Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM KUCHIPUDI ART ACADEMY WHICH WAS ESTABLISHED IN 1985 IN VISAKHAPATNAM VNL NJ ABH

Visakhapatnam: "కళాక్షేత్రం"… ఎన్నో ఏళ్లుగా కళాకారులను తీర్చిదిద్దుతున్న కూచిపూడి ఆర్ట్ అకాడమీ..!

 కళాక్షేత్రం…కూచిపూడి

 కళాక్షేత్రం…కూచిపూడి ఆర్ట్ అకాడమీ..!

కూచిపూడి నృత్యం, ఆంధ్రుల శాస్త్రీయ కళా నృత్యం. ఎన్నో ఏళ్లుగా ఈ కూచిపూడి నృత్యాన్ని ఎందరో విద్యార్థులకు నేర్పిస్తూ కళాకారులను తీర్చిదిద్దుతోంది వైజాగ్‌లోని కూచుపూడి ఆర్ట్‌ అకాడమీ. ఎందరో కళాకారులు ఈ అకాడమీ నుంచి వచ్చిన వారే..!

    (Nelima Eaty, News 18, Visakapatnam)

    కళలకు పుట్టినిల్లు మన భారత దేశం. వేల సంవత్సరాలుగా అనేక కళలు మన భారతీయ సంప్రదాయంలో భాగంగా కొనసాగుతూ వస్తున్నాయి. కాలంతో పాటు ఆ కళలు కూడా ప్రాంతాలకు పరిమితం అయ్యాయని చెప్పవచ్చు. భరతనాట్యం, కథక్, కథకళి, కూచిపూడి అంటూ వివిధ నృత్య కళలు భారతీయ కళలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ నృత్య కళలు వేటికవే ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి.

    కూచిపూడి నృత్యం, ఆంధ్రుల శాస్త్రీయ కళా నృత్యం. భరతనాట్యానికి దగ్గరగా ఉన్నప్పటికీ శైలిలో భరతనాట్యంతో పోల్చినపుడు కూచిపూడికి ప్రత్యేక నాట్యరీతులు ఉన్నాయి. ఆకట్టుకునే భంగిమలు, నాటకీయ పాత్రలకు, భావ వ్యక్తీకరణతో కంటి కదలికలకు మరియు స్ఫూర్తిదాయకమైన కథనానికి కూచిపూడి ప్రసిద్ధి చెందింది.

    2వ శతాబ్దంలోనే కూచిపూడి ప్రస్తావన ఉంది. శాతవాహనుల సమయంలో ఈ కళకు ప్రాచుర్యం లభించింది. 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవాళ్లు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి, పరిపూర్ణత తీసుకొచ్చారు. ఆధునిక కాలంలో వెంపటి చిన సత్యం మాస్టారు ఈ కూచిపూడి కళ ప్రాచుర్యానికి ఎనలేని కృషిచేశారు. ఎంతో మందిని కూచిపూడి వైపు ప్రోత్సహించిన చినసత్యం మాస్టారు కూచిపూడి వైభవాన్ని ఖండాంతరాలు దాటించారు.

    కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించిన వెంపటి చినసత్యం మాస్టరు 1963లో తొలిసారిగా కూచిపూడి ఆర్ట్ అకాడమీని మద్రాసులో స్థాపించారు. కూచిపూడి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని తెలియజేస్తూ 1985లో వైజాగ్‌లో కూచిపూడి కళాక్షేత్ర అనే మరో నృత్య పాఠశాలను స్థాపించారు. విశాఖ నగరానికి అతిదగ్గరగా, విశాఖ వ్యాలీ రోడ్డులో పచ్చని చెట్లతో నిండిన ప్రశాంత వాతావరణంలో ఉంటుంది వెంపటి చిన సత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ.

    చిన సత్యం మాస్టారు వద్ద సుశిక్షితుడైన ఎల్లమంచిలి హనుమంత రావు (కూచిపూడి డ్యాన్స్ మాస్టర్) ఆధ్వర్యంలో ఈ కళాక్షేత్రం నిర్వహిస్తున్నారు. హనుమంతరావు 1988లో నృత్య ప్రదర్శన ఇవ్వడం మొదలు పెట్టారు. ఖజురహో, కోణార్క్, తంజావూరు, చిదంబరం, సంగీత నాటక అకాడమీ ఢిల్లీ మరియు సౌత్-సెంట్రల్ జోన్ నాగ్‌పూర్ లలో జరిగే కార్యక్రమాల్లో కూచిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చేవారు.

    తన గురువు వెంపటి చిన్న సత్యంతో పాటు ఇతర నృత్యం బృందంతో కలిసి అమెరికా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు సింగపూర్‌ వంటి దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

    కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించిన హనుమంతరావు మాస్టారు, తన శేష జీవితాన్ని కూచిపూడికి అంకితం చేయాలనీ భావించి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 2009లో ఉద్యోగాన్నీ వదిలి పూర్తిగా కూచిపూడిపై దృష్టిపెట్టారు. మొదటి ఆరు నెలలు కష్టంగానే గడిచాయని కానీ తాను తీసుకున్న నిర్ణయానికి తన కుటుంబం గౌరవించి తోడుగా నిలిచిందన్నారు.

    ఈ కూచిపూడి డ్యాన్స్ అకాడమీలో చిన్ననాటి నుండే నృత్యం నేర్చుకుంటూ కూచిపూడిలో డిప్లొమాలు మరియు డిగ్రీలు సాధిస్తున్న విద్యార్థులు ఉన్నారు. తమ గురువు హనుమంతరావు నుండి కూచిపూడిలో చాలా నేర్చుకున్నామని విద్యార్థులు తమ ఆనందం వ్యక్తం చేశారు. అకాడమీ ప్రారంభించిన మొదట్లో ఎటువంటి ఫీజు తీసుకోకుండా విద్యార్థులకు నృత్యం నేర్పించారు.



    కానీ ప్రస్తుతం బిల్డింగ్ ట్యాక్స్, కరెంట్ చార్జీలు, మిగతా పన్నులు సైతం పెరుగుతుండడంతో విద్యార్థుల నుంచి కొంత మొత్తంలో ఫీజు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరేందుకు 850 రూపాయలు చెల్లించాలి. అకాడమీకి సోమవారం సెలవు ఉంటుంది. మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. కూచిపూడి నృత్యంపై ఆసక్తి ఉన్న వారు ఈ అకాడమీలో చేరవచ్చు.

    అడ్రస్: కూచిపూడి ఆర్ట్ అకాడమీ, విశాఖ వ్యాలీ రోడ్, చినగదిలి మండల్, విశాఖపట్నం - 530001 (విశాఖ వ్యాలీ స్కూల్ దగ్గర).

    ఫోన్ నంబర్: 9848167937.
    ఎలా వెళ్లాలి?
    వైజాగ్ బస్టాండ్‌ నుంచి విశాఖ వ్యాలీ రోడ్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎక్కి… వ్యాలీ స్కూల్‌ దగ్గర దిగితే సరిపోతుంది. లేదా లోకల్ ఆటోలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Classical dancer, Local News, Vishakaptnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు