GVMC: జీవీఎంసీ కూల్చివేతతో రోడ్డున పడ్డ దివ్యాంగులు.. అధికారుల చర్యపై సర్వత్రా విమర్శలు

హిడెన్‌ స్ప్రౌట్స్‌ మానసిక వికలాంగుల పాఠశాల లోగో

విశాఖలో దివ్యాంగులు రోడ్డున పడ్డారు. 140 మంది మానసిక వికలాంగులకి నెలవైన ఓ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు చలించడం లేదు.

 • Share this:
  విశాఖలో దివ్యాంగులు రోడ్డున పడ్డారు. 140 మంది మానసిక వికలాంగులకి నెలవైన ఓ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు చలించడం లేదు. మరోపక్క రాజకీయ నేతలు దీనికి రాజకీయ రంగు పులమడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప.. దివ్యాంగులపై కరుణ చూపడం లేదు. ఇదివరకు టీడీపీ నేతలకి చెందిన అక్రమ నిర్మాణాలుగా చెప్పి ఎన్నో నిర్మాణాల్ని కూల్చిన జీవీఎంసీ అధికారులు.. ఇప్పుడు వీరిపై ఏ మాత్రం దయచూపకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

  జరిగింది ఇదీ..!
  విశాఖ నగరంలోని పెదవాల్తేరు సమీపంలో ఉన్న హిడెన్‌ స్ప్రౌట్స్‌ మానసిక వికలాంగుల పాఠశాలను జీవీఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ పనికి పూనుకున్నారు. జీవీఎంసీ అనుమతితోనే గతంలో ఈ స్థలాన్ని మంజూరు చేసినా.. వైసీపీ స్థానిక నేతల కారణంగా కూల్చివేత జరిగిందనేది ఆరోపణ. దీంతో ఎంవీపీ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థ షెడ్డును కూల్చివేయడం అమానుషమని దివ్యాంగుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ సంస్థ ద్వారా 175 మంది వరకు మానసిక వికలాంగులకు సేవలందిస్తున్నారు. లీజు పూర్తవడంతో షెడ్డును కూల్చేశామని జీవీఎంసీ అధికారులు తెలిపారు. అయితే.. ఇది మానసిక వికలాంగులకి ఆశ్రయమిచ్చే స్థలం కావడంతో.. ఇప్పుడీ షెడ్డు కూల్చివేత వివాదాస్పదమవుతోంది.

  కబడ్డీ కోసం..?
  వైసీపీ నేతల కబడ్డీ కోసం ఈ కూల్చివేత జరిగింది. అందులోనూ సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు టీడీపీ సానుభూతి పరుడు కావడంతో వైసీపీకి కూల్చివేతకు మార్గం సుగమం అయ్యింది. కేవలం ఆటవిడుపైన కబడ్డీ కోసం వైసీపీ స్థానిక నేతలు ఈ పని చేశారంటే ఎవరైనా నమ్ముతారా..? ఇది ముమ్మాటికి నిజం. ఇక్కడి స్థానిక నేతలు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు ఈ స్థలం అనువైనదిగా భావించారు. దీనికోసం హిడెన్ స్ప్రౌట్స్ నిర్వాహకుడు శ్రీనివాస్‌ను సంప్రదించారు. ఆయన ఇది దివ్యాంగుల స్థలమని చెప్పడం.. అదీ జీవీఎంసీ తమకు మంజూరు చేసిన స్థలమని అన్నారు. అలాగే జీవీఎంసీ చెబితేనే తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన స్థానిక వైసీపీ నేతలతో అన్నారు. ఇది కాస్తా.. అక్కడి నేతలకు తెలిసి ఆగ్రహంతో నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని వెంకటరమణకు (నిజానికి అక్కరమాని విజయనిర్మల వైసీపీ తరఫు ఎమ్మెల్యేగా పోటీచేసి గత ఎన్నికలో విశాఖ తూర్పులో ఓడిపోయారు) దీనిపై పితురీలు చెప్పారని.. ఉన్నవీలేనివీ చెప్పడంతో ఆయన వెంటనే జీవీఎంసీ అధికారులకు, అటు విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు. మానసిక వికలాంగుల ఆశ్రయం, వారి నిర్వహణ వంటి పూర్తి వివరాలు తెలియక విజయసాయిరెడ్డి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అధికారులు కూల్చివేతకు దిగారు. ఈ కూల్చివేతపై విశాఖ నగరవాసులు మాత్రం అయ్యో పాపం అంటూ స్పందిస్తున్నారు. టీడీపీ వ్యవహారంలో వైసీపీది రాజకీయ పట్టుదల కావొచ్చని.. కానీ.. ఈ ఘటన మాత్రం ఆక్షేపణీయంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  ఖండనలు.. నిరసనలు..!
  ఈ ఘటనపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర కమిటీ స్పందించి.. ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 190 మంది మానసిక వికలాంగుల పొట్టగొట్టడం దారుణమని పేర్కొన్నారు. 2013 నుంచి జీవీఎంసీ అంగీకారంతోనే ఈ పాఠశాల నడుస్తోందని తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలను ప్రభుత్వం కూల్చివేయడం తగదని అన్నారు. తక్షణమే అక్కడి మానసిక వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక పాఠశాల నిర్మించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ ప్రత్యామ్నాయ భవనంలో విద్యను అందించాలని కోరారు. మరోపక్క మాజీ క్రికెటర్ ఎమెస్కే ప్రసాద్ కూడా దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు. ఈ విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి వారికి పునరాశ్రయం కల్పించాలని వినతించారు.
  Published by:Sambasiva Reddy
  First published: