హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Power Crisis: ఏపీలో విద్యుత్ కష్టాలు.. విశాఖపై తీవ్రప్రభావం పడనుందా..? పరిశ్రమల పరిస్థితేంటి..?

AP Power Crisis: ఏపీలో విద్యుత్ కష్టాలు.. విశాఖపై తీవ్రప్రభావం పడనుందా..? పరిశ్రమల పరిస్థితేంటి..?

విశాఖపట్నం(ఫైల్)

విశాఖపట్నం(ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చాన్నాళ్ల నుంచి అధికారికంగా విద్యుత్‌ కోతలు (Power Cuts) లేవు. సాంకేతిక కారణాల వల్ల మూడు నుంచి నాలుగు గంటల అంతరాయం తప్పితే...ప్రతిరోజూ నిర్ణీత సమయంలో కోతలు విధించిన దాఖలాలు లేవు.

P.Anand Mohan, Visakhapatnam, News18

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చాన్నాళ్ల నుంచి అధికారికంగా విద్యుత్‌ కోతలు (Power Cuts) లేవు. సాంకేతిక కారణాల వల్ల మూడు నుంచి నాలుగు గంటల అంతరాయం తప్పితే...ప్రతిరోజూ నిర్ణీత సమయంలో కోతలు విధించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకువచ్చేలా విద్యుత్‌ కోతలు విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బొగ్గు కొరత ఏర్పడడంతో ప్రస్తుతం ఏ థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారమూ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. దాంతో డిమాండ్‌కు సరిపడేంత విద్యుత్‌ ఉత్పత్తి కావడం లేదు. ఇటువంటి సమయంలో బహిరంగ మార్కెట్‌లో కొని విద్యుత్‌ను సరఫరా చేస్తుంటారు. అయితే ఈ బొగ్గు కొరత అన్ని రాష్ట్రాల్లోను వుండడంతో అందరికీ అదనపు విద్యుత్‌ అవసరమవుతోంది. దాంతో బయట విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. రెండు రోజుల క్రితం యూనిట్‌ రూ.13కు లభించగా, ఇప్పుడు అదే ఎక్స్ఛేంజీలో యూనిట్‌ రూ.17 ధర పలికింది. అయినప్పటికీ ఎగబడి కొనుగోలు చేశారు.

ఇటు చూస్తే రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉక్కపోత. దాంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. అటు చూస్తే....కరోనా నుంచి కోలుకున్న పారిశ్రామిక, వ్యాపార రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఉరుముల్లేని పిడుగులా వాటికి కూడా విద్యుత్‌ కోతలు అమలు చేస్తే.. మళ్లీ సంక్షోభం తప్పదని ఆయా వర్గాలు వాపోతున్నాయి.

ఇది చదవండి: అందుకు సిద్ధంగా ఉండండి...! విద్యుత్ సంక్షోభంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు..


సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో విద్యుత్‌ కోతలు విధించక తప్పదని, వినియోగం తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కోతలు ఎదుర్కొనడానికి కూడా సిద్ధంగా వుండాలని సూచించింది. విశాఖపట్నం (Visakhapatnam) సర్కిల్‌లో రోజుకు సగటున 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతుంది. అదే ఎండలు ఎక్కువున్న రోజుల్లో అయితే ఇది 25 నుంచి 26 మిలియన్‌ యూనిట్లను దాటుతుంది. ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా 26.55 మి.యూ.ను వినియోగించారు. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడేంత విద్యుత్‌ అందుబాటులో ఉన్నా...రాబోయే రెండు రోజుల్లో ఆ అవకాశం ఉండదని, కోతలు వుంటాయని అధికార వర్గాలు కూడా చూచాయగా పేర్కొన్నాయి. విశాఖ నగరంలో ప్రాంతాల వారీగా గంట నుంచి రెండు గంటల వరకు కోతలు విధించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు మాత్రం మూడు నుంచి నాలుగు గంటల కోతలు ఉంటాయి.

ఇది చదవండి: ఆ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..? జగన్ ప్రచార వ్యూహంపై టీడీపీలో చర్చ..!


రాత్రిపూట వినియోగం తగ్గించాలి

వినియోగదారులు ఎక్కువగా రాత్రిపూటే విద్యుత్‌ను వినియోగిస్తారని, అందుకని ఆ సమయంలోనే కోతలు విధించాలని పైనుంచి ఒత్తిడి వస్తున్నా, వ్యాపార వర్గాలను దృష్టిలో వుంచుకొని పగటి పూటే కోతలు అమలు చేయడానికి యత్నిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. రాత్రి 6 నుంచి 9 గంటలలోపు విద్యుత్‌ వినియోగం తగ్గించాలని, ఆ సమయంలో ఏసీలు వినియోగించవద్దని ప్రభుత్వం కూడా సూచించింది.

విశాఖలోనే అత్యధిక వినియోగం

ఈపీడీసీఎల్‌ పరిధిలో ఐదు జిల్లాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం 69 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. అందులో ఒక్క విశాఖపట్నమే మూడో వంతుకు పైగా వినియోగించింది. ఇక్కడ అత్యధికంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలతో పాటు గృహ వినియోగదారులు వుండడమే అందుకు కారణం. ఇప్పుడు కోతలు అమలు చేస్తే అదే నిష్పత్తిలో తగ్గించాల్సి వుంటుందని అధికార వర్గాలు వివరించాయి.

గ్రామీణంలో అనధికార కోతలు

జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా అనధికార విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. ఫలానా సమయం అని చెప్పకుండా రోజుకు గంట, రెండు గంటలు తీసేస్తున్నారు. ఏజెన్సీలో కూడా విద్యుత్‌ సరఫరా నిరంతరం ఉండడం లేదు. తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరగడంతో సీలేరు కాంప్లెక్సులో ఐదు నుంచి ఆరు మిలియన్‌ యూనిట్లను గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నామని ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ... సీలేరు జల విద్యుత్‌ కేంద్రం 240 మెగావాట్లు, డొంకరాయి 25 మెగావాట్లు, పొల్లూరు కేంద్రం 460 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. వీటి ద్వారా రోజుకు ఎనిమిది మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి చేయవచ్చునన్నారు. ఇక్కడ వున్న నీటి నిల్వల ఆధారంగానే గ్రిడ్‌ అధికారులు విద్యుదుత్పత్తికి ఆదేశాలు జారీ చేస్తుంటారన్నారు. సీలేరు కాంప్లెక్సులోని మూడు జల విద్యుత్‌ కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో 5.725 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశామన్నారు. ఈ ఏడాది సీలేరు కాంప్లెక్సుకు సెంట్రల్‌ విద్యుత్‌ అథారిటీ 2,300 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించిందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Power problems, Visakhapatnam

ఉత్తమ కథలు