ఆంధ్రప్రదేశ్ (Andhra Prdesh) రాజకీయాల్లో కాపులది (Kapu Caste) కీలక పాత్ర. ఆ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ప్రచారం అంతటా ఉంది. దానికి కారణం ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే ఏపీలో కాపు సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఐతే కాపులకు ఇంత ఓటు బ్యాంక్ ఉన్నా ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటికీ ఒక్క వ్యక్తి కూడా సీఎం కాలేకపోయారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా ఓటమి తప్పలేదు. ప్రస్తుతం ఆ సామాజిక వర్గం నుంచి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఆయన ముందుకెళ్తున్నారు. ఐతే పవన్ వెంట ఫ్యాన్స్ ఉన్నా చెప్పుకోదగ్గ కాపు నాయకులు లేరనేది ఒకింత వాస్తవమే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం లోని గుంటపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత నేత వంగవీటి రంగా విగ్రాహావిష్కరణకు ఆయా పార్టీల్లోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ హాజరయ్యారు. మాజీ మంత్రి గంటా, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన తోట త్రిమూర్తులు, గంటా శ్రీనివాసరావు.. ఏపీ రాజకీయాల్లో కాపుసామాజిక వర్గం పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవిష్యత్తు కాపులదేనని వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గం నేతలే రాజీకీయాలను శాసించాలన్నారు. అంతేకాదు కాపులంతా కాపు నేతలకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తామంతా కాపులకు అండగా ఉంటామని కూడా ప్రకటించారు.
జనసేన వైపు చూస్తారా..?
మాజీ మంత్రి గంటా.. ఉత్తరాంధ్రలో కీలక నేత. ఏ పార్టీలో ఉన్నా ఆయనకు పదవులు గ్యారెంటీ. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన... ఆ తర్వాత కాంగ్రెస్ లో మంత్రయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019లో టీడీపీ తరపున గెలిచినా పార్టీ ఓడిపోవడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. కొంతకాలంగా ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లు వైసీపీలో చేరతారని.. మరికొన్ని రోజులు బీజేపీ వైపుచూస్తున్నారని వార్తలు వచ్చాయి. జనసేనతోనూ టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇంతవరకు ఎటూ తేల్చలేదు. ఐతే తాజాగా చేసిన వాఖ్యలు కేవలం విగ్రహావిష్కరణ కార్యక్రమానికే పరిమితమా లేక రాజకీయ భవిష్యత్తులో ఇదే ఫార్ములాను అమలు చేస్తారా..? అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.