VISAKHAPATNAM DOMESTIC GAS CYLINDERS GOING TO BLACK MARKET AS AGENCIES AND DELIVERY PERSONS SELLING FOR HIGH RATES FULL DETAILS HERE PRN VSP
Gas Cylinders: బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు.. ఏజెన్సీల దందా ఇంతింత కాదయా..!
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజుల్లో వంట చేయాలంటే గ్యాస్ స్టౌ తప్పనిసరి. కట్టెల పొయ్యిలు దాదాపు అంతరించపోయాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 90 శాతం ఎల్పీజీ గ్యాస్ (LPG Gas) తోనే వంట చేస్తున్నారు. ప్రజల అవసరాలను బలహీనంగా చేసుకుంటున్న కొందరు గ్యాస్ ను కూడా తెలివిగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు.
ఈ రోజుల్లో వంట చేయాలంటే గ్యాస్ స్టౌ తప్పనిసరి. కట్టెల పొయ్యిలు దాదాపు అంతరించపోయాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దాదాపు 90 శాతం ఎల్పీజీ గ్యాస్ (LGP Gas) తోనే వంట చేస్తున్నారు. ప్రజల అవసరాలను బలహీనంగా చేసుకుంటున్న కొందరు గ్యాస్ ను కూడా తెలివిగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తెచ్చినా డొమెస్టిక్ వంట గ్యాస్ దుర్వినియోగం కొనసాగుతూనే ఉంది. గ్యాస్ డీలర్లు, డెలివరీ కుర్రాళ్లు కలిసి వాటిని పక్కదోవ పట్టిస్తున్నారు. చిల్లర వ్యాపారులకు అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. డొమెస్టిక్ వంట గ్యాస్ దుర్వినియోగం తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకువస్తోంది. కానీ వాటిని ఏజెన్సీలు సక్రమంగా పాటించడం లేదు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దోపిడీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.
కస్టమర్ గ్యాస్ కనెక్షన్ కు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి కాల్ చేస్తేనో, మెసేజ్ పెడితేనో సిలిండర్ బుక్ చేసుకునే విధానం నాలుగేళ్ల క్రితం అమల్లోకి తెచ్చారు. దాని వల్ల అవసరమున్నవారే సిలిండర్లు తీసుకుంటారని ప్రభుత్వం భావించింది. దానిని కూడా డీలర్లు పక్కదోవ పట్టించారు. మొబైల్ రిజిస్టర్ కాలేదని, ఆ నంబరు పోయిందని, తమకు మెసేజ్‌లు పెట్టడం రాదని కొందరు నేరుగా ఏజెన్సీకే రావడం వల్ల, అక్కడ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దాంతో ఎవరైతే నెల నెలా తీసుకోవడం లేదో గుర్తించి, వారి పేరుతో సిలిండర్ బుక్ చేసి అమ్ముకునేవారు.
దీనివల్ల ఒక్కో సిలిండర్‌పై రూ.200 అదనంగా వస్తుంది. అందులో 25 శాతం డెలివరీ కుర్రాడికి, మిగిలిన 75 శాతం డీలర్ తీసుకునేవారు. దీనికి కూడా చెక్ పెట్టడానికి గత నవంబరు ఒకటో నుంచి డెలివరీ ఆథంటికేషన్ కోడ్ (డీఏసీ) పేరుతో ఒక విధానం అమలులోకి తెచ్చారు. అంటే వినియోగదారుడు మొబైల్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే... అతడికి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) పంపుతారు. ఆ నంబరు డెలివరీ బాయ్‌కు చూపిస్తేనే సిలిండర్ ఇస్తాడు. లేదంటే..ఇవ్వకూడదు. దీనివల్ల సిలిండర్లు పక్కదోవ పట్టవని ప్రభుత్వం భావించింది. మొదట దేశంలో 100 నగరాల్లో దీనిని ప్రారంభించారు. అందులో విశాఖపట్నం కూడా ఒకటి.
ఓటీపీ విధానం గత రెండు నెలలుగా అమలులో ఉంది. సిలిండర్ బుక్ చేయగానే బుకింగ్ నంబర్ మెసేజ్ వస్తోంది. ఆ తరువాత సిలిండర్ గ్యాస్ డీలర్‌కు చేరగానే ఓటీపీ వినియోగదారుడి మొబైల్‌కు వస్తోంది. అక్కడి నుంచి రెండు, మూడు గంటల్లో డెలివరీ బాయ్ వచ్చి సిలిండర్ ఇస్తున్నాడు. అయితే ఓటీపీ అడగడం లేదు. దాని అవసరం లేదని, ఫరవాలేదని చెప్పి తీసుకుపోతున్నాడు. యథా ప్రకారం సిలిండర్‌పై అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారు.
ఓటీపీని డెలివరీ బాయ్ నోట్ చేసుకోనప్పుడు, అడగనప్పుడు దానిని ఎందుకు అమలు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే.. లోపాలు సవరించడానికి ప్రభుత్వం కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నా క్షేత్రస్థాయిలో వాటిని పక్కాగా అమలు చేయడం లేదు. ఉద్దేశపూర్వకంగా అంతా కలిసి ఇలా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 కిలోల ధర గత ఏడాది జనవరిలో రూ.702.50 వుండగా ఇప్పుడు రూ.908 తీసుకుంటున్నారు. అంటే ఏడాదిలో రూ.206 పెరిగింది. ఇక వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 2,000. ఇటీవలే రూ.100 ధర తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్ కిలో రూ.64 పడుతుంటే, కమర్షియల్ గ్యాస్ కిలో రూ.105 పడుతోంది. దాంతో వ్యాపారులు, రోడ్డు పక్కన హోటళ్లు నిర్వహించే వారు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. వారి అవసరాలను గ్యాస్ డీలర్లు, డెలివరీ కుర్రాళ్లు తీరుస్తున్నారు. ప్రస్తుతం ఒక సిలిండర్‌పై రూ.120 అదనంగా తీసుకొని ఇస్తున్నారు. అంటే డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.908 కాగా, దానికి రూ.1,020 వసూలు చేస్తున్నారు. ఇలా రోజూ నగరంలో సుమారుగా ఆరు వేల సిలిండర్లు పక్కదోవపడుతున్నాయని అంచనా.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.