రామ్ కారిడార్‌ల కోసం ప్రత్యేక డీపీఆర్‌లను సిద్ధం చేసి, వాటిని వరుసగా నవంబర్​, డిసెంబర్ మధ్యలోనే సమర్పించాలి.

నాలుగు మెట్రో కారిడార్లు..

నిపుణులు 52 స్టేషన్లతో నాలుగు మెట్రో కారిడార్‌లను సిఫార్సు చేశారు. 75.31 కిలోమీటర్ల పొడవున విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. కారిడార్ -1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.23 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంటుంది. కారిడార్ -2 గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.26 కిలోమీటర్లు మేర ఉండనుంది. కారిడార్ -3 తాటిచెట్లపాలెం నుంచి చైనా వాల్‌టెయిర్ వరకు 6.91 కి.మీ.లు, కారిడార్ -4 కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 28.91 కి.మీ. ఉండనుంది. ట్రామ్ సేవలు మూడు మార్గాల్లో పనిచేస్తాయి. కారిడార్ -1-ఎన్ఎడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు, 10.20 కిలోమీటర్లు, అనకాపల్లికి స్టీల్ ప్లాంట్ గేట్ 18.20 కిమీలు, కారిడార్ -3 పాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి భీమిలి బీచ్ వరకు రుషికొండ 31.80 కిమీలు ఉండనుంది.

రుణాలకు తిరస్కరణ..

కాగా, అంతా ఒకే అనుకుంటున్న సమయంలో కొరియన్ ఎగ్జిమ్​ బ్యాంక్ నుంచి ఆశించిన ప్రాజెక్ట్ నిధులు రాలేదు. రుణాల స్థితిపై, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో విశాఖపట్నంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం కొరియన్​ ఎక్సిమ్ బ్యాంక్ నుంచి రాష్ట్రం ఆర్థిక సహాయం కోసం ప్రతిపాదనను కూడా సమర్పించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. బ్యాంకు ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత, ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేయడానికి అక్కడి అధికారులు విముఖత వ్యక్తం చేశారు. అందువల్ల, ప్రాజెక్ట్ ప్రతిపాదన రుణం కోసం ఇతర ద్వైపాక్షిక లేదా అంతర్జాతీయ ఏజెన్సీల ముందు నివేదిక సమర్పింవచ్చని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. కానీ, విశాఖపట్నంలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం సహాయానికి సంబంధించి తాజా ప్రతిపాదన ఏదీ ఏపీ నుంచి అందలేదని కేంద్ర మంత్రి చెప్పారు. దీంతో మెట్రో ప్రాజెక్టు ఇప్పటిలోగా పట్టాలెక్కే ఛాన్స్​ లేకపోవచ్చు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Metro Train, TG Venkatesh

ఉత్తమ కథలు