Setti Jagadeesh, News 18, Visakhaptnam
విశాఖ సాగర తీరం (Visakhapatnam Beach).. వైజాగ్ (Vizag) నగరానికి వచ్చే పర్యాటకులకు తొలి విజిటింగ్ ప్లేస్. బీచ్‌కు వెళ్లిన తర్వాతే మరేదైనా ప్రదేశానికి వెళ్తుంటారు టూరిస్టులు. ముఖ్యంగా సాయంత్రం అయిందంటే చాలు.., పిల్లలు, పెద్దలు అంతా కలిసి కేరింతలు కొడుతుంటారు. జనసంద్రంతో ఆ సాగరతీరం సందడిగా ఉంటుంది. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో నగరవాసులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, ఇప్పుడు రుతుపవనాల రాకతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Monsoons) ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రవేశించాయి. దీంతో అక్కడక్కడ వర్షాలు పడటంతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో నగరవాసులు బయటకు రావడం మొదలుపెట్టారు. ఇంకొన్ని రోజుల్లో పిల్లలకు స్కూళ్లు కూడా తెరవబోతున్నారు. ఇప్పుడే కాస్త సమయం దొరుకుతుంది పిల్లలతో గడిపేందుకు. దీంతో పిల్లలను తీసుకుని బీచ్‌కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్.
సాయంత్రం తీరం వెంబడి వీచే చల్ల గాలులు, అటు శబ్దం చేస్తూ మీదకు దూసుకొచ్చే సముద్ర ప్రవాహాలు, ఇసుక గూళ్లు, వేయించిన పల్లీలు, ఉడుకుడుకు శనగలు, ఐస్‌క్రీమ్స్, కుల్ఫీ.. వాట్ నాట్.. అవి ఇవి అంటూ పిల్లల గోలతో సాగరతీరం మళ్లీ కోలాహాలంగా మారింది. విశాఖపట్నంలోని రామకృష్ణ మఠం ఈ బీచ్‌కు సమీపంలో ఉండడం వలన..దీనికి రామకృష్ణ బీచ్ అనే పేరు వచ్చింది. దీనిని ఆర్.కె.బీచ్ అని కూడా పిలుస్తారు. నగరంలో బాగా అభివృద్ధి చెందిన బీచ్‌లలో ఇది ఒకటి. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్‌లతో పాటు పార్కులు, మ్యూజియంలు వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి.
పొడవైన ఈ బీచ్ రోడ్డులో సైకిల్ రైడ్ , కొబ్బరి చెట్లు అందాలు మరింతగా ఆకర్షిస్తున్నాయి. బీచ్ కి వచ్చే సందర్శకులు పచ్చని కొబ్బరి చెట్లు నీడలో సేద తీర్చుకుంటూ చల్లని సాగర తీరంలో చిందులు వేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో వచ్చే పర్యాటకులు కొబ్బరి చెట్లు వనంలో ఏర్పాటుచేసిన బల్లపై కూర్చొని సాగర తీరాన్ని చూస్తూ ఉపశమనం పొందుతున్నారు. సెలవు రోజులను సరదాగా గడిపేందుకు ఇది సరైన గమ్యస్థానం. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశీ టూరిస్టులు కూడా ఏటా అధిక సంఖ్యలో విశాఖ సందర్శనకు వస్తుంటారు.
తెల్లవారుజామున వాకింగ్ మొదలుకొని సాయంత్రం వేళ సేద తీరే వరకూ సందర్శించాల్సిన అనేక బీచ్‌లు ఇక్కడ ఉన్నాయి. ఇవి వినోదాన్ని పంచడంతో పాటు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. బీచ్ దృశ్యాలను చూస్తూ రాత్రి బస చేయాలనుకునే పర్యాటకుల కోసం బీచ్ రోడ్డులో అనేక హోటళ్లలో.. బీచ్ వ్యూ పాయింట్‌తో రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
విశాలమైన సాగరతీరం, ఎత్తైన కొండలు, ఉద్యానవనాలు, నోరూరించే ఆహార పదార్ధాలు, షాపింగ్, నైట్ లైఫ్ ఇలా పర్యాటకులకు దొరకనిదంటూ ఏదీ ఉండదు ఇక్కడ. విశాఖపట్నం వచ్చి ఇక్కడి ప్రముఖ బీచ్ లను సందర్శించకపోతే మీరు చాలా మిస్ అయిన వారు అవుతారు.
అడ్రస్: ఆర్కే బీచ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్- 530003
రామ కృష్ణ బీచ్ వైజాగ్ టైమింగ్స్ : ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు.
ఎలా వెళ్లాలి.?
విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది. ఆటో, ప్రవేట్ సర్వీసులు ద్వారా కూడా ఇక్కడికి వెళ్లొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam, Vizag