Neelima Eaty, News18 Visakhapatnam
ప్రపంచానికి మన భారతావని అందించి గొప్పవరం యోగా. ప్రజల ఆరోగ్యానికి మనశ్శాంతికి, ఏకాగ్రతకు ఎంతగానో ఉపయోగపడుతుందని.., ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్ధతు తెలిపాయి. దీంతో ఏడాది మొత్తంలో పగలు ఎక్కువగా ఉండే జూన్ 21నే అంతర్జాతీయ యోగ దినోత్సవంగా (International Yoga Day-2022) 2015లో యునైటెడ్ నేషన్స్ (United Nations Organisation) ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజున దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా యోగాపై అవగాహన కల్పించేందుకు యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పలుచోట్ల యోగా డే ఈవెంట్స్ నిర్వహించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ యోగా విభాగం యోగాడేను ఘనంగా నిర్వహించింది. భారీ వర్షాల కారణంగా వేడుకలను రామకృష్ణ బీచ్ రోడ్డు నుంచి స్వర్ణభారతి ఆడిటోరియంలోకి మార్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పాల్గొన్నారు.
మైసూర్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి శాంతన ఠాకూర్, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని వివిధ కళాశాలల విద్యార్థులు, నగరవాసులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని… ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు.
మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే యోగా
ఉపనిషత్తులు, వేదాల్లో యోగా గురించి ప్రస్తావన ఉంటుంది. యోగా మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మికం, శరీరాన్ని ధృడంగా ఉంచేందుకు యోగా ఉపయోగపడుతుంది. ఇది మన శరీరాన్ని పునరుజ్జీవింపజేసి ప్రశాంతంగా ఉంచుతుంది.
విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో యోగా కీలకంగా మారింది. రోజువారీ ఒత్తిడిని తట్టుకునేందుకు చాలా మంది యోగా, ధాన్యం వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది కఠోర కసరత్తులు చేస్తేనే బరువు తగ్గుతాం, ఫిట్‌నెస్ ఉంటుందని భావిస్తారు. కానీ లయబద్ధంగా యోగాసనాలు వేస్తే ఆరోగ్యకకరంగా సత్ఫలితాలు పొందొచ్చు.
ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామం
యోగాలో ముఖ్యమైనవి ఆసనాలు, ప్రాణాయామం, యోగముద్రలు. యోగాలో గంటసేపు ఆసనాలు వేసినా..ఒక పదినిమిషాలు ప్రాణాయామాలు చేస్తే ఉండే ప్రశాంతతే వేరు. శ్వాస మీద ధ్యాస పెడుతూ అలోమ, విలోమ ప్రాణాయామం చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సూర్యుడి కదలికలను అనుసరిస్తూ చేసే సూర్యనమస్కారాలు ఒక్కటి చేసినా చాలు. అసలు ఆసనాలు వేయలేని వాళ్లు యోగముద్రల ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు. మూడు సార్లు ఓం కారం(AUM) చేసినా మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
క్రమపద్ధతిలో చేస్తే సత్ఫలితాలు
యోగా అంటే ఆషామాషిగా చేసేయడం కాకుండా…ఒక క్రమపద్ధతిలో చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఏ విధంగా ఆసనాలు వేయాలి…ఒక ఆసనంలో ఎంతసేపు ఉండాలి.. శ్వాస నిశ్వాసలపై ధ్యాస పెడుతూ ఆసనాలు వేయడం అనేది ప్రధానం.
మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని యోగా
కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా డే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు పాల్గొన్న ఈ వేడుకల్లో… ప్రధాని మోదీ కూడా యోగాసనాలు చేశారు. యోగా ఫర్ హ్యూమానిటీ థీమ్‌తో ఈసారి వేడుకలను, గార్డియర్‌రింగ్ పద్ధతిలో ప్రతిచోట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు. ప్రజల్లోనూ యోగాపై అవగాహన కలిగింది. ఆస్పత్రులకు వేలకు వేలు కట్టే బదులు…మన ఇంట్లో మనం ప్రశాంతంగా యోగా చేసుకుంటే..మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే భావన ఇప్పుడిప్పుడే జనాల్లో వస్తుంది.
ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!
ఎన్నో ఆరోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారం
రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్తమా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. జలుబు, దగ్గు లాంటి వాటికి ప్రాణాయామాలతో చెక్ పెట్టొచ్చు. హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్లే శరీరంలో సగం రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. నెలసరి సమస్యలు, థైరాయిడ్, ఎసిడిటీ, ఎముకల బలహీనత.. వీటన్నిటికి యోగాలో చక్కని పరిష్కారమార్గం ఉంది. యోగా చేయడం వల్ల కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు యోగాతో వృద్ధాప్య ఛాయలు దూరమయ్యి నిత్య యవ్వనంగా కనిపిస్తారు. యోగా వల్ల నిద్రలేమి సమస్యలు సైతం దూరం అవుతాయి. ఇలా ఎన్నో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారమార్గం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam, Yoga day 2022