Setti Jagadeesh, News18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హస్తకళలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో పాటు కళాకారులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి ఉన్నత స్థాయికి చేరవేయడంలో లేపాక్షి ఎంపోరియం షోరూంలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మన రాష్ట్రవ్యాప్తంగా 23 రకాల హస్తకళలపై ఆధారపడి, రెండు లక్షల మందికి పైగా కళాకారులు జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మరింత ఉపాధి పెంచడంతో పాటు ఆ కళలను బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. విశాఖపట్నం (Visakhapatnam) లో ఏర్పాటు చేసిన లేపాక్షి ఎంపోరియంలో అనేక హస్తకళలకు చెందిన వస్తువులు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. స్థానికంగా తయారు చేసిన చెక్క బొమ్మలు కావడంతో పెద్ద ఎత్తున వీక్షిస్తూరు… వారికి నచ్చిన బొమ్మలను కొనుగోలు చేస్తున్నారు.
ఇక్కడ ముఖ్యంగా కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు ఫేమస్‌గా నిలుస్తున్నాయి. వీటితో పాటు బొబ్బిలి వీణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువులు బాగా సేల్ అవుతున్నాయని మేనేజర్ విజయ గౌరీ చెబుతున్నారు. కళాకారుల నుండి నేరుగా వస్తువులు కొనుగోలు చేసి వారిని ఆదుకోవడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ షోరూమ్‌లో వంద రూపాయల నుండి 2 లక్షల వరకు కూడా విలువచేసే బొమ్మలు ఉన్నాయి.
హస్తకళలను మరింత ప్రోత్సహించే పనిలో భాగంగా.. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతం ఉంటున్న17 లేపాక్షి ఎంపోరియంలతో పాటు అదనంగా ఇప్పుడు మరో ఆరు కొత్త షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ , గుంటూరు , కర్నూలు , విశాఖ విమానాశ్రయం, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, వైఎస్సార్ కడప , తిరుమల, తిరుపతి, తిరుపతి శ్రీనివాసమ్, విష్ణు నిలయం, తిరుపతి విమానాశ్రయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీలో లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయి.
కొత్తగా కాకినాడ, విజయవాడ, గండికోట, విశాఖపట్నం, కడప, తిరుపతిలో కూడా మరిన్ని షోరూమ్‌లు ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఒక లేపాక్షి షోరూమ్ ఏర్పాటుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ’ ద్వారా హస్తకళల కళాకారులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా వేరు వేరు ప్రాంతాల్లో క్రాఫ్ట్‌మేళా, ఎగ్జిబిషన్, ప్రచారం, మార్కెటింగ్ వంటి వాటి ద్వారా కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక రాష్ట్రంలో హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.
ప్రజలకు తమకు నచ్చిన బొమ్మలను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతోపాటు తోలు బొమ్మలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో కూడా ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు.
అడ్రస్..: లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, జగదాంబ జంక్షన్, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్- 530002
ఎలా వెళ్లాలి..? ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జగదాంబ సెంటర్‌కు చేరుకోవాలి. సెంటర్లో పూర్ణ మార్కెట్ వెళ్ళే మార్గం వైపు చూస్తే లేపాక్షి షోరూం కనిపిస్తుంది. ఇక్కడికి ఆటో బస్సు సౌకర్యం కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam