Sai Baba: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలానే వింతలు గురించి వింటూనే ఉంటాం.. పాలు తాగే దేవుడు.. కళ్లు తెరిచే దేవుడు.. కన్నీరు కార్చే దేవుడు ఇలా చాలా సార్లు చాలా వింతల గురించి విని ఆశ్చర్యపోతాం.. అయితే అవేవి నిజాలు కాదని చాలామంది కొట్టి పారేస్తారు. భక్తులు మాత్రం నిజమే అని నమ్మి ప్రత్యేక పూజలు చేస్తారు.. అంతకన్నా వింతైన సాయిబాబా గురించి మీకు తెలుసా.. ఈ సాయి బాబా మనలా మాట్లాడుతారు. ఇదేదో మ్యాజిక్ కాదు.. నిజంగానే సాయి బాబా మనతో మాట్లాడుతారు.. ప్రవచనాలు కూడా చెబుతారు. ఆ సాయిబాబాను చూడాలి అంటే.. విశాఖపట్నం వెళ్లాల్సిందే. విశాఖ గ్రామీణ మండలం చినగాదిలోని ఆలయంలో సాక్షాత్తు షిరిడి సాయిబాబా విగ్రహం కళ్లు కదపడం, మాట్లాడటం చేస్తోంది. అయితే ఇదేదో మాయో, మంత్రమో.. దేవుడి మహిమో కాదు.. నిజంగా నిజం..
ఆధునిక టెక్నాలజీతోనే ఇది సాధ్యమయ్యింది. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు ఓ యువకుడు మూడేళ్లు శ్రమించాడు. తనకు తెలిసిన టెక్నాలజీ సాయంతో సాయిబాబా విగ్రహం కళ్లు కదపడం, నోరుతెరిచి మాట్లాడేలా చేసాడు. చిన గాదిలి ఆలయంలో ప్రతిష్టించిన ఈ రోబోటిక్ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు.
Talking Saibaba || మాట్లాడే సాయిబాబాను చూశారా..? || కదిలే ఈ సాయి బాబాను ... https://t.co/jDnpKHgpG9 via @YouTube #talking #saibaba #saibabaofshirdi #saibabaphotos #Vizag
— nagesh paina (@PainaNagesh) January 21, 2023
ఈ ఆలయంలో స్వయంగా సాయిబాబానే సూక్తులు చెబుతుండడం విశేషం. మానవ శరీర స్పర్శకు ఏమాత్రం తీసిపోకుండా, ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను ఆశీర్వదించే ముఖ కవలికలతో సాక్షాత్తు షిరిడీ సాయి దిగివచ్చారా అనే అనుభూతి కలిగేలా చేస్తుంది ఈ విగ్రహం.. ఈ విగ్రహాన్ని చినగదిలి షిరిడీ సాయి ఆలయంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. ఈ రోబో విగ్రహానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాయిస్ సింకరనైజేషన్ కల్పించడంతో బాబా విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం, తల కదిలించడం చేస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ పట్టభద్రుడు వై.రవిచంద్ మూడేళ్లు శ్రమించి ఈ విగ్రహం తయారు చేశారు.
సిలికాన్ రసాయ పదార్థంతో ముఖాన్ని, మిగిలిన భాగాలు కెనడా నుంచి సమకూర్చుకున్న ప్రత్యేక ఫైబర్ గ్లాస్ ను ఉపయోగించి తయారు చేశారు. దీంతో ఈ విగ్రహాన్ని చూసేవారికి అక్కడ స్వయంగా బాబానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. గతంలో ఈ బాబా ఆలయానికి రవిచంద్ మైనంతో తయారు చేసిన సాయిబాబా విగ్రహాన్ని అందించారు. అప్పుడు భక్తులు ఈ రూపానికి మాటలు వస్తే సాయిబాబానే వచ్చి మాట్లడినట్లు ఉంటుందని చెప్పడంతో ఆయన ఎన్నో పరిశోధనలు చేసి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఇది దేశంలోనే తొలి దైవ రోబో విగ్రహమని రవిచంద్ చెబుతున్నారు. విషయం తెలియడంతో భారీగా భక్తులు సాయిబాబాను చూసేందుకు తండోప తండాలుగా వస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Visakhapatnam