Home /News /andhra-pradesh /

Annavaram Temple: సమస్యల నిలయంగా అన్నవరం.. ప్రసాద్ పథకంతో రూపురేఖలు మారేనా..?

Annavaram Temple: సమస్యల నిలయంగా అన్నవరం.. ప్రసాద్ పథకంతో రూపురేఖలు మారేనా..?

అన్నవరం ఆలయం (ఫైల్)

అన్నవరం ఆలయం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ ఆలయాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం (Annavaram Temple) ఒకటి. తిరుమల (Tirumala), ఇద్రకీలాద్రి తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న ఆలయం అన్నవరం.

  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ ఆలయాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం (Annavaram Temple) ఒకటి. తిరుమల (Tirumala), ఇద్రకీలాద్రి తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న ఆలయం అన్నవరం. ఎంతో మహిమగల సత్యదేవుడి దర్శనానికి ఏటా కోటి మంది వరకు భక్తులు వస్తుంటారు. ఏడాదికి ఆరు లక్షలకు పైగా వ్రతాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడికి ఏపీ, తెలంగాణ (Telangana) నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఆలయంలో వసతులు ఏమాత్రం సరిపోవడం లేదు. సాధారణ రోజుల్లో మౌలిక వసతులు ఓ మోస్తరుగా సరిపోతున్నా రద్దీ రోజుల్లో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో వ్యయప్రయాసలతో ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామిని దర్శించుకున్నామన్న సంతృప్తి కూడా మిగలడం లేదు.

  ఆలయంలో దర్శనాలకు అత్యధిక సమయం తీసుకోవడం, డార్మెటరీలు డిమాండ్‌కు తగ్గట్టు లేకపోవడంతో వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా సమయం పడుతోంది. డార్మెటరీలు చాలక కొండ కింద భారీగా ఖర్చు చేసి ప్రైవేట్ లాడ్జీల్లో వసతి పొందాల్సి వస్తోంది. పోనీ భక్తుల సమస్యలు తీర్చడానికి దేవస్థానం ప్రయత్నించినా నిధుల లేమి, అనుమతుల జాప్యంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదు. అయితే దేవస్థానం సమస్యలు గట్టెక్కేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకానికి సత్యదేవుని ఆలయం ఎంపికైంది.

  ఇది చదవండి: జగనన్న విద్యాదీవెన నగదు జమ.. ఆ పరిస్థితి తీసుకురావొద్దన్న సీఎం


  తాజా నిర్ణయంతో రూ.70 కోట్ల వరకు కేంద్రం నుంచి విడతలవారీగా మంజూరు కానున్నాయి. కానీ రూ.70 కోట్లతో ఆలయంలో ఏమేం పనులు చేయాలనేదానిపై మాస్టర్‌ ప్లాన్‌ కింద ప్రతిపాదనలు ఆలయ అధికారులు పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు ఏయే పనులకు పచ్చజెండా ఊపుతుందనేది సస్పెన్స్‌గా మారింది. తొలి విడత ఏయే పనులు ప్రాధాన్యంగా తీసుకుంటుందనే అధికారులకూ సమాచారం లేదు. అయితే తొలుత అత్యవసరమైన మూడు పనులకు శ్రీకారం చుడితేనే దేవస్థానం సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ముఖ్యంగా వ్రతాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఏటా ఆలయంలో ఆరు లక్షల వ్రతాలు జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా 70 శాతం రూ.300 వ్రతాలే.ఆ తర్వాత రూ.800, రూ.1500 వ్రతాలు కూడా జరుగుతాయి.

  ఇది చదవండి: సీఎం జగన్ నివాసం వద్ద గోశాల... ఎంత అద్భుతంగా ఉందో చూడండి..!


  అయితే సాధారణ భక్తు లు సత్యదేవుడి దర్శనానికి వెళ్లాలంటే ఈ వ్రత మండపాల పక్కనుంచే వెళ్లాలి. అటు వ్రతాలు పూర్తిచేసుకున్న వేలాది జంటలు కూడా ఇదే క్యూలైన్‌లో కలుస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా రద్దీ పెరిగిపోతోంది. దీంతో వివాహాలు, కార్తీకమాసం, ఇతర ముఖ్యమైన రోజుల్లో దర్శనానికి నాలుగు గంటలకుపైగానే పడుతోంది. దీంతో భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.300 వ్రతమండపాలను టీటీడీ సత్రం ప్రదేశంలో మూడంతస్తుల్లో నిర్మించి అక్కడి నుంచి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుచేసి నేరుగా ప్రధానాలయానికి క్యూలైన్‌ నిర్మించాలి. తద్వారా 70 శాతం మంది భక్తులు బయటమార్గం నుంచే స్వామిదర్శనం చేసుకోవచ్చు. రద్దీ రోజుల్లోనూ అర గంటలోనే అంతా దర్శనం చేసుకునే వీలు కలుగుతుంది.

  ఇది చదవండి: ఏపీలో ఇళ్ల పథకానికి లైన్ క్లియర్.. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు..


  ప్రసాద్‌ పథకం కింద దీన్ని తొలుత చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఆలయంలో నిత్యాన్నదాన భవనం చాలినంత లేక ఇబ్బందిగా మారింది. ప్రస్తుత భవనంలో ఒకే సమయంలో నాలుగు వందల మందికి మించి కూర్చునే వీలులేదు. దీంతో ఆలస్యం అవుతుందనే కారణంతో వేలాది మంది భక్తులు అన్నప్రసాదం తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో రత్న, సత్యగిరికి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మూడంతస్తుల్లో వెయ్యి మంది ఒకేసారి కూర్చుని అన్న ప్రసాదం స్వీకరించే హాలు నిర్మించాల్సి ఉంది. భక్తులను వేధిస్తున్న మరో సమస్య వసతి. ఇప్పటికే శివసదన్‌ కాటేజీ 138 గదులతో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో గదులు పెరుగుతాయనుకునేలోపు పాత సెంటినరీ, సత్యదేవ అతిథిగృహం కాటేజీలు శిథిలావస్థకు చేరడంతో అవి తొలగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త డార్మెటరీలు నిర్మించి స్నానపుగదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి మండపాలను నిర్మించాలి. వీటికి ఈ పథకంలో ఎన్నాళ్లకు చోటు కల్పిస్తారో చూడాలి.

  మీ నగరం నుండి (విశాఖపట్నం)

  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Hindu Temples

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు