ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesjh) ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురం సెజ్ లోని పొరస్ కంపెనీలో గ్యాస్ లీకైంది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు. ఘటనలో వంది మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారందరూ మహిళలే. విషయవాయువు ధాటికి ఎక్కడివాళ్లక్కడే కుప్పకూలిపోయారు. ఇతర సిబ్బంది వారిని సంస్థ వాహనాల్లోనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రవి సుభాష్.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను అచ్యుతాపురం,యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.
పోరస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకవడంతో ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకవడంతో పక్కనే ఓ సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు ఆ గాలిపీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఐతే అమ్మోనియా పీల్చిన వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రమాదంపై సీఎం జగన్ (AP CM YS Jagan) ఆరా తీశారు. అమ్మోనియా గ్యాస్ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై అధికారులనుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని వెల్లడించారు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని తెలిపారు. బ్రాండిక్స్ లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
ప్రస్తుతానికి అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని అధికారులు సీఎంకు వివరించారు. అమ్మోనియా ఎక్కడనుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gas leak, Visakhapatnam