Cyclone Gulab Effect: ఏపీలో గులాబ్ తుఫాన్ బీభత్సం.., ఈ జిల్లాలకు తప్పని ముప్పు..

ఏపీని అతలాకుతలం చేస్తున్న గులాబ్ తుఫాన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను గులాబ్ తుఫాన్ (Cyclone Gulab) అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై (North Andhra) తుఫాన్ విరుచుకుపడింది. ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) ను గులాబ్ తుఫాన్ (Cyclone Gulab) అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా (North Andhra District)లపై తుఫాన్ విరుచుకుపడింది. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసాల మీద తీవ్ర వాయుగుండంగా కేంద్రీ కృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మరో ఆరు గంటల్లో మరింత బల హీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.తుఫాన్ ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకుకుళం, విజయనగరం (Vizianagaram), విశాఖ జిల్లాల (Visakhapatnam)తో పాటు ఉభయగోదావరి (Godavari District), కృష్ణా (Krishna District), గుంటూరు జిల్లా  (Guntur District)ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి.

  భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రానున్న ఆరు గంటల్లో తుఫాన్ బలహీన పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో కేవలం ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రలో గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో.. చాలాచోట్ల విద్యుత్ స్థంభాలు, పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా ఊళ్లలో అంధకారం అలుముకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం అందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

  ఇది చదవండి: నువ్వు మాగాడివైతే పోటీ చేయ్.. సొంతపార్టీ నేతకు ఎమ్మెల్యే రోజా సవాల్..


  తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖనగరం పూర్తిగా జలమయమైంది. వానదెబ్బకు మల్కాపురం పోలీస్ స్టేషన్ నీటమునిగింది. స్టేషన్ ప్రహరీగోడ కూడా ధ్వంసమైంది. అలాగే కూర్మన్నపాలెం గేట్ నుంచి కనితి బస్ స్టాప్ వరకు రోడ్లు, పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వే న్యూ కాలనీ కనకారావు జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఇళ్లలోకి నీరుతో చేరి జలమయం అయ్యింది. ఇక సింహాచలం కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో బండరాళ్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో రైల్వే ట్రాక్ పై నీరు చేరడంతో అదే ట్రాక్ పై ప్రమాదకర స్థితిలో గూడ్స్ రైళ్లు వెళ్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇకపై నెలరోజులే ఈ సౌకర్యం..

  దక్షిణకోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం ధాటికి గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు వీలులేక సుమారు అరగంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఇక విజయవాడ నగరంలోని ఆటోనగరం, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది.
  Published by:Purna Chandra
  First published: