P. Anand Mohan, Visakhapatnam, News18
మంచులో ఆడుకోవాలని ఉందా..? దట్టమైన మంచులో చిన్నారులతో ఆడి పాడాలనుందా..? ఇందుకోసం మీరు కాశ్మీర్ (Kashmir),ఉత్తరాఖండ్ (Uttarakhand), సిమ్లా (Shimla) వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనే మంచులో అడుకునేందుకు రెడీ అయిపోండి. కొద్ది రోజుల్లోనే విశాఖపట్నం (Visakhapatnam) లో స్నో పార్క్ (Snow Park) రానుంది. ఇప్పటికే దీని కోసం జీవిఎంసీ స్థల సేకరణ కూడా చేస్తోంది. నగరంలోని ప్రధానమైన సెంటర్లో ఇది ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నగరంలో స్నో పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ఆధ్వర్యంలో రెండు ఎకరాల్లో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇటువంటి స్నో పార్కు విశాఖలో ఏర్పాటుచేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
వైజాగ్ టూరిజంలో మరో ఆకర్షణీయమైన పార్క్ రాబోతోంది. అదే స్నోపార్క్. అనువైన స్థలం కోసం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ స్నో పార్కులో మంచులో బాస్కెట్‌బాల్ ఆడేందుకూ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా మంచు హోటల్‌ను కూడా ఈ పార్కులో నిర్మించనున్నారు. మంచు పర్వతారోహణ ఏర్పాట్లు చేయడం ద్వారా.. ఇక్కడకు వచ్చేవారు పూర్తిస్థాయిలో మంచును ఎంజాయ్ చేసే విధంగా దీనిని రూపుదిద్దాలనేది యోచన. ఈ పార్కు ఏర్పాటు కోసం అనువైన స్థలం లభించిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటు కోసం పూర్తిస్థాయి డీపీఆర్ ను తయారుచేసే పనిలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు పడ్డారు.
స్నో పార్కు అంటే కేవలం పూర్తిస్తాయిలో మంచు కప్పబడి ఉన్న ప్రదేశంగా కాకుండా అన్ని విధాలా ఆకర్షణీయంగా దీనిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. పైనుంచి సన్నటి మంచు పడటంతో పాటు అక్కడే ఒక హోటల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఒక బాస్కెట్ బాల్ గ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చిన్నపాటి మంచు పర్వతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. మంచు పర్వతారోహణ (స్నో మౌంటెయిన్ క్లైంబింగ్) అనుభవాన్ని కూడా ఇక్కడకు వచ్చే వారికి లభించే విధంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది.
వివిధ టీవీ, ఫిల్మ్ షూటింగ్‌ల కోసం అనువైన ప్రదేశంగా కూడా దీనిని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ పార్కును బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఇంకా స్థలాన్ని ఎంపిక చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి పార్క్ హోటల్ పక్కన ఉన్న వీఎంఆర్డీఏ స్థలంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బోర్డులో నిర్ణయించారు. మొత్తం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేస్తారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap tourism, Visakhapatnam, Vizag