Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
ప్రభుత్వ అధికారి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. నలుగురికి మంచి చెప్పేలా ఉండాలి. ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ ఆస్తికి కాపలదారుగా ఉండాలి. కానీ ఓ అధికారికి మాత్రం అవేమీ పట్టవు. సర్కారు సొమ్ముతో సోకుల చేస్తున్న ‘స్వరూపం’ అయనది. ఆయన పేరులో ‘శాంతి’ ఉంది. కానీ ఆయన దగ్గర పని చేసే వారికి నిత్యం అశాంతే. అంతేకాదు ఆయన నిజ సర్వూపం చూస్తే అంతా నీచం. ప్రభుత్వం జీతాలు చెల్లించి శాఖాపరమైన పనులు చేయించాలంటే, ఈయన మాత్రం తన ఇంట్లోనూ, పంట పొలంలోనూ సిబ్బందితో పని చేయించుకుంటాడు. గత కొన్నాళ్లుగా సుమారు 50 లక్షల రూపాయల వేతనాలు ప్రభుత్వం చెల్లించగా, వారందిరితోనూ ఇన్నాళ్లూ సొంత పనులు చేయించుకున్నాడంటే ఈయన నిజ ‘స్వరూపం’ ఎంటో తెలుస్తోంది. ఆయనగారి సొమ్ము రూపాయి విదల్చడుగానీ.. సొంతపనులకు మాత్రం సర్కారు సొమ్ములు లాగేస్తున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అవినీతి, అక్రమాలతో సంపాదించిన పంట పొలాలు, తోటల్లోనూ పని చేయించుకోవడం చూసి అంతా విస్తుపోతున్నారు. ఎక్కడ పని చేసినా సరే అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తున్నా సరే పై అధికారుల ప్రాపకంతో ఎక్కడికక్కడ చక్కబెడుతూ పని చేయించుకుంటున్నాడంటే ఎంతలా బరి తెగించాడో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెపలప్ మెంట్ రీజియన్ (VMRDA) లో ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పెద్దమనిషి బాగోతమిది.
ఈయనపై గతంలో చాలా తీవ్ర ఆరోపణలు, విమర్శలున్నా సరే ప్రతిష్టాత్మక వీఎంఆర్డీఏ ఫారెస్ట్ ఆఫీసర్ కుర్చీ ఎక్కేసాడు. అయితే విధులు నిర్వహణ సంగతేమో కానీ, ఆయన వ్యవహారం సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. వీఎంఆర్డీఏ పరిధిలో వుడా పార్క్, సెంట్రల్ పార్కు, బీచ్, కైలాసగిరి వంటి వాటితో పాటుగా కొన్ని నర్సరీలను కూడా నిర్వహిస్తోంది. వీటి నిర్వహణలో భాగంగా వాటరింగ్ చేయడం, మొక్కల సంరక్షణ వంటి అనేక పనులు చేసేందుకు సిబ్బందిని వీఎంఆర్డీఏ నియమించుకుంది. ఈ వ్యవహారాల నిర్వహణ వీఎంఆర్డీఏ ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తుంటారు. ప్రస్తుతం ఈ స్థానంలో శాంతి స్వరూప్ ఉన్నారు.
వీఎంఆర్డీఏ పరిధిలో పార్కుల నిర్వహణ, నర్సరీలో పని చేసే కిందిస్థాయి సిబ్బంది నిత్యం తన సొంత పనుల కోసం వినియోగిస్తుంటారు. ఆయన చెప్పిన పనికి సిబ్బంది రాకపోతే వారిని వేధిస్తుంటారట. గత కొన్నాళ్లుగా ఈయన నిత్య కృత్యం ఇదేనట. దీంతో ఈయన వేధింపులు భరించలేక సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఈయనకు ఉత్తరాంద్ర జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో భూములు, తోటలు, భవనాలు ఉన్నాయి. వీటిలో కూలి పని చేయడానికి ఈ వీఎంఆర్డీఏ లో పని చేసే సిబ్బందిని వినియోగిస్తుంటాడట. అంతేగాక వీఎంఆర్డీఏకి చెందిన వాహనాల్లోనే ఈ సిబ్బందిని తన పొలాలకు తరలించి అక్కడ పనులు చేయించుకుంటాడు.
బొద్దాంలో ఈయనకు 80 ఎకరాల భూమి, ఇదే ప్రాంతంలో వేరేగా మరో రెండు ఎకరాలు, విజయనగరం ధర్మపురిలో 600 గజాల స్థలం, విజయనగరం సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద 400 గజాల స్థలం, విజయనగరం జిల్లా అయ్యన్నపేటలో మరో 40 ఎకరాలు భూమి ఉంది. వీటిల్లో పలు తోటలు, పంటలు ఉన్నాయి. ఈ పనులు చేయించుకోవాడనికి కూలీలను పెట్టి పనులు చేయించుకుంటారు. అయితే ఈయనగారు మాత్రం వీఎంఆర్డీఏలో ఉన్న సిబ్బందిని తన పొలాలకు తరలించి పనులు చేయించుకుంటున్నాడు. వారికి జీతాలు వీఎంఆర్డీఏ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే ఫారెస్ట్ ఆఫీసర్ భూములు పనులు చేస్తే కూలీ డబ్బులు వీఎంఆర్డీఏ చెల్లిస్తున్నట్లైంది.
ఈ తరహాలో ఇప్పటి వరకు సుమారు 50 లక్షల రూపాయల వరకు తన పొలాల్లో పనులు చేయించుకుని వీఎంఆర్డీఏ ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇలా ప్రభుత్వం వద్ద పని చేసే సిబ్బందిని సొంత పనులకు వినియోగించుకోవడంపై సిబ్బంది మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈయన ఇతర వ్యవహారాలు కూడా వెలుగు చూస్తున్నాయి. గతంలో పాడేరులో పని చేస్తున్న కాలంలో లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరకిపోయి తర్వాత బయటపడ్డాడు.
అలాగే ఇటీవల తన ఇంట్లో పని చేసే పని మనిషిని కూడా లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. సదరు మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారిని మేనేజ్ చేసుకుని బయటపడ్డాడని టాక్. గతంలో శ్రీకాకుళం జిల్లాలో పని చేసిన కాలంలో తీవ్ర ఆరోపణలు రావడంతో సరెండర్ చేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న సిబ్బందిని ఆయా విభాగాల్లో కాకుండా తన సొంత పనులకు ఉపయోగించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఉన్నాతాధికారులు ఈ అడ్డగోలు బరితెగింపు అధికారికి బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.