VISAKHAPATNAM LAKE OF GUNNY BAGS IRRITATING FARMERS AS THE YIELD READY TO SELL TO GOVERNMENT IN WEST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
Farmers Problems: తప్పు ఎవరు చేసినా శిక్ష రైతుకే...! వారి నిర్లక్ష్యం.. వీరి దురదృష్టం..
ప్రతీకాత్మకచిత్రం
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందని పాత సామెత. దీనికి తగ్గట్టే ఉందీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని రైతుల పరిస్థితి (Farmers Problems). నెలల తరబడి పండించిన పంట.. చిన్న కారణంతో కళ్లాల్లోనే ఉండిపోతోంది.
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందని పాత సామెత. దీనికి తగ్గట్టే ఉందీ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని రైతుల పరిస్థితి (Farmers Problems). నెలల తరబడి పండించిన పంట.. చిన్న కారణంతో కళ్లాల్లోనే ఉండిపోతోంది. అదికారుల నిర్లక్ష్యమో... రైతుల దురదృష్టమో తెలియదుగానీ.. ఈ పరిస్థితుల్లో చిన్నచినుకు పడినా రైతు కష్టం గంగపాలు కావాల్సిందే..! రైతు పండించిన ధాన్యాన్ని ఎత్తాలన్నా.. గొడౌన్లకు తరలించాలన్నా.. సంచులు కావాలి. ఇప్పుడు అవే కరువయ్యాయి. దీంతో రైతులు బేల చూపులు చూస్తున్నారు. మరో నెల రోజుల వ్యవధిలోనే ఖరీఫ్ ఉత్పత్తులు ముమ్మరం కానున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి. సొమ్ములు చెల్లించాలి. కానీ.. ఇప్పటికీ సంచులు లేవంటూ పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడు ప్రధాన లక్ష్యం. కానీ.. ప్రస్తుతం సంచులు సమకూర్చడం ఎలా అన్నదే తీవ్ర సమస్యగా ఉంది.
ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల కోసం మిల్లర్లే సంచుల సమకూర్చేవారు. ప్రభుత్వం ఛార్జీలు చెల్లిస్తూ వచ్చేది. దీనిపై మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య అగాథం ఉంది. ధాన్యం సంచులకు పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లించాలని మిల్లర్లు పట్టుబడుతున్నారు. బియ్యానికి సంచులు ఇస్తున్నాం కాబట్టి మిగిలిన వాటికి మాత్రమే వినియోగచార్జీలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మిల్లర్ల నుంచి టన్ను బియ్యం సేకరించాలంటే 50 కిలోలకు ఒకటి వంతున 20 సంచులు ఇస్తున్నారు.
టన్ను బియ్యం ఉత్పత్తి కావాలంటే మిల్లర్లు 1400 కిలోల ధాన్యం సమకూర్చుకోవాలి. దీనికి మరో 35 సంచులు అవసరం. ప్రభుత్వం ఇచ్చే సంచులు పూర్తిగా బియ్యానికే వినియోగిస్తున్నామని, ధాన్యానికి తామే సంచులను సమకూర్చుకుంటున్నామని కాబట్టి ధాన్యం సంచుల మొత్తానికి వినియోగ చార్జీలు ఇవ్వాలని మిల్లర్లు పట్టుబడుతున్నారు.
అలా కాకుండా తామిచ్చే 20 సంచులను మినహాయించి మిగిలిన 15 సంచులకే వినియోగ చార్జీలు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ సమస్య ఇలా ఉండగానే ప్రస్తుత ఖరీఫ్‌కు మరో సంక్షోభం ముంచుకొస్తోంది. ఇప్పటి వరకు మిల్లర్ల నుంచి సంచుల సరఫరా చేసేవారు. ఇకపై ఆర్బీకేల ద్వారా రైతులకు సంచులు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దళారుల ప్రమేయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ధాన్యం కొనుగోలు చేసే పౌరసరఫరాల కార్పొరేషన్ వద్ద కేవలం 25 లక్షల సంచులు మాత్రమే నిల్వ ఉన్నాయి.
ఖరీఫ్‌లో 12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మూడు కోట్ల సంచులు అవసరం. ఆ మొత్తం ఇప్పట్లో సరఫరా చేయాలంటే పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సాధ్యమయ్యే పనికాదు. మిల్లర్ల నుంచి సంచులు తీసుకుని ఆర్బీకేలకు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. సంచులు తాము ఇచ్చేది లేదంటూ మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. గతం నుంచి పూర్తి స్థాయిలో గన్నీ సంచుల వినియోగచార్జీలు చెల్లించకపోవడంతో మిల్లర్లు పట్టు బిగిస్తున్నారు.
మరోపక్క కొనుగోళ్లకి సంబంధించి సమస్యలు అలానే ఉన్నాయి. సార్వా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 338 కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. 74 ప్రాంతాల్లో వెలుగు, 248 చోట్ల సహకార సంఘాలు, 15చోట్ల డీసీఎంఎస్ ఆధ్వర్యంలోను, భీమడోలులో రైతులకు సంబంధించిన ఎఫ్ఎఫ్సీలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది పంటలు బాగానే పండటంతో 15 లక్షల టన్నుల వరకు ధాన్యం దిగుబడులు లభిస్తాయని అంచనా వేశారు. అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 13.50 లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.